యులిప్‌ పెట్టుబడి పథకాలను మార్చుకోవాలంటే

పెట్టుబడితో మంచి రాబడికి అవకాశం, అదే సమయంలో బీమా రక్షణ.. అదనంగా పన్ను మినహాయింపు. ఈ మూడూ ఒకే పాలసీలో కావాలను కున్నప్పుడు యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌) పరిశీలించవచ్చు.

Published : 23 Feb 2024 00:39 IST

పెట్టుబడితో మంచి రాబడికి అవకాశం, అదే సమయంలో బీమా రక్షణ.. అదనంగా పన్ను మినహాయింపు. ఈ మూడూ ఒకే పాలసీలో కావాలను కున్నప్పుడు యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌) పరిశీలించవచ్చు. ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా వివిధ పెట్టుబడి పథకాలకు నిధులు కేటాయించడం, అవసరాన్ని బట్టి, మార్చుకోవడంలాంటి ఎన్నో సౌలభ్యాలను ప్రస్తుతం ఈ పాలసీలు అందిస్తున్నాయి. ఏడాదిలో నిర్ణీత సంఖ్యలో ఈ మార్పులను ఎలాంటి ఖర్చూ లేకుండా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కో పెట్టుబడి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందాం..

దీర్ఘకాలంలో సంపదను సృష్టించడం, ఆర్థిక లక్ష్యాలను సాధించడం, పన్ను ప్రయోజనాలు, బీమా రక్షణ ఇలా ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్న పథకాల్లో యులిప్‌లు ముందుంటాయి. వీటిలో చెల్లించే ప్రీమియాన్ని మూడు రకాల పథకాల్లో మదుపు చేయొచ్చు. ఈక్విటీ, డెట్‌, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లలో పాలసీదారుడి విభిన్న లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.

ఈక్విటీలతో..

ఈక్విటీ ఫండ్లలో దీర్ఘకాలంలో మంచి వృద్ధికి అవకాశం ఉంటుంది. ఈ ఫండ్లు ప్రాథమికంగా షేర్లలో మదుపు చేస్తాయి. వీటిలో కాస్త అస్థిరత ఉంటుంది. పెట్టుబడులు మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ.. ఈ హెచ్చుతగ్గులు పోర్ట్‌ఫోలియోపై పెద్దగా ప్రభావం చూపవు. పెట్టుబడిదారులకు మెరుగైన రాబడి అందేందుకూ వీలుంటుంది. కాబట్టి, ఇవి అందించే ప్రయోజనాలు పొందాలంటే.. దీర్ఘకాలం పాటు వేచి చూడటంతోపాటు, మార్కెట్‌ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

ఉదాహరణకు దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితో 30 ఏళ్ల వ్యక్తి ఈ పాలసీని ఎంచుకున్నారనుకుందాం. పదవీ విరమణ దృష్టితో దీన్ని తీసుకున్నప్పుడు ఈక్విటీకి ఎక్కువ భాగం కేటాయించే ప్రయత్నం చేయొచ్చు. దీనివల్ల మంచి సంపదను సృష్టించేందుకు వీలవుతుంది.

నష్టభయం తక్కువుండేలా..

నష్టం వస్తే తట్టుకోలేం అనుకునే వారూ ఉంటారు. ఇలాంటి వారికోసం యులిప్‌లలో డెట్‌ ఫండ్లు ఉన్నాయి. ఇవి ప్రాథమికంగా ప్రభుత్వ బాండ్‌లు, కార్పొరేట్‌ బాండ్‌లు, మనీ మార్కెట్‌ సాధనాల వంటి స్థిరాదాయ సాధనాల్లో మదుపు చేస్తాయి. పదవీ విరమణకు చేరువలో ఉన్నవారు ఈ ఫండ్లను పరిశీలించవచ్చు. పదవీ విరమణ తర్వాత స్థిరమైన రాబడిని పొందేందుకూ ఇవి ఉపకరిస్తాయి.

ఈక్విటీ, డెట్‌ పథకాల్లో మదుపు చేయాలనుకునే వారికి బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లు అనుకూలం. పెట్టుబడి వృద్ధి, ప్రతికూల పరిస్థితుల్లో రక్షణ ఈ రెండూ ఇందులో ఉంటాయి. పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రణాళికలు వేస్తున్న యువ తల్లిదండ్రులు కాస్త నష్టభయం తక్కువగా ఉన్న ఈ పథకాలను ఎంచుకోవచ్చు.

ఎప్పుడు మార్చుకోవాలి...

యులిప్‌ పాలసీలో ఉండే స్విచ్ఛింగ్‌ ఆప్షన్‌ పెట్టుబడిదారులకు నష్టాన్ని నిరోధించే అవకాశాన్ని కల్పిస్తుంది. మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, తదనుగుణంగా తమ పెట్టుబడి వ్యూహాలను సర్దుబాటు చేయడం ద్వారా పెట్టుబడిదారులు మార్కెట్‌ పతనం అవుతున్నప్పుడు నష్టాలను తగ్గించుకోవచ్చు. అన్నీ సానుకూలంగా సాగుతున్నప్పుడు రాబడిని గరిష్ఠంగా పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చు.

యులిప్‌లలో పెట్టుబడులను మార్చేటప్పుడు సమయపాలన, వ్యూహాత్మక విధానం చాలా కీలకం అనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక సలహాదారును సంప్రదించడం, వ్యక్తిగత పెట్టుబడి లక్ష్యాలను అంచనా వేయడం ద్వారా ఏ తరహా పెట్టుబడులను ఎంచుకోవాలన్న విషయంలో స్పష్టత వస్తుంది.

కొత్త వాటిలోకి..

ఇటీవలి కాలంలో బీమా సంస్థలు యులిప్‌ పాలసీదారుల కోసం కొత్త పథకాలనూ అందుబాటులోకి తెస్తున్నాయి. వీటినీ పరిశీలించవచ్చు. భిన్నమైన పెట్టుబడి వ్యూహాలతో వచ్చిన ఫండ్లను అధిక లాభాల కోసం ఎంచుకోవచ్చు. కాకపోతే మీరు ఎంచుకున్న పాలసీ ఆ ఫండ్లలోకి మారేందుకు అవకాశం ఇస్తుందా లేదా అనేది బీమా సంస్థను అడిగి తెలుసుకోండి.
మారుతున్న అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు కొనసాగించాలి. అధిక నష్టభయం భరించే సామర్థ్యం ఉన్న యువకులు ప్రారంభంలో దూకుడుగా ఉండే ఈక్విటీల్లో మదుపు చేయొచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ... కాస్త సంప్రదాయక విధానంలోకి రావాలి. యులిప్‌లో ఉండే ఈ పెట్టుబడుల మార్పు సౌలభ్యం ద్వారా పాలసీదారులు సులభంగా తమ పెట్టుబడులను నిర్వహించుకోవచ్చు. ఆర్థిక లక్ష్యాల ప్రకారం తమ వ్యూహాలను అమలు చేయొచ్చు. 10-15 ఏళ్లకు మించి సమయం ఉన్నవారికి యులిప్‌లు అనుకూలమైన పథకాలనే చెప్పొచ్చు. సంపద సృష్టికి ఓర్పు, క్రమశిక్షణ ఎంతో ముఖ్యం అని మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని