డిజిటల్‌ ప్రపంచంలో ధీమాగా

చిన్న వస్తువు కొనడం నుంచి.. ఆర్థిక నిర్వహణ వరకూ ఇప్పుడంతా డిజిటల్‌లోనే. అపారమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ఊహించని నష్టాలూ అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తుంటాయి.

Published : 23 Feb 2024 00:43 IST

చిన్న వస్తువు కొనడం నుంచి.. ఆర్థిక నిర్వహణ వరకూ ఇప్పుడంతా డిజిటల్‌లోనే. అపారమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ఊహించని నష్టాలూ అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తుంటాయి. వ్యాపారాలనే కాకుండా, వ్యక్తులనూ లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ డిజిటల్‌ ఆస్తులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి ఉపయోగపడేదే సైబర్‌ బీమా. ఇప్పుడిది తప్పనిసరి అవసరంగా మారింది.

రాహుల్‌ తనకు వచ్చిన ఇ-మెయిల్‌ను ఎలాంటి అనుమానాలు లేకుండా తెరిచారు. అంతే.. అతను గుర్తించే లోపే అతని బ్యాంకు ఖాతాపై సైబర్‌ నేరగాళ్లు దాడి చేశారు. ఖాతా నుంచి మొత్తం డబ్బు ఖాళీ అయ్యింది. ఇది రాహుల్‌ను తీవ్ర ఆందోళనలో పడేసింది. అదృష్టవశాత్తూ అతను సైబర్‌ బీమా పాలసీని తీసుకున్నారు. దీంతో ఖాతా నుంచి దొంగిలించిన డబ్బును నష్టపరిహారంగా పొందారు.  ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా, ఎవరికైనా ఎదురుకావచ్చు. డిజిటల్‌ ప్రపంచంలో దీనికి సిద్ధంగా ఉండాల్సిందే.

ఆర్థిక రక్షణ: సైబర్‌ దాడుల వల్ల వ్యక్తులకు ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఖాతా నుంచి దొంగిలించిన డబ్బులు, సమాచారం తిరిగి పొందేందుకు చేసిన ఖర్చులను తిరిగి పొందేందుకు వీలుంటుంది.

గుర్తింపు దొంగతనం: ఆధార్‌, పాన్‌ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, వాటి ద్వారా రుణాలు తీసుకోవడంలాంటివి చేయొచ్చు. ఇలాంటప్పుడు వాటిల్లిన ఆర్థిక నష్టాన్ని సైబర్‌ బీమా భర్తీ చేస్తుంది.

ఉపకరణాలకు నష్టం: మాల్‌వేర్‌, ఫిషింగ్‌ దాడుల వల్ల కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు పాడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో సైబర్‌ ఇన్సూరెన్స్‌ సహాయం చేస్తుంది.

భావోద్వేగ మద్దతు: సైబర్‌ దాడులు కేవలం డబ్బుకు సంబంధించినవే కాకపోవచ్చు. కొన్నిసార్లు భావోద్వేగాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు సైబర్‌ బీమా పాలసీలు కౌన్సిలింగ్‌ సేవలను పొందేందుకు సహాయం చేస్తాయి.

సామాజిక మాధ్యమాల్లో: సామాజిక మాధ్యమాల్లో మీ గౌరవానికి ఇబ్బందులు ఏర్పడినప్పుడు సైబర్‌ ఇన్సూరెన్స్‌ తోడ్పాటునందిస్తుంది. చట్టపరంగా మీరు తీసుకుంటున్న చర్యలకు అవసరమైన ఆర్థిక మద్దతును ఇస్తుంది.

సైబర్‌ బీమా అంటే కేవలం ప్రీమియం చెల్లించి, తీసుకునే ఒక పాలసీగా చూడకూడదు. డిజిటల్‌ ప్రపంచంలో మీకు ఇది ఒక రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు.

గౌరవ్‌ అరోరా, చీఫ్‌ అండర్‌ రైటింగ్స్‌ క్లెయిమ్స్‌ ప్రాపర్టీ, ఐసీఐసీఐ లాంబార్డ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని