పిల్లలకు ఆర్థిక భద్రత..

యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా యూనియన్‌ చిల్డ్రన్‌ ఫండ్‌ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. కానీ, కనీసం అయిదేళ్లపాటు లేదా మైనర్‌ పిల్లలు మేజర్‌ అయ్యే వరకూ లాకిన్‌ నిబంధన వర్తిస్తుంది.

Published : 01 Dec 2023 02:07 IST

యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా యూనియన్‌ చిల్డ్రన్‌ ఫండ్‌ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. కానీ, కనీసం అయిదేళ్లపాటు లేదా మైనర్‌ పిల్లలు మేజర్‌ అయ్యే వరకూ లాకిన్‌ నిబంధన వర్తిస్తుంది. అంటే అప్పటి వరకూ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 12. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఈక్విటీతోపాటు రుణ పెట్టుబడులు పెట్టడం ద్వారా మదుపరులకు అధిక లాభాలు తెచ్చిపెట్టడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ద్రవ్యోల్బణం అధికంగా ఉంటున్న పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్‌ అవసరాలకు నిధులు సమకూర్చడం తల్లిదండ్రులకు శక్తికి మించిన భారంగా మారుతోంది. కాబట్టి, పిల్లల భవితకు ఇబ్బంది ఉండకూడదనుకునే తల్లిదండ్రులు ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించవచ్చు. దీనికి ఫండ్‌ మేనేజర్లు హార్దిక్‌ బోరా, సంజయ్‌ బెంబాల్కర్‌, పరిజాత్‌ అగర్వాల్‌.


పెట్టుబడులు.. విభిన్నంగా

శామ్‌కో డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ అనే వినూత్నమైన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని శామ్‌కో మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఒక రకంగా ఇది మొమెంటమ్‌ ఫండ్‌ అని చెప్పుకోవచ్చు. మార్కెట్‌ స్థితిగతులను బట్టి పెట్టుబడులను ఈక్విటీలోకి లేదా రుణపత్రాలకు వేగంగా మార్చటం ద్వారా నష్టాలు తగ్గించుకొని అధిక లాభాలు నమోదు చేసేందుకు ఈ ఫండ్‌ నిర్వాహకులు ప్రయత్నిస్తారు. ఇప్పటి వరకూ ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు హైబ్రీడ్‌ బీఏఎఫ్‌ (బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌), డీఏఏఎఫ్‌ (డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌)లు పీబీ (ప్రైస్‌-టు-బుక్‌), పీఈ (ప్రైస్‌ ఎర్నింగ్స్‌) ఆధారిత ‘వాల్యుయేషన్‌ మోడల్‌’ను అనుసరిస్తున్నాయి. కానీ ‘శామ్‌కో డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ మాత్రం ‘మొమెంటమ్‌ మోడల్‌’ను పాటిస్తుంది. తద్వారా ఇదొక భిన్నమైన పథకం అవుతుందని దీన్ని ఆవిష్కరించిన శామ్‌కో మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంటోంది. ఈక్విటీ మార్కెట్‌ తీరుతెన్నులు, 52 వారాల గరిష్ఠ- కనిష్ఠ ధరలు, షేర్‌ ధర ధోరణి, ట్రేడింగ్‌ వాల్యూమ్‌, ఆప్షన్స్‌లో హెచ్చుతగ్గులు, వీఐఎక్స్‌, మార్కెట్‌ క్యాప్‌ టు జీడీపీ, మనీ సప్లై, బాండ్లపై లభించే వడ్డీ రేటు, యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయాలు... తదితర అంశాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోను నిత్యం సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. ‘శామ్‌కో డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 7 నుంచి 21న వరకూ ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ‘నిఫ్టీ50 హైబ్రీడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 50: 50 ఇండెక్స్‌’తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఫండ్‌ మేనేజర్లు: పరస్‌ మటాలియా, ఉమేష్‌ కుమార్‌ మెహతా, ధావల్‌ ఘన్‌శ్యామ్‌ ధనాని.


 పెద్ద..మధ్యస్థాయి కంపెనీల్లో

వైట్‌వోక్‌ కేపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ‘వైట్‌ఓక్‌ కేపిటల్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌’ అనే ఒక నూతన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 15. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఈ పథకం కింద ప్రధానంగా పెద్ద, మధ్యస్థాయి కంపెనీలతో పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తారు. పెద్ద కంపెనీలకు 40 శాతం, మధ్యస్థాయి కంపెనీలకు 60 శాతం పెట్టుబడులు కేటాయించే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్లు వీలు కల్పిస్తాయనేది తెలిసిన విషయమే. అందుకే దాదాపు అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఇలాంటి పథకాలను నిర్వహిస్తున్నాయి. ఈ పథకం పనితీరును ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 250 లార్జ్‌ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐతో పోల్చి చూస్తారు. ఫండ్‌ మేనేజర్లు.. రమేష్‌ మంత్రి, తృప్తి అగర్వాల్‌, పియూష్‌ బరన్వాల్‌, షరిక్‌ మర్చంట్‌.


ఉత్పత్తి రంగంపై విశ్వాసంతో

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, కొత్తగా ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులకు అవకాశం కల్పిస్తూ ఒక థీమ్యాటిక్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. యాక్సిస్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫండ్‌, అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 15న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌లో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. మనదేశంలో ఉత్పత్తి రంగం వచ్చే దశాబ్దకాలం పాటు గణనీయమైన వృద్ధి సాధిస్తుందనే అంచనాలు ఉన్న విషయం విదితమే. ప్రధానంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించే ఉద్దేశంతో ఈ ఫండ్‌ను యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూపొందించింది. అధికోత్పత్తి, అధిక ఎగుమతులు సాధించే కంపెనీలను గుర్తించి పెట్టుబడులు పెట్టటం ఈ పథకం వ్యూహంగా ఉంది. ఫండ్‌ మేనేజర్లు.. శ్రేయాష్‌ దేవల్కర్‌, నితిన్‌ అరోరా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని