ఆర్థిక ప్రణాళిక..ఇలా ఉంటే బాగు...

ఒక ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, దాని సాధనకు ప్రయత్నించడం ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దీన్ని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లినప్పుడే అనుకున్నది సాధ్యమవుతుంది.

Published : 14 Apr 2023 00:35 IST

ఒక ఆర్థిక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, దాని సాధనకు ప్రయత్నించడం ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దీన్ని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లినప్పుడే అనుకున్నది సాధ్యమవుతుంది. ముఖ్యంగా కొత్తగా ఆర్జించడం మొదలు పెట్టిన వారు ఏం చేయాలి? తెలుసుకుందాం..

* ఆర్థిక ప్రణాళికలో మొదటి అడుగు లక్ష్యాలను గుర్తించడం. మీ ఆకాంక్షల ఆధారంగా వాటిని, స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు స్వల్పకాలిక లక్ష్యం ఉన్నత విద్యను అభ్యసించడం, వాహనం కొనుగోలు లాంటివి ఉండొచ్చు. మధ్యంతర కాలంలో పెళ్లి, ఇల్లు కొనుగోలులాంటివి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యాలుగా పదవీ విరమణ ప్రణాళికలను చెప్పుకోవచ్చు.

* మీ లక్ష్యాలను గుర్తించిన తర్వాత, వాటి ప్రాధాన్యాలను చూడాలి. అప్పుడే జీవితంలో ప్రతి దశకూ సరైన పెట్టుబడి సాధనాలను ఎంచుకునేందుకు వీలవుతుంది. ఒక్కో దశలో ఎదురయ్యే డబ్బు అవసరాల గురించి ఒక స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా మన ఆర్థిక ప్రణాళిక తోడ్పడాలి.

* అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా ఉండేలా ప్రణాళిక ఉండాలి. దీనికోసం జీవిత బీమా పాలసీ ఉండటం తప్పనిసరి. యువకులుగా ఉన్నప్పుడే బీమా పాలసీలను తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. వయసు పెరిగినా అదే ప్రీమియం కొనసాగుతుంది.

* మొత్తం పెట్టుబడులు ఒకేచోట ఉండటం ఎప్పుడూ సరికాదు. అది సరైన రాబడిని అందించకపోతే.. భారీ నష్టాలు వస్తాయి. 30 ఏళ్లు అంతకు మించి వ్యవధికి పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీ పోర్ట్‌ఫోలియో భిన్నంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. దీనివల్ల నష్టభయం తగ్గి, రాబడి మెరుగ్గా ఉంటుంది.

* కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు వీటిని తేలిగ్గా ఉపయోగించుకునే వీలుండాలి.

* పెట్టుబడులను మీ లక్ష్యాలతో అనుసంధానం చేయకపోతే దీర్ఘకాలం వాటిని కొనసాగించలేరు. కాబట్టి, వీలైనంత వరకూ ఆ లక్ష్యాన్ని సాధించేదాకా పెట్టుబడిని వెనక్కి తీసుకోవద్దు.

అనూప్‌ సేథ్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు