పన్ను ఆదా ఆర్థిక లక్ష్యాలు నెరవేరేలా

ఆర్థిక స్వేచ్ఛ సాధించేందుకు తగిన ప్రణాళిక అవసరం. ఇందులో పన్ను ఆదా పెట్టుబడి పథకాలూ కీలక పాత్ర పోషిస్తాయి. లక్ష్యాలు, నష్టభయం భరించే శక్తికి తగ్గట్టు ఈ పథకాలను ఎంపిక చేసుకోవాలి

Updated : 16 Feb 2024 00:52 IST

ఆర్థిక స్వేచ్ఛ సాధించేందుకు తగిన ప్రణాళిక అవసరం. ఇందులో పన్ను ఆదా పెట్టుబడి పథకాలూ కీలక పాత్ర పోషిస్తాయి. లక్ష్యాలు, నష్టభయం భరించే శక్తికి తగ్గట్టు ఈ పథకాలను ఎంపిక చేసుకోవాలి. అదే సమయంలో అవి మీ భవిష్యత్తుకు భరోసానిచ్చేలా ఉండాలి. ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో పన్నుప్రణాళికలు వేసుకునే వారు కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఆదాయపు పన్ను భారం తప్పించుకునేందుకు నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు చట్టం అనుమతిస్తుంది. కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చిన వారు దీర్ఘకాలిక దృష్టితో పథకాలను ఎంచుకోవాలి. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారూ.. తమ పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

ఎంత మేరకు..

పన్ను ఆదా పెట్టుబడులను ఎంచుకునే ముందు చూడాల్సింది.. మీ పన్ను భాధ్యత ఎంతుందో తెలుసుకోవాలి. కొత్త పన్ను విధానం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7.5 లక్షల వరకూ సంపాదించే వ్యక్తులకు ఎలాంటి పన్ను భారం ఉండదు. ఈ పరిమితి లోపు ఉన్నప్పుడు పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే.. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మకంగా, గరిష్ఠ ప్రయోజనాలు ఉండేలా పెట్టుబడులను ఎంచుకోవడం మర్చిపోవద్దు. పాత పన్ను విధానంలో ఎంత పన్ను భారం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను వెబ్‌సైటులో ఉన్న ఆన్‌లైన్‌ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. ఏ విధానంలో తక్కువ పన్ను ఉంటుందన్నది ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. దాని ప్రకారం తగిన నిర్ణయం తీసుకోండి. 

మినహాయింపుల మాటేమిటి?

అద్దె, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, గృహరుణం వడ్డీ, అసలు చెల్లింపులు, పీఎఫ్‌ జమ, బీమా పాలసీలు తదితరాలు ఏమున్నాయో చూసుకోండి. ఇవన్నీ పన్ను భారం తగ్గించేందుకు ఉపకరించే మినహాయింపులే. ఇవన్నీ పోను పన్ను చెల్లించాల్సి వస్తోంది, పెట్టుబడులకు ఇంకా అవకాశం ఉన్నప్పుడే కొత్త పథకాలను పరిశీలించాలి. కాబట్టి, ఒకసారి మీ పన్ను వివరాలను పూర్తిగా విశ్లేషించండి. అప్పుడే పన్ను భారం తగ్గించుకునేందుకు ఏం చేయాలన్నది తెలుస్తుంది.

దీర్ఘకాలం కోసం..

దీర్థకాలిక పన్ను ఆదా పెట్టుబడులపై దృస్టి సారించే వారికి ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్‌), ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) అనువుగా ఉంటాయి. స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసే ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో కొంత నష్టభయం ఉంటుంది. దీన్ని తట్టుకునే వారికి ఇవి మంచి ఎంపిక. పీపీఎఫ్‌ ప్రభుత్వ హామీ ఉన్న పథకం. స్థిరమైన రాబడి కావాలని కోరుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ పెట్టుబడులు సెక్షన్‌ 80సీ కింద (రూ.1,50,000 పరిమితికి లోబడి) పన్ను మినహాయింపును అందిస్తాయి. అదే సమయంలో దీర్ఘకాలిక పొదుపు అలవాట్లను ప్రోత్సహిస్తాయి.

బీమా పాలసీలతో...

పన్ను ప్రణాళికలో బీమా పాలసీలకూ ప్రత్యేక స్థానం ఉంది. జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియానికి సెక్షన్‌ 80సీ పరిమితికి లోబడి మినహాయింపు లభిస్తుంది. ఎన్నో రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ అందించే టర్మ్‌ పాలసీని తీసుకోవడం ఎప్పుడూ ఉత్తమం. పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. కొన్ని పాలసీలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని ఇతర లక్ష్యాలకు అనుగుణంగా తీసుకోవచ్చు. కానీ, ప్రాథమిక బీమా రక్షణ కోసం టర్మ్‌ పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దు. మీ వార్షికాదాయానికి 10 రెట్లకు మించి ఈ పాలసీ ఉండేలా చూసుకోండి.
ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారాయి. రూ.5లక్షల ప్రాథమిక పాలసీ, రూ.20లక్షల సూపర్‌ టాపప్‌ పాలసీలు అందరికీ అవసరం. సొంతంగా పాలసీ తీసుకోవడంతోపాటు, తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి  చెల్లించిన ప్రీమియానికీ సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది.
జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడం అందరికీ అవసరం. వీటిని కేవలం పన్ను ఆదా కోసం ఉపయోగపడే పథకాలుగా చూడొద్దు. మినహాయింపు అనేది ఒక అదనపు ప్రయోజనంగానే చూడాలి.
పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ముందుచూపుతో వ్యవహరించాలి. ఈసారికి ఎలాగో మినహాయింపు వస్తే చాలు అనే ధోరణి సరికాదు. దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడి ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది.
అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని