ప్రయాణ బీమా..క్లెయిం చేసుకోవాలంటే...

Published : 01 Dec 2023 02:02 IST

విదేశీ విహార యాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు ప్రయాణ బీమా తీసుకోవడం మంచిది. దేశం కాని దేశంలో వైద్య అవసరాలు ఏర్పడినప్పుడు, ప్రయాణం రద్దు, విమానాల ఆలస్యం, సామగ్రి, పాస్‌పోర్ట్‌ పోవడంలాంటి నష్టాలన్నింటికీ ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. మరి అనుకోని పరిస్థితుల్లో ఈ పాలసీని క్లెయిం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా.

పరాయి దేశంలో ఉన్నప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ప్రయాణ సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే? మీరు ముందే మంచి ప్రయాణ బీమా పాలసీని తీసుకుంటే.. ఇలాంటప్పుడు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా బీమా కంపెనీకి ఇ-మెయిల్‌ చేయడం లేదా అత్యవసర సహాయ కేంద్రానికి ఫోన్‌ చేయడం ద్వారా సమాచారం ఇవ్వండి. అక్కడి పరిస్థితి గురించి పూర్తి వివరాలు అందించాలి. వైద్యుల చికిత్స నివేదికతోపాటు అవసరమైన పత్రాలను అందించాలి. బీమా సంస్థ పూర్తి వివరాలను పరిశీలించి, క్లెయిం ఆమోదయోగ్యంగా ఉండి, నెట్‌వర్క్‌ ఆసుపత్రి అయితే.. ఆసుపత్రికి నేరుగా బిల్లును చెల్లిస్తుంది. నగదు రహిత సదుపాయం అందుబాటులో లేకపోతే.. ముందుగా మనమే చెల్లించి, ఆ తర్వాత బీమా కంపెనీకి తిరిగి చెల్లించాల్సిందిగా కోరుతూ దరఖాస్తు చేయాలి.

  •  రద్దు చేసుకుంటే: అనివార్య కారణాలతో మీరు ప్రయాణాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నా, తీవ్రమైన ఆరోగ్య సమస్య, కుటుంబంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని కుదించుకున్నా బీమా కంపెనీకి తెలియజేయాలి. క్లెయిం పత్రాన్ని పూరించేటప్పుడు అవసరమైన పత్రాలను జత చేయాలి. పాలసీ కవరేజీ, నిబంధనలు, షరతులను బట్టి, బీమా సంస్థ ఆ క్లెయింను పరిష్కరించి, తగిన పరిహారాన్ని అందిస్తుంది. రిఫండ్‌ చేయని హోటల్‌ బుకింగ్‌లు, విమాన టిక్కెట్ల వంటి ముందస్తుగా చెల్లించిన ఖర్చులను మాత్రమే ప్రయాణ బీమా పాలసీ చెల్లిస్తుందని గమనించండి.
  •  సామగ్రి కోల్పోవడం: ప్రయాణాల్లో మన సామగ్రిని కోల్పోవడం చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అవసరమైన వస్తువులు లేకుండా ఉండటం చాలా కష్టం. ఇలాంటి ఊహించని పరిస్థితుల్లో పాలసీలో పేర్కొన్న మొత్తాన్ని అందించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూస్తుంది. ఈ విషయాన్ని బీమా సంస్థకు తెలియజేసినప్పుడు, వారు అవసరమైన మార్గనిర్దేశం చేస్తారు. బ్యాగేజీ పూర్తిగా నష్టపోయినప్పుడు మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. పాక్షిక నష్టానికి సంబంధించిన పరిస్థితుల్లో బీమా కంపెనీ పరిహారం ఇవ్వదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ విమాన సంస్థ సగం పరిహారం ఇస్తే.. మిగతా మొత్తాన్ని మాత్రమే బీమా సంస్థ చెల్లిస్తుంది. ఉదాహరణకు నష్టం రూ.20వేలు అనుకుందాం. ఇందులో రూ.5వేలను విమాన సంస్థ చెల్లిస్తే.. మిగతా రూ.15 వేలను బీమా సంస్థ ఇస్తుంది.
  • బ్యాగేజీ ఆలస్యం: మీరు గమ్యస్థానానికి చేరుకున్నారు. అక్కడ కొత్త ప్రదేశాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ, మీకు బ్యాగేజీ రాలేదు అనుకోండి. ఇది మీ ప్రయాణ ప్రణాళికలను మొత్తం మార్చేస్తుంది. ఇలాంటప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. మీ పరిస్థితి గురించి ముందుగా విమాన సంస్థ ప్రతినిధులకు తెలియజేయాలి. వారు మీకు సహాయం చేస్తారు. ఒకవేళ మీ సామాను వేరే గమ్యస్థానానికి చేరుకోవడం లేదా విమానాశ్రయంలోనే వదిలి వేసే అవకాశాలు ఉంటాయి. బ్యాగేజీ రావడానికి కొన్ని గంటల నుంచి రోజుల వ్యవధి పట్టొచ్చు. ప్రయాణ బీమా ఉంటే.. మీకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు పాలసీ నిబంధనల ప్రకారం నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. క్లెయింను దాఖలు చేస్తున్నప్పుడు బోర్డింగ్‌ పాస్‌లు, బ్యాగేజీ క్లెయిం ట్యాగ్‌లు, అవసరమైన పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.
  •  పాస్‌పోర్ట్‌ పోతే: విదేశీ ప్రయాణాల్లో పాస్‌పోర్ట్‌ అత్యంత ముఖ్యమైన పత్రం. దీన్ని పోగొట్టుకుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాస్‌పోర్టు పోయినట్లు గుర్తించిన వెంటనే అక్కడి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ కాపీని తీసుకోవాలి. సమీపంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. మీకు అక్కడ అత్యవసర ప్రయాణ పత్రాన్ని లేదా పాస్‌పోర్ట్‌ను జారీ చేసే అవకాశం ఉంది. క్లెయిం ప్రాసెస్‌ కోసం బీమా సంస్థకు ఈ విషయాన్ని తెలియజేయాలి. కొత్త పాస్‌పోర్టు పొందే ప్రక్రియలో చేసిన ఖర్చులను ప్రయాణ బీమా పాలసీ చెల్లిస్తుంది.

    క్లెయిం దాఖలుకు అవసరమైన పత్రాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. ఉదాహరణకు వైద్య నివేదికలు, రశీదులు, పోలీసు నివేదికలు మొదలైనవి. క్లెయిం ఫారాన్ని పూర్తిగా పూరించండి. అవసరమైన అన్ని వివరాలనూ అందించండి. అప్పుడు బీమా సంస్థ మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. క్లెయిం ఆమోదయోగ్యం అయినప్పుడు పరిహారాన్ని చెల్లిస్తుంది.

ఆశిష్‌ సేథి, హెడ్‌, హెల్త్‌ - ట్రావెల్‌ బిజినెస్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని