వాహనానికి ధీమాగా

మన దేశంలో దాదాపు 30 కోట్లకు పైగా మోటారు వాహనాలున్నాయని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో 50 శాతం వాహనాలకే బీమా రక్షణ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం కనీసం థర్డ్‌ పార్టీ బీమా ఉండాలన్న నిబంధన ఉంది.

Updated : 29 Nov 2023 17:17 IST

మన దేశంలో దాదాపు 30 కోట్లకు పైగా మోటారు వాహనాలున్నాయని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో 50 శాతం వాహనాలకే బీమా రక్షణ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం కనీసం థర్డ్‌ పార్టీ బీమా ఉండాలన్న నిబంధన ఉంది. అయినప్పటికీ ఎన్నో వాహనాలు కనీస బీమా పాలసీ లేకుండానే రోడ్లపై దూసుకెళ్తున్నాయి.

ప్రమాదం లేదా ఏదైనా ఇతర ఊహించని సంఘటనల నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని నివారించేందుకు మోటారు బీమా పాలసీ ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, చాలామంది దీనిపై నిర్లక్ష్యంగానే ఉంటారన్నది వాస్తవ పరిస్థితులను చూస్తుంటే అర్థం అవుతుంది. దీనికి ప్రధాన కారణం.. బీమా అందించే ప్రయోజనాలపై పూర్తిగా అవగాహన లేకపోవడమే. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా బీమా తీసుకుంటున్నారు. ఒకటి, రెండేళ్లపాటు దాన్ని పునరుద్ధరించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోరు. పునరుద్ధరణ వల్ల పెద్దగా ఫలితం ఉండదని భావిస్తుంటారు. కానీ, వాహనం ఉన్నప్పుడు తప్పనిసరిగా బీమా ఉండాలన్న సంగతిని ఎప్పుడూ విస్మరించకూడదు.

  • ఇది వరకే చెప్పినట్లు మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం మన దేశంలో రోడ్లపై తిరిగే ప్రతి వాహనానికీ కనీసం థర్డ్‌-పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. మీ వాహనం వల్ల మూడో పక్షానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఈ బీమా పాలసీ ద్వారా పరిహారం అందుతుంది.
  •  ప్రమాదం ఎప్పుడు, ఎలా ఎదురవుతుందో చెప్పలేం. కాబట్టి, ఈ పాలసీ ఉండటం తప్పనిసరి. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కారు ప్రమాదంలో ఎవరికైనా గాయం అయితే.. ఆసుపత్రి చికిత్సను వాహనదారుడే భరించాల్సి వచ్చిందనుకోండి. ఆర్థికంగా ఇది ఎంత భారమో ఆలోచించండి.
  •  వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా ఉంటే.. ఇలాంటి సందర్భాల్లో పరిహారాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి, కారు యజమాని లేదా డ్రైవర్‌కు ఎలాంటి ఆర్థిక బాధ్యతా ఉండదు. థర్డ్‌ పార్టీ బీమా లేకుండా వాహనాన్ని నడిపినప్పుడు జరిమానా వేయొచ్చు. కొన్నిసార్లు డ్రైవింగ్‌ లైసెన్సును తాత్కాలికంగా లేదా శాశ్వతంగానూ రద్దు చేయొచ్చు.
  • కొంతమంది థర్డ్‌ పార్టీ బీమా పాలసీ తీసుకొని, పూర్తి స్థాయి వాహన బీమాను విస్మరిస్తుంటారు. ప్రమాదం కారణంగా వాహనం దెబ్బతిన్నప్పుడు మరమ్మతు చేయించేందుకు అయ్యే ఖర్చు అధికంగానే ఉంటుంది. ఇలాంటప్పుడు పూర్తి స్థాయి బీమా పాలసీనే ఆదుకుంటుంది. దొంగతనం, వరదలు తదితర నష్టాల సందర్భంలోనూ పూర్తి స్థాయి బీమా ద్వారా పరిహారం లభిస్తుంది. అదే సమయంలో ఇందులో థర్డ్‌ పార్టీ బీమా కలిసి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి.

  • వాహన బీమాలో వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీనీ కొనుగోలు చేయొచ్చు. చాలా సందర్భాల్లో ఇది పాలసీలోనే ఉంటుంది. కొన్నిసార్లు అనుబంధ పాలసీగానూ కొనుగోలు చేయొచ్చు. దీంతోపాటు, అవసరాన్ని బట్టి, మోటార్‌ బీమా పాలసీ అందించే రైడర్లనూ పరిశీలించవచ్చు.

రాఘవేంద్ర రావు, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, ఫ్యూచర్‌ జెనరాలీ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని