పిల్లల భవితకు ఫండ్ల మార్గం

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కలలుకంటారు. వారికి ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఆకాంక్షను సాధించే క్రమంలో వారు తమ కష్టార్జితాన్ని పెట్టుబడులుగా మారుస్తారు.

Updated : 08 Dec 2023 07:17 IST

తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని కలలుకంటారు. వారికి ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఆకాంక్షను సాధించే క్రమంలో వారు తమ కష్టార్జితాన్ని పెట్టుబడులుగా మారుస్తారు. ఇందుకోసం అనేక పెట్టుబడి పథకాల మధ్య.. పిల్లల మ్యూచువల్‌ ఫండ్లు ఇటీవల కాలంలో ఆదరణ పొందుతున్నాయి. మరి, వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.. తెలుసుకుందాం.

ఈ రోజుల్లో విద్యా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం 2008తో పోలిస్తే వార్షిక విద్యా వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేందుకు పిల్లలకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల కోసం పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి అవసరంగా మారుతోంది.

ఏమిటీ పథకాలు?

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ప్రత్యేకంగా కొన్ని పథకాలను పిల్లల కోసం రూపొందిస్తున్నాయి. చైల్డ్‌ కెరియర్‌ ప్లాన్‌, చైల్డ్‌ గిఫ్ట్‌ ప్లాన్‌ వంటి పేర్లతో ఇప్పుడివి అందుబాటులోకి వస్తున్నాయి. గతంలోనూ ఈ పథకాలున్నాయి. కానీ, పిల్లల కోసం ప్రత్యేకంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంటంతో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫండ్‌ సంస్థలు కొత్త పథకాలనూ ఆవిష్కరించాయి. సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకాలకు అయిదేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. లేదా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందయితే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఇవి ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ పథకాలు. ప్రధానంగా ఈక్విటీ, డెట్‌లలో మదుపు చేస్తాయి. అధిక వడ్డీ కోసం కొంత మొత్తాన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు రుణం ఇచ్చేలా బాండ్లలోనూ కొంత పెట్టుబడి ఉంటుంది. మొత్తంగా వీలైనంత అధిక రాబడిని ఆర్జించేలా, అదే సమయంలో కొంత సురక్షితంగా ఉండేలా పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తాయి. ఈక్విటీల్లో 65 శాతం వరకూ, డెట్‌ ఫండ్లలో 35 శాతం వరకూ మదుపు  చేస్తాయి. కొన్నిసార్లు ఈక్విటీలకు 75 శాతం వరకూ కేటాయించే అవకాశాలూ ఉంటాయి.

లాభమేనా?

పిల్లల కోసం ప్రత్యేకించిన మ్యూచువల్‌ ఫండ్ల ప్రధాన లక్ష్యం.. వారి చదువులకు ఆ పెట్టుబడి ఉపయోగపడేలా చూడటమే. పిల్లలకు పెద్దవాళ్లయ్యే నాటికి పెద్ద మొత్తంలో నిధి జమ అయ్యేందుకు ఇవి సాయం చేస్తాయి. పిల్లల కోసం పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి, తొందరపడి వెంటనే వెనక్కి తీసుకోవద్దు. ఫండ్లలో దీర్ఘకాలం కొనసాగినప్పుడే పెట్టుబడి వృధ్ధికి అవకాశం ఉంటుంది. గత మూడేళ్ల కాలంలో ఈ విభాగంలోని పథకాలు సగటున 19.36 శాతం వరకూ రాబడినిచ్చాయి. అదే అయిదేళ్ల కాలానికి చూస్తే సగటు వార్షిక రాబడి రూ.12.69 శాతం వరకూ ఉంది.

లక్ష్యానికి తగ్గట్టుగా..

పిల్లల ఫండ్ల లక్ష్యం ఒకటే.. వారి భవిష్యత్తుకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం. వారి ఉన్నత చదువులు, విదేశీ విద్యాభ్యాసం,  ఇతర కలలకు తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టాలి. వీలైనంతగా ఈ లక్ష్యా సాధించే వరకూ ఈ మొత్తాన్ని వెనక్కి  తీసుకోకూడదు.

సమయం ఇవ్వాలి..

పెట్టుబడులు వృద్ధి చెందాలంటే.. వాటిని  దీర్ఘకాలం కొనసాగించాలి. పిల్లల పథకాల్లో  ఇదే సూత్రం ప్రధానం. అయిదేళ్లపాటు లాకిన్‌ ఉండటం వెనక లక్ష్యం ఇదే. పిల్లలు చిన్న వయసులో ఉండగానే పెట్టుబడులు ప్రారంభిస్తే.. వారు ఉన్నత చదువులకు వచ్చే నాటికి మంచి మొత్తం జమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు కొనసాగించాలి.

వైవిధ్యంగా..

పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేకించిన పథకాల్లో వైవిధ్యానికి చోటు ఉంటుంది. ఈక్విటీలు, డెట్‌లో ఇవి మదుపు చేస్తాయి. ఫలితంగా నష్టభయం పరిమితంగా ఉండటంతోపాటు, రాబడికీ వీలుంటుంది. వీటితోపాటు, నష్టభయం భరించగలిగే శక్తి ఉన్న తల్లిదండ్రులు ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.

నష్టభయం ఉన్నా..

ప్రతి పెట్టుబడికీ ఎంతోకొంత నష్టభయం ఉండటం సహజం. పిల్లల కోసం ప్రత్యేకించిన మ్యూచువల్‌ ఫండ్లకూ ఇది వర్తిస్తుంది. అధిక నష్టభయం ఉన్న చోట ఎక్కువ రాబడి ఉంటుందన్నది పెట్టుబడి సూత్రం. వ్యవధి గడుస్తున్న కొద్దీ మార్కెట్‌ ఆధారిత పెట్టుబడుల్లో నష్టభయం పరిమితం అవుతుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిదేళ్ల పాటు మదుపు చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడే వీటిని ఎంచుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు