పన్ను ప్రణాళిక ఆర్థిక లక్ష్యం నెరవేరేలా...

ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలామందికి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) ప్రారంభమయ్యింది. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి

Published : 01 Dec 2023 01:37 IST

ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలామందికి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) ప్రారంభమయ్యింది. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి. అవి మన ఆర్థిక లక్ష్యాలను తీర్చేలా ఉండాలి. అప్పుడే రెండు విధాలా లాభం.

చాలామంది ఫిబ్రవరి తర్వాతే పన్ను మినహాయింపు పథకాల్లో మదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. గడువు దగ్గరకు వస్తున్న కొద్దీ సరైన పథకాలను ఎంపిక చేసుకోవడంలో పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల లక్ష్యం కేవలం పన్ను ఆదా ఒక్కటే కాకూడదు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఎలాంటి పెట్టుబడులను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో కొనసాగాలి అనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

 లెక్క వేసుకోండి...

  • ముందుగా ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైటులో ఉన్న ట్యాక్స్‌ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి, మీకు ఎంత పన్ను పడే అవకాశం ఉందో తెలుసుకోండి. కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది లాభదాయకమో ముందు తెలుసుకోండి. ఆ తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించండి.
  • ఇక పాత పన్నుల విధానం ఎంచుకొని, పన్ను మినహాయింపు పథకాల్లో మదుపు చేయాలనుకుంటే...
  •  పన్ను ఆదాకు ఉపయోగపడేది ప్రధానంగా సెక్షన్‌ 80సీ. ఇందులో గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయొచ్చు. ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, జాతీయ పొదుపు పత్రాలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, గృహరుణం అసలు, జీవిత బీమా ప్రీమియం ఇలా అన్నీ ఈ సెక్షన్‌ కిందకే వస్తాయి.
  • సెక్షన్‌ 80డీ కింద రూ.25,000 వరకూ ఆరోగ్య బీమా ప్రీమియాన్ని క్లెయిం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల కోసం పాలసీ తీసుకుంటే.. రూ.25,000 (సీనియర్‌ సిటిజన్లయితే రూ.50వేలు) వరకూ అదనంగా మినహాయింపు లభిస్తుంది.
  •  సెక్షన్‌ 80సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి రూ.50వేలు ఇలా అందుబాటులో ఉన్న మార్గాలన్నీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నించవచ్చు.
  • పెట్టుబడులు భవిష్యత్‌ భరోసాకు ఉపయోగపడేలా ఉండాలి. కేవలం పన్ను ఆదా కోసం పెట్టుబడులను ఎంచుకోవడం సరికాదు. ఉదాహరణకు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మదుపు చేసి, పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ, ఇవి మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. నష్టభయం ఉంటుంది. ఏమాత్రం నష్టం భరించలేని వారికి ఇవి సరిపోవు. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఇవి పనికొస్తాయి. పన్ను ఆదా అనేది ఈ పథకాలకు వర్తించే అదనపు ప్రయోజనంగానే చూడాలి.
  •  చాలామంది పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక లక్ష్యాల కోసం పన్ను ఆదా పథకాలను ఎంచుకుంటారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. పిల్లల ఉన్నత చదువులు, పదవీ విరమణ ప్రణాళికలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పథకాల ఎంపిక జరగాలి. పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలన్న సూత్రాన్ని మర్చిపోకుండా.. దీర్ఘకాలంలో మంచి రాబడితోపాటు, వచ్చిన రాబడికి పన్ను ప్రయోజనాలను అందించే పథకాలను ఎంచుకోవాలి. షేర్లు, స్థిరాస్తి పెట్టుబడులు, మ్యూచువల్‌ ఫండ్లు ఇందులో ఉండాలి.
  •  పన్ను ప్రణాళికను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. పన్ను నిబంధనలు, చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. గత ఏడాది ప్రణాళిక ఈసారి పనికి రాకపోవచ్చు. ఇప్పుడు కొత్త, పాత పన్నుల విధానం అమల్లో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ప్రయోజనమో ముందే చూసుకోవాలి. దాన్ని బట్టి, ఆప్షన్‌ ఇవ్వాలి. పూర్తి వివరాల కోసం మీ కార్యాలయంలో సంప్రదించండి.

ఆదాయపు పన్ను భారం తగ్గించుకోవడం ఒక్కటే లక్ష్యంగా జీవిత బీమా పాలసీల్లాంటివి తీసుకోవద్దు. మీ అవసరం ఏమిటన్నది చూసుకొని, సరైన మొత్తానికి పాలసీని తీసుకోవాలి. దీంతోపాటు.. మీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఉపయోగపడే విధంగా పెట్టుబడులు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని