Fixed Deposit: ఎఫ్‌డీ ఇవన్నీ తెలుసుకున్నాకే

పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ.. కావాల్సినంత వ్యవధికి ఎంచుకునే వెసులుబాటు.. చెప్పాలంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) అందించే ప్రయోజనాలు ఎన్నో.

Updated : 09 Feb 2024 07:28 IST

పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ.. కావాల్సినంత వ్యవధికి ఎంచుకునే వెసులుబాటు.. చెప్పాలంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) అందించే ప్రయోజనాలు ఎన్నో. కావాల్సినప్పుడు వెంటనే నగదును తీసుకునే వీలూ వీటిలో ఉంటుంది. ఇతర ఆర్థిక పథకాలతో దీన్ని కలిపి చూడలేం. ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో ఎఫ్‌డీలకు మరికొంత కాలం మంచి రోజులే ఉన్నట్లు చెప్పొచ్చు. అదే సమయంలో నిధుల సమీకరణకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో బ్యాంకులు వీటిపైనా 7-7.5 శాతానికి మించి హామీతో కూడిన వడ్డీ అందిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లనూ పెంచాయి. ఈ నేపథ్యంలో వీటిలో డబ్బు జమ చేసేవారు పరిశీలించాల్సిన కొన్ని విషయాలను పరిశీలిద్దాం..

  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) వేర్వేరు వడ్డీ రేట్లతో అందిస్తున్నాయి. కొన్ని చిన్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీని అందిస్తున్నాయి. మరికొన్ని కార్పొరేట్‌ సంస్థలూ దాదాపు 9-11 శాతం వడ్డీతో ఎన్‌సీడీలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి వాటిని ఎంచుకునేటప్పుడు క్రిసిల్‌, ఇక్రా వంటి రేటింగ్‌ ఏజెన్సీలు ఇచ్చిన రేటింగులను పరిశీలించడం తప్పనిసరి. మార్కెట్‌లో విశ్వసనీయతతోపాటు, జారీ చేసిన వారి రుణ చెల్లింపు సామర్థ్యం, గత చరిత్రలాంటి వన్నీ చూసి, నిర్ణయం తీసుకోవాలి. బ్యాంకులు కాకుండా ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్‌ బాండ్లలో డిపాజిట్‌ చేసేటప్పుడు అధిక రేటింగ్‌ ఉన్న వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి.  
  •  ఎఫ్‌డీలను క్యుములేటివ్‌, నాన్‌ క్యుములేటివ్‌ డిపాజిట్లుగా వర్గీకరించవచ్చు. క్యుములేటివ్‌ విధానంలో వడ్డీ ఏటా అసలుకు కలుస్తుంది. వ్యవధి తీరిన తర్వాత అసలు, వడ్డీ చెల్లిస్తారు. నాన్‌ క్యుములేటివ్‌ పద్ధతిలో నెల, మూడు, ఆరు నెలలు, ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తారు. 
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు నిర్ణీత వ్యవధి వరకూ కొనసాగుతాయి. మధ్యలో తీసుకుంటే కొంత అపరాధ రుసుము వర్తిస్తుంది. కాబట్టి, వ్యవధులను ఎంచుకునేటప్పుడు కాస్త ముందుచూపుతో వ్యవహరించాలి. వీలైనంత వరకూ ఒకే వ్యవధికి మొత్తం డిపాజిట్లు వేయొద్దు. వివిధ సందర్భాల్లో వచ్చే మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వ్యవధులను నిర్ణయించుకోవాలి. దీనివల్ల ఎలాంటి రుసుములూ లేకుండా డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు వీలవుతుంది.  

కొన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తక్కువ వడ్డీని అందిస్తూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఆ డిపాజిట్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా ఎఫ్‌డీ చేయాలి. దీనివల్ల వడ్డీని నష్టపోకుండా ఉండగలం. కనీసం అర శాతంకన్నా అధికంగా లభిస్తున్నప్పుడే దీన్ని పరిశీలించవచ్చు. ఉదాహరణకు రెండేళ్ల క్రితం అయిదేళ్ల వ్యవధికి డిపాజిట్‌ చేశారనుకుందాం.. అప్పుడు ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం 5.50 శాతానికి మించి లేదు. కానీ, ఇప్పుడు మూడేళ్ల వ్యవధికి దాదాపు 7- 7.5 శాతం దాకా వడ్డీనిస్తున్నాయి బ్యాంకులు. కాబట్టి, పాత డిపాజిట్‌ను రద్దు చేసుకొని, కొత్తగా జమ చేసుకోవచ్చు. రుసుములు వర్తిస్తాయని మర్చిపోవద్దు.

  • ప్రత్యేక వ్యవధి అంటే 365 రోజులు, 400 రోజుల వ్యవధితో డిపాజిట్లూ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పథకాలను సీనియర్‌ సిటిజన్లు పరిశీలించవచ్చు.
  • అత్యవసరాల్లో మధ్యలోనే డిపాజిట్లను ఉపసంహరించుకోకుండా, దానిపై రుణం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు.
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేందుకు ఇప్పుడు బ్యాంకుకే వెళ్లాల్సిన పనిలేదు. సులభంగా బ్యాంకింగ్‌ మొబైల్‌ యాప్‌ల్లోనే డిపాజిట్‌ చేసేందుకు వీలుంది. కార్పొరేట్‌ ఎఫ్‌డీలూ, ఎన్‌సీడీలనూ డీమ్యాట్‌ ఖాతా సాయంతో చేసేయొచ్చు.
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి వర్తించే శ్లాబులను బట్టి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.40వేలకు లోపు (సీనియర్‌ సిటిజన్లకు రూ.50వేలు) వడ్డీ సంపాదన ఉన్నప్పుడు బ్యాంకులు మూలం వద్ద పన్ను కోత విధించవు. అధికంగా వడ్డీ వచ్చే అవకాశం ఉన్న వారు ఫారం 15జీ, ఫారం 15హెచ్‌ (సీనియర్‌ సిటిజన్లు) బ్యాంకులకు సమర్పించాలి. దీనివల్ల మూలం వద్ద పన్ను కోత ఉండదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని