ఆరోగ్య బీమా.. ఆర్థిక ధీమా అందించేలా..

ఆరోగ్య అత్యవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పడం కష్టం. మనం చేయాల్సిందల్లా.. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆర్థికంగా సిద్ధంగా ఉండటమే. పెరుగుతున్న వైద్య ఖర్చులకు తట్టుకునేందుకు సరైన ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఒక్కటే మార్గం.

Published : 08 Dec 2023 00:23 IST

ఆరోగ్య అత్యవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పడం కష్టం. మనం చేయాల్సిందల్లా.. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆర్థికంగా సిద్ధంగా ఉండటమే. పెరుగుతున్న వైద్య ఖర్చులకు తట్టుకునేందుకు సరైన ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఒక్కటే మార్గం. మంచి పాలసీని ఎంచుకునే విషయంలో చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు తప్పవు. కాబట్టి, ఆరోగ్య బీమాను తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.

చాలామంది ఉద్యోగులకు యాజమాన్యం అందించే బృంద ఆరోగ్య బీమా ఉంటుంది. అయినప్పటికీ సొంతంగా ఒక పాలసీ ఉండటం ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి. కొత్తగా పాలసీ తీసుకునే వారు, ఇప్పటికే పాలసీ ఉన్నవారూ ఈ బీమా విషయంలో కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉంది.

అవసరాలను గుర్తించండి

మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ సభ్యుల అవసరాలు ఏమిటి? ముందుగా వీటిని అర్థం చేసుకున్నాకే ఎలాంటి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలన్న విషయంలో ఒక ప్రాథమిక అంచనా వస్తుంది. వయసు, ముందుగా ఉన్న వ్యాధులు, జీవన శైలి, కుటుంబ భవిష్యత్‌ అవసరాలు ఇవన్నీ పాలసీ ఎంపికలో ముఖ్యమే. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలన్నదీ నిర్ణయించుకోవాలి. వీటన్నింటినీ బట్టి, మీ అవసరాలకు సరిపోయే సరైన పాలసీని ఎంచుకునేందుకు ప్రయత్నించాలి.

వేచి ఉండే వ్యవధి..

వైద్య బీమా పాలసీల్లో ఉండే ముఖ్యమైన నిబంధన వేచి ఉండే వ్యవధి. దీని గురించి ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు రెండు నుంచి నాలుగేళ్ల తర్వాతే కవరేజీ లభిస్తుందనే నిబంధన ఉంటుంది. ఏయే వ్యాధులకు ఇది వర్తిస్తుందన్నది చూసుకోవాలి. దీంతోపాటు ఉప పరిమితులనూ తెలుసుకోవాలి. కొన్ని రకాల చికిత్సలకు కొంత పరిమితిని విధిస్తారు. సాధ్యమైనంత తక్కువ వేచి ఉండే వ్యవధి ఉండాలి. ఉప పరిమితులు (సబ్‌ లిమిట్స్‌) ఉండకూడదు. ఇందుకోసం ఇప్పుడు కొన్ని పాలసీలు అనుబంధ పాలసీలను రైడర్ల రూపంలో అందిస్తున్నాయి. కాస్త ప్రీమియం పెరిగినా ఇలాంటి వాటిని ఎంచుకోవాలి.

సహ చెల్లింపు...

ప్రీమియం తక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు సహ చెల్లింపు నిబంధనతో పాలసీని తీసుకోవచ్చు. కానీ, ఇది కొన్నిసార్లు ఇబ్బందులు తెస్తుంది. ఉదాహరణకు రూ.1,00,000 బిల్లు అయ్యిందనుకుందాం. 10 శాతం సహ చెల్లింపు ఉందనుకుంటే.. రూ.10వేలు చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఆదా చేసిన ప్రీమియంతో పోలిస్తే ఇది చాలా అధికంగా ఉండొచ్చు. అందువల్ల వీలైనంత వరకూ సహ చెల్లింపు లేకుండా చూసుకోవడమే మంచిది. ఆరోగ్యం బాగాలేనప్పుడు.. ఇలాంటి చిన్న చిన్న మొత్తాలే ఎంతో అవసరం అవుతాయని గుర్తుంచుకోండి.

చరిత్ర చూడండి..

బీమా సంస్థ క్లెయిం పరిష్కార చరిత్ర చూడాలి. స్థిరంగా ఎక్కువ క్లెయింలను పరిష్కరిస్తున్న సంస్థ నుంచి పాలసీ తీసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని బీమా సంస్థలు తక్కువ ప్రీమియానికే పాలసీని అందిస్తుంటాయి. తీరా క్లెయిం చేసుకున్నప్పుడు ఎన్నో ప్రశ్నలను వేస్తుంటాయి. క్లెయింను తిరస్కరించేందుకే ప్రయత్నిస్తుంటాయి. ఇది మనకు ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. స్నేహ పూర్వకంగా ఉండే సంస్థల నుంచే ఆరోగ్య బీమాను తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

మినహాయింపులు...

కొన్నిసార్లు మీ పాలసీలో శాశ్వత మినహాయింపులు ఉండే అవకాశం ఉంది. కొన్నింటికి నిర్ణీత వ్యవధి తర్వాత అంగీకరిస్తారు. ఏయే చికిత్సలకు పరిహారం ఇవ్వరన్న సంగతిని ముందే తెలుసుకోండి. తీరా చికిత్సకు వెళ్లిన తర్వాత తిరస్కరిస్తే ఇబ్బంది అవుతుంది.

సమీక్షించుకోండి..

కొన్నేళ్ల క్రితం తీసుకున్న పాలసీ ఇప్పుడున్న అవసరాలకు సరిపోకపోవచ్చు. కాబట్టి, ఎప్పటికప్పుడు పాలసీని సమీక్షించుకోవడం మంచిది. మారిన పాలసీ నిబంధనలు, ఆసుపత్రుల వివరాలు పరిశీలించండి. అనుమానాలుంటే.. బీమా సలహాదారు లేదా కంపెనీ సహాయ కేంద్రాన్ని సంప్రదించి, వివరణ తీసుకోండి. పాలసీని పునరుద్ధరించుకునేటప్పుడు వచ్చిన పత్రాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే చాలా వివరాలు తెలుస్తాయి.

అన్ని ఖర్చులూ ఇస్తుందా?

ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు చాలామంది చేసే పొరపాటేమిటంటే.. ఏయే ఖర్చులకు పాలసీ పరిహారం ఇస్తుందన్న విషయాన్ని సరిగా తెలుసుకోరు. తీరా ఆసుపత్రిలో చేరిన తర్వాత, బీమా కంపెనీ కొన్ని ఖర్చులను చెల్లించేందుకు నిరాకరిస్తుంది. అప్పుడు ఆ భారం మనపై పడుతుంది. కాబట్టి, పాలసీని ఎంచుకునేటప్పుడు ఆసుపత్రిలో చేరినప్పుడు ఎలాంటి మినహాయింపులూ లేకుండా పరిహారం ఇస్తుందా లేదా అనే అంశాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆసుపత్రిలో చేరకముందు, ఇంటికి వెళ్లాక అయిన ఖర్చులనూ ఇచ్చేలా పాలసీ ఉండాలి. ముఖ్యంగా ప్రసూతి ఖర్చులు, తీవ్ర వ్యాధులకు వర్తింపులాంటి అంశాల గురించి పరిశీలించాలి.

నగదు రహిత చికిత్స...

అత్యవసరంలో డబ్బు కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉండాలి. అందుకు బీమా పాలసీ తోడ్పడాలి. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు ముందుగా ఎన్ని ఆసుపత్రులతో బీమా సంస్థకు ఒప్పందం ఉందన్న విషయాన్ని చూడాలి. మీ నివాసానికి దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటారనుకుందాం. అప్పుడు ప్రథమ శ్రేణి నగరాల్లోని ఆసుపత్రులకు వెళ్లడానికీ ఆర్థికంగా ఇబ్బంది ఉండకుండా పాలసీ అండగా ఉండాలి. వీలైనంత వరకూ నగదు రహిత చికిత్సను పొందేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని