అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా

అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం.

Published : 29 Mar 2024 00:38 IST

అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. కొన్నిసార్లు తాత్కాలికంగా ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆదుకునేలా కొంత నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేకపోతే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అప్పులు చేయడంలాంటివి తప్పవు.

ఉద్యోగం చేస్తున్న వారికైనా, వృత్తి, వ్యాపారంలో ఉన్నవారైనా.. అత్యవసర నిధి అందరికీ అవసరమే. నెలవారీ ఖర్చులను పూర్తిగా లెక్కించుకోవాలి. నిత్యావసరాలు, అద్దె, రుణ వాయిదాలు, స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలి. కనీసం 6 నెలల వరకూ వీటన్నింటికీ సరిపోయేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. వృత్తి, వ్యాపారంలో ఉన్నవారు 12 నెలల వరకూ ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత అత్యవసర నిధి ఉన్నప్పుడే ఆర్థిక భరోసా ఉంటుందని మర్చిపోవద్దు.

మీకు ఇప్పటికే అత్యవసర నిధి ఉంటే.. దాన్ని ఒకసారి సమీక్షించండి. మీ జీవనశైలి, ఖర్చులకు అనుగుణంగా దాన్ని సర్దుబాటు చేయండి.
ఉదాహరణకు ఇటీవలే ఉద్యోగంలో చేరిన వ్యక్తికి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వివాహమై, కుటుంబం ఉన్న వ్యక్తులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని పెట్టుబడి పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే..

  • పెట్టిన మొత్తాన్ని సులభంగా వెనక్కి తీసుకునేందుకు వీలుండే పథకాల్లో మదుపు చేయాలి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, లిక్విడ్‌ ఫండ్లు, అధిక వడ్డీ చెల్లించే పొదుపు ఖాతాల వంటి వాటిని ఎంచుకోవాలి. ఎలాంటి అడ్డంకులు, రుసుములు లేకుండా నిధిని ఉపసంహరించుకునే వీలుండాలి. రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో సాయం చేయాలి. అప్పుడే కాలక్రమేణా మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది.
  •  మారుతున్న మీ ఆర్థిక బాధ్యతల ఆధారంగా మీ నిధిని సర్దుబాటు చేయాలి. ఉదాహరణకు మీరు రుణం తీసుకుంటే.. కనీసం ఆరు నెలల వాయిదాలనూ అత్యవసర నిధిలో చేర్చాలి. రుణాన్ని తిరిగి
  • చెల్లించిన తర్వాత నిధి మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.
  • తాత్కాలిక ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకే అత్యవసర నిధి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగైన వెంటనే వాడిన మొత్తాన్ని భర్తీ చేయాలి. అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇవ్వండి. వాటి కోసం మాత్రమే దీన్ని ఉపయోగించాలి.
  • కుటుంబ అవసరాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితిలాంటి వాటికే దీన్ని వాడాలని నిర్ణయించుకోండి. మీ జీవిత భాగస్వామికి, సమీప కుటుంబ సభ్యులకు ఈ నిధి గురించి తెలియజేయాలి.
  • అత్యవసర పరిస్థితులకు తగిన విధంగా సిద్ధంగా ఉన్నప్పుడే ఎలాంటి ఆందోళనా లేకుండా ఉండగలమని మర్చిపోవద్దు.
  • చిన్న అవసరాలకూ అత్యవసర నిధిని తీసి వాడుకోవడం మంచిది కాదు. దీన్ని చివరి ప్రయత్నంగా మాత్రమే చూడాలి. కిరాణా సామగ్రి కొనుగోలు చేయడం, విద్యుత్‌ బిల్లులు, రుణ వాయిదాలు చెల్లించడంలాంటి రోజువారీ ఆర్థిక అవసరాలకూ ఇబ్బంది వచ్చినప్పుడే.. ప్రత్యామ్నాయం లేదు అనుకుంటేనే దీన్ని వినియోగించండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని