బ్యాంకింగ్‌ రంగంలో పెట్టుబడి..

డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక బ్యాంకింగ్‌-ఆర్థిక సేవల పథకాన్ని ఆవిష్కరించింది. డీఎస్‌పీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 4. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ తరగతికి చెందిన థీమ్యాటిక్‌ ఫండ్‌. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి

Updated : 29 Nov 2023 17:11 IST
డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక బ్యాంకింగ్‌-ఆర్థిక సేవల పథకాన్ని ఆవిష్కరించింది. డీఎస్‌పీ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 4. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ తరగతికి చెందిన థీమ్యాటిక్‌ ఫండ్‌. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. ఎంతో వేగవంతమైన వృద్ధి నమోదు అవుతున్న బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాలకు చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన వ్యూహం. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఎంతో కాలంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్లను నిర్వహిస్తున్నాయి. ఈ పథకాలు గత పదేళ్ల కాలంలో 15 శాతానికి పైగా ప్రతిఫలాన్ని అందించాయి. ఫండ్‌ మేనేజర్లు: ధావల్‌ గడ, జే కొఠారి.

ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో...

కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక థీమ్యాటిక్‌/సెక్టోరియల్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. హెల్త్‌కేర్‌ను థీమ్‌గా తీసుకొని, కోటక్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ను ఈ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ తీసుకొచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 4న ముగియనుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఫార్మా, ఆరోగ్య సేవల రంగాలకు చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి, అధిక లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఫార్మా, ఆరోగ్య సేవల రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తలసరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ వైద్య సేవల కోసం ఎక్కువ సొమ్మును ఖర్చు చేసేందుకు ప్రజలు వెనకాడటం లేదు. అందువల్ల హెల్త్‌కేర్‌ రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి లాభదాయకంగా మారుతుందనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో ఉంది. నిఫ్టీ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌తో ఈ  పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఫండ్‌ మేనేజర్లు: సిర్కార్‌ కురియన్‌, ధనుంజయ్‌ టికారిహ, అర్జున్‌ ఖన్నా, అభిషేక్‌ బైసెన్‌.


బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నుంచి..

ఇటీవల మ్యూచువల్‌ ఫండ్ల విభాగంలోకి అడుగుపెట్టిన బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఏఎంసీ కొత్తగా ఒక బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ (బీఏఎఫ్‌)ను రూపొందించింది. ఈ పథకం డైనమిక్‌ అస్సెట్‌ అలకేషన్‌ విభాగానికి చెందినది కావటం గమనార్హం. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 8న ముగుస్తుంది. నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 50: 50 ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడిగా పెట్టాలి.  ‘బిహేవియరియల్‌ సైన్స్‌ ఆధారంగా పెట్టుబడి వ్యూహాలను నిర్దేశించుకోవటం ఈ పథకంలోని ప్రత్యేకత. తద్వారా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుందని ఫండ్‌ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లు: నిమేష్‌ చందన్‌, సోర్బ్‌ గుప్తా, సిద్ధార్థ చౌదరి.


సిప్‌ మరింత సులభంగా..

క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)లో మదుపు చేయాలనుకునే వారు యూపీఐ ఆధారిత చెల్లింపులు చేసే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. కేఫిన్‌టెక్‌, బిల్‌డెస్క్‌ సహకారంతో ఈ రంగంలో తొలిసారిగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ పేర్కొంది. మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారులు యూపీఐని ఉపయోగించి, సిప్‌ ఆదేశాలను నమోదు చేసుకోవచ్చు. నిర్ణీత తేదీనాడు ఆ మొత్తం బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది. దీనివల్ల పెట్టుబడి ప్రతి నెలా కచ్చితంగా అదే తేదీనాడు జమ అయ్యేందుకు వీలుంటుందని మిరే అసెట్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని