Investment: సిల్వర్‌ ఈటీఎఫ్‌వెండిలో పెట్టుబడి.. లాభమేనా?

పెట్టుబడి కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వైవిధ్యమైన, స్థిరంగా ఉండే వాటి కోసం చూస్తున్నప్పుడు విలువైన లోహాల వైపు దృష్టి సారించవచ్చు.

Updated : 09 Feb 2024 04:52 IST

పెట్టుబడి కోసం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వైవిధ్యమైన, స్థిరంగా ఉండే వాటి కోసం చూస్తున్నప్పుడు విలువైన లోహాల వైపు దృష్టి సారించవచ్చు. ఇందులో బంగారం, వెండి ఎంతో కీలకమైనవి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వెండినీ పెట్టుబడి మార్గంగా చూస్తున్న వారు పెరిగారు. ముఖ్యంగా సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ పథకాలు మదుపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెండిలో మదుపు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సాధనంగా బంగారానికి పేరుంది. వెండికీ ఇదే లక్షణం ఉంది. కమొడిటీ పెట్టుబడుల్లో వెండిది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడే శక్తి దీనికీ ఉందని పలు సందర్భాల్లో నిరూపణా అయ్యింది. సంప్రదాయ పెట్టుబడుల రాబడులను ఇది అధిగమిస్తుంది. పెట్టుబడిదారులకు నమ్మకమైన విలువనూ అందిస్తుంది.

పారిశ్రామిక అవసరాలకు..

ఆధునిక ప్రపంచం అత్యాధునిక సాంకేతికతలపై ఆధారపడుతోంది. ఇందులో వెండిది ఒక ప్రత్యేక పాత్ర. స్మార్ట్‌ఫోన్‌లు, సోలార్‌ ప్యానెళ్లు, విద్యుత్‌ వాహనాలు, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, టీవీ తెరలు, 5జీ నెట్‌వర్క్‌ పరికరాలు, తయారీ, బయో-ఫార్మా, వైద్య రంగంలో వెండి వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా వెండికి పారిశ్రామికంగా గిరాకీ అధికం అవుతోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. అవి భారత్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా వెండికి గిరాకీ పెరిగే సూచనలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, భవిష్యత్‌ దృష్టితో చూసినప్పుడు ఇది ఒక మంచి పెట్టుబడి సాధనంగా చెప్పుకోవచ్చు.

సరఫరా తక్కువగా ఉండటం..

వెండికి అధిక గిరాకీ ఉన్నప్పటికీ, సరఫరాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వెండి గనుల్లో ఉత్పత్తి అనుకున్న మేరకు సాగడం లేదు. గిరాకీ-సరఫరాకు మధ్య ఉన్న అంతరం వెండి ధరలు పెరిగేందుకు తోడ్పడే అవకాశాలను కల్పిస్తోంది. పెట్టుబడిదారులు మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మదుపు చేయొచ్చు.

గరిష్ఠ వడ్డీ రేట్లు..

అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్లు ఇప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వెండిలో పెట్టుబడులను పరిశీలించేందుకు ఇది అనువైన సమయం. ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ వడ్డీ రేట్ల పెంపు విషయంలో కాస్త విరామం ప్రకటిస్తున్నాయి. ఈ దశలో ప్రయోజనం పొందేందుకు వెండిని ఒక సాధనంగా చూడొచ్చు.

వైవిధ్యంగా...

మీ పోర్ట్‌ఫోలియోలో వెండిని చేర్చడం వల్ల వైవిధ్యం సాధ్యమవుతుంది. ఈక్విటీలతోపాటు, బాండ్ల వంటి సంప్రదాయ పథకాలు మదుపు జాబితాలో ఉండాలి. వీటితోపాటు వెండీ ఉన్నప్పుడు మరింత వైవిధ్యం కనిపిస్తుంది. నష్టభయమూ అంతగా ఉండదు.

ఈటీఎఫ్‌ మార్గంలో..

చిన్న మదుపరులు వెండిలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన విధానంగా ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లను చెప్పుకోవచ్చు. సిల్వర్‌ ఈటీఎఫ్‌లను నేరుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేయొచ్చు. డీమ్యాట్‌ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. పెట్టుబడికి అయ్యే రుసుముల ఖర్చూ తక్కువే. మీ దగ్గర ఉన్న డబ్బుకు సరిపడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. డీమ్యాట్‌ లేని మదుపరులు సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్లను పరిగణించవచ్చు. ఇది మ్యూచువల్‌ ఫండ్ల మాదిరిగానే పనిచేస్తాయి. క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)లోనూ లేదా ఒకేసారి మీ దగ్గరున్న మొత్తాన్ని మదుపు చేయొచ్చు.

ప్రతి పెట్టుబడి పథకంలోనూ ఎంతోకొంత నష్టభయం ఉంటుంది. కాబట్టి, పథకాల పనితీరును సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాతే పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

 చింతన్‌ హారియా, ప్రిన్సిపల్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని