పెట్టుబడులు భిన్న పథకాల్లో

‘పెట్టుబడులన్నీ ఒకే పథకంలో ఎప్పుడూ ఉంచకూడదు’ వ్యక్తిగత ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాటే ఇది. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మరోవైపు పెట్టుబడి పథకాలూ ఎన్నో విధాలుగా అందుబాటులోకి వస్తున్నాయి.

Updated : 01 Mar 2024 04:47 IST

‘పెట్టుబడులన్నీ ఒకే పథకంలో ఎప్పుడూ ఉంచకూడదు’ వ్యక్తిగత ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాటే ఇది. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మరోవైపు పెట్టుబడి పథకాలూ ఎన్నో విధాలుగా అందుబాటులోకి వస్తున్నాయి. లక్ష్యాలకు తగ్గ పథకాలను ఎంచుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అవసరం, వ్యవధి ఆధారంగా భిన్న పెట్టుబడులను ఎంచుకొని, వాటిలో దీర్ఘకాలం కొనసాగడమే ఎప్పుడూ మంచిది.

కొంతమందికి కొన్ని ఇష్టమైన పథకాలు ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనే విశ్వాసం ఉంటుంది కొందరికి. షేర్లలో అధిక లాభాలు వస్తాయని, వాటివైపే చూసేవారు మరికొందరు. బంగారం మేలు అనేవారూ ఉంటారు. రాబడి హామీ ఉండే స్థిరాదాయ పథకాలనూ చూస్తుంటారు. నచ్చిన పథకంలో మదుపు చేసే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ, ఆర్థిక స్వేచ్ఛను సాధించాలంటే ఇది సరిపోదు. భిన్నమైన వ్యూహాలను అనుసరించాల్సిందే.

ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉంటుంది. అదే సమయంలో పెట్టుబడిదారుడి ఆర్థిక స్తోమత, నష్టభయాన్ని భరించే శక్తి, ఎంత కాలం కొనసాగిస్తారు అనేదానిపై ఆధారపడి పథకాల ఎంపిక ఉండాలి. అప్పుడే వైవిధ్యమైన పెట్టుబడులతో లాభాలు అందుకోవచ్చు. రెండు మూడు పథకాల్లో మదుపు చేయడం ద్వారా సమతుల్య, నష్టభయాన్ని సర్దుబాటు చేసేలా పోర్ట్‌ఫోలియోను నిర్మించేందుకు వీలవుతుంది. ఈ వ్యూహాన్ని ఉపయోగించినప్పుడు ఒకే పెట్టుబడిలో మదుపు చేసినప్పుడు వచ్చే నస్టాలను నివారించవచ్చు. అదే సమయంలో వివిధ ఆస్తుల నుంచి వచ్చే రాబడులను అందుకోవడం సాధ్యమవుతుంది. ఈక్విటీ, డెట్‌, బంగారం, వెండి, రీట్స్‌ వంటి పెట్టుబడులను ఎంచుకోవచ్చు.

నష్టం తగ్గేలా..

బహుళ పెట్టుబడి పథకాల వెనుక ఉన్న కారణం చాలా చిన్నది. అయినప్పటికీ ఎంతో శక్తిమంతమైనది. వివిధ అసెట్‌ క్లాస్‌లకు పెట్టుబడులను వైవిధ్యంగా కేటాయించ ద్వారా మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఒక పథకం పేలవమైన పనితీరు ప్రభావాన్ని తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు ఈక్విటీల్లో బలమైన పురోగమనం కనిపిస్తుంది. అదే అస్థిరంగా ఉన్నప్పుడు బంగారం తదితర సురక్షిత పథకాలు మీ పెట్టుబడి మొత్తం గణనీయంగా నష్టపోకుండా నిరోధిస్తాయి.

సంపద సృష్టి కోసం...

భారత దేశ ఆర్థిక మార్కెట్లు ప్రపంచ, దేశీయ సామాజిక-ఆర్థిక సవాళ్లతో ముడిపడి ఉన్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వస్తువుల ధరల్లో పెరుగుదల, ద్రవ్యోల్బణంలాంటివి మన పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటప్పుడు బంగారం, బాండ్ల వంటి ఆస్తులు ఈక్విటీలతో పోలిస్తే కాస్త తక్కువ ప్రభావానికి లోనవుతాయి. ఈక్విటీ మార్కెట్లు స్వల్పకాలంలో కాస్త ఆటుపోట్లతో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి దోహదం చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపరులు ఈక్విటీలతోపాటు, అస్థిరతలనూ దృష్టిలో పెట్టుకొని, బహుళ పెట్టుబడి వ్యూహాలను అనుసరించాలి. మ్యూచువల్‌ ఫండ్లు అందించే మల్టీ అసెట్‌ ఫండ్ల వంటి వాటినీ పరిశీలించవచ్చు.

లాభాలేమిటి?

వైవిధ్యం, నష్టభయాన్ని సర్దుబాటు చేయడం ఈ మల్టీ అసెట్‌ పథకాల లక్ష్యం. ఒక పెట్టుబడి పథకం తక్కువ రాబడినిస్తున్నప్పుడు, మరో పథకం అధిక రాబడినిచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటినీ సర్దుబాటు చేసుకుంటూ పెట్టుబడుల వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా మార్కెట్‌ హెచ్చుతగ్గుల్లోనూ స్థిరమైన పనితీరు కనిపిస్తుంది. మార్కెట్‌ గరిష్ఠ స్థాయిలో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియని పెట్టుబడిదారులు ఈ ఫండ్లను ఎంచుకోవచ్చు. మల్టీ అసెట్‌ క్లాస్‌ ఫండ్లను ఎంచుకున్నప్పుడు మదుపరులు తమ పెట్టుబడులను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ ఫండ్‌ మేనేజర్‌ చూసుకుంటారు. దీర్ఘకాలికంగా ఈ పథకాల నుంచి మంచి రాబడి వచ్చే అవకాశాలున్నాయని చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. మరోవైపు అస్థిరతలను దృష్టిలో పెట్టుకొని, మల్టీ అసెట్‌ వ్యూహాన్ని ఎంచుకోవడమూ మంచిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని