విశ్రాంత జీవితంలో తోడుగా

పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది

Published : 29 Mar 2024 00:24 IST

పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక రిటైర్‌మెంట్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ‘పీజీఐఎం ఇండియా రిటైర్‌మెంట్‌ ఫండ్‌’ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) వచ్చే నెల 9న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో నెలకు రూ.1,000 చొప్పున, కనీసం అయిదు వాయిదాలు మదుపు చేయాలి. పెట్టుబడిపై అయిదేళ్ల కాలానికి లేదా మదుపరులకు 60 ఏళ్లు పూర్తయ్యే వరకూ... ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అప్పటి వరకూ లాక్‌-ఇన్‌ ఉంటుంది. ఈ పథకం నుంచి పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన ఇతర పథకాలకు మారటానికీ (స్విచ్‌) లాక్‌-ఇన్‌ వర్తిస్తుంది. ఈ పథకాన్ని వినయ్‌ పహారియా (ఈక్విటీ), పునీత్‌ పాల్‌ (రుణ పత్రాలు, రీట్‌, ఇన్విట్‌...) నిర్వహిస్తారు. దాదాపు 75 శాతానికి పైగా నిధులను ఈక్విటీలో పెట్టుబడికి కేటాయిస్తారు. ‘బాటమ్‌-అప్‌’ విధానంలో పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లకు సమంగా నిధులు కేటాయిస్తారు.  మిగిలిన సొమ్మును రుణ పత్రాలు, రీట్‌, ఇన్విట్‌లలో పెట్టుబడి పెడతారు. ‘ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 టిఆర్‌ఐ’ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని