స్థిరాదాయం అందేలా..

నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ)ను ఆవిష్కరించింది. నిప్పాన్‌ ఇండియా ఎఫ్‌ఎంపీ ఎక్స్‌ఎల్‌ 6 సిరీస్‌ 3 అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 5న ముగుస్తుంది. ఇది ఇన్‌కం తరగతికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకం.

Published : 01 Mar 2024 00:13 IST

నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ)ను ఆవిష్కరించింది. నిప్పాన్‌ ఇండియా ఎఫ్‌ఎంపీ ఎక్స్‌ఎల్‌ 6 సిరీస్‌ 3 అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 5న ముగుస్తుంది. ఇది ఇన్‌కం తరగతికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. అంటే కాలపరిమితి తీరే వరకూ ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ఇతర స్థిర ఆదాయాన్ని ఇచ్చే పత్రాలు, రుణ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని ఆర్జించడం లక్ష్యంగా పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. వడ్డీ రేటు రిస్కు తక్కువగా, క్రెడిట్‌ రిస్కు ఎక్కువగా ఉంటుంది. క్రిసిల్‌ షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఇండెక్స్‌తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు.


దీర్ఘకాలిక మదుపరులకు..

కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోటక్‌ మహీంద్రా లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌ అనే ఈ పథకం లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌ తరగతి కిందకు వస్తుంది. ఈ నెల 6తో ఎన్‌ఎఫ్‌ఓ ముగుస్తుంది. కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం కింద సమీకరించిన నిధులను ప్రధానంగా రుణ పత్రాలు, మనీ మార్కెట్‌ పత్రాల్లో పెట్టుబడిగా పెడతారు. నిఫ్టీ లాంగ్‌ డ్యూరేషన్‌ డెట్‌ ఇండెక్స్‌-ఏ-3 సూచీతో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు. అభిషేక్‌ బైసేన్‌, పల్హా ఖన్నా ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలంలో స్థిరమైన ప్రతిఫలం కావాలనుకునే మదుపరులకు ఈ పథకం అనువుగా ఉంటుంది.


కారు రుణం 8.75 శాతానికి

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వాహన రుణం చలన వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. మార్చి 31 వరకూ ఈ రేటు వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటి వరకూ వాహన రుణం వడ్డీ రేటు 9.40శాతంగా ఉంది. స్థిర వడ్డీ రేటు 8.85 శాతంగా ఉంది. చలన, స్థిర వడ్డీ రేటుకు తీసుకునే రుణాలపై పరిశీలనా రుసుములో రాయితీనిస్తున్నట్లు తెలిపింది. చలన వడ్డీ రుణాన్ని ముందస్తుగా తీర్చేసినా ఎలాంటి రుసుములూ ఉండవు. 84 నెలల వ్యవధి వరకూ ఎంచుకోవచ్చు. జనవరి నుంచి కార్ల విక్రయాలు పెరిగాయని, దీన్ని అవకాశంగా మార్చుకునేందుకు రుణ వడ్డీ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ ముదలియార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని