పెద్దల పొదుపు పథకం నిబంధనలు మారాయ్‌

క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే పెద్దలకు ఉన్న పథకాల్లో చెప్పుకోదగ్గది సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీం. ఇటీవల ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది

Updated : 29 Nov 2023 17:12 IST

క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే పెద్దలకు ఉన్న పథకాల్లో చెప్పుకోదగ్గది సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీం. ఇటీవల ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సవరణలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
* పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇకపై పదవీ విరమణ ప్రయోజనాలు అందిన మూడు నెలల వరకూ వాటిని ఈ పథకంలో మదుపు చేయొచ్చు. 55-60 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇది వరిస్తుంది. గతంలో ఈ గడువు నెల వరకే ఉండేది.
* ఉద్యోగంలో ఉండగానే మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల పెట్టుబడి నిబంధనలు సైతం మారాయి. 50 ఏళ్లు దాటి సర్వీసులో ఉండగా మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు లభించిన ఆర్థిక పరిహారాన్ని ఈ పథకంలో మదుపు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
* పదవీ విరమణ ప్రయోజనాల నిర్వచనమూ మారింది. ఉద్యోగ విరమణ వల్ల అందే ప్రతి చెల్లింపులనూ రిటైర్మెంట్‌ ప్రయోజనాల కిందే పరిగణిస్తారు. భవిష్య నిధి, గ్రాట్యుటీ, ఇతర పింఛన్లు, మిగిలిపోయిన సెలవులపై చెల్లింపులు, బీమా పథకాలకు సంబంధించిన పొదుపు మొత్తం, ఎక్స్‌గ్రేషియా.. ఇలా అన్నీ పదవీ విరమణ ప్రయోజనాల కిందకే వస్తాయి. వీటన్నింటినీ సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్స్‌ స్కీం (ఎస్‌సీఎస్‌ఎస్‌)లో పెట్టుబడి పెట్టొచ్చు.
* ముందస్తు ఉపసంహరణ నిబంధనల్లోనూ కొత్త మార్పులు వచ్చాయి. ఎస్‌సీఎస్‌ఎస్‌లో డిపాజిట్‌ చేసిన ఏడాదిలోపు ఉపసంహరించుకుంటే.. మొత్తం నుంచి ఒక శాతం కింద రుసుము వసూలు చేస్తారు. ఇంతకుముందు వడ్డీ మాత్రమే తిరిగి తీసుకొని, డిపాజిట్‌ మొత్తాన్ని ఇచ్చేసేవారు.
* ఎస్‌సీఎస్‌ఎస్‌ పొడిగింపుపై ప్రస్తుతం ఉన్న పరిమితిని ప్రభుత్వం పొడిగించింది. ఖాతాదారులు ఇకపై మూడేళ్ల చొప్పున వ్యవధిని పొడిగించుకుంటూ వెళ్లవచ్చు. దీనికి ఎలాంటి పరిమితీ లేదు. కానీ, ప్రతిసారీ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో కేవలం ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉండేది. మెచ్యూరిటీ తేదీ నాడు ఉన్న    వడ్డీ రేటే వర్తిస్తుంది.
* ఖాతా తెరిచే సమయంలో డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని మాత్రమే కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. మధ్యలో అదనపు మొత్తాన్ని జమ చేసేందుకు అవకాశం ఉండదు. స్కీమ్‌ పొడిగించుకునే సమయంలోనూ అదనపు మొత్తాన్ని డిపాజిట్‌ చేసే వీలుండదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే.. నిబంధనల ప్రకారం కొత్త ఖాతాను తెరిచి, గరిష్ఠ పరిమితి మేరకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకంలో రూ.30 లక్షల వరకూ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారులు మరణిస్తే.. జీవిత భాగస్వామి దాన్ని కొనసాగించొచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని