కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...

ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్‌ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్‌ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి

Updated : 29 Mar 2024 08:25 IST

ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్‌ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్‌ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి. ఇదే సమయంలో మన ఆర్థిక ప్రణాళికలకూ ఒక నూతన రూపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందామా...

పిల్లల ఫీజులు చెల్లించాలి.. బీమా పాలసీలకు ప్రీమియం కట్టాలి.. గతంలో పెట్టుబడులను కొనసాగించేందుకూ డబ్బు కావాలి.. ఇలా ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలామందికి ఆర్థిక అవసరాలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఇదే విధంగా ఆర్థికారోగ్యాన్నీ రక్షించుకోవాలి. జీవితంలోని వివిధ దశల్లో ఆర్థిక లక్ష్యాలను సాధించడం, బాధ్యతలను నెరవేర్చేందుకు పొదుపు, పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి.

 వెంటనే ప్రారంభించండి..: పొదుపు, పెట్టుబడులు ఏదో ఒక రోజు ప్రారంభించాల్సిందే. మీకు ఆదాయం తక్కువగా ఉందని, ఖర్చులు ఆగవు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వచ్చిన సంపాదనలో నుంచి కనీసం 10-15 శాతం పెట్టుబడులకు ప్రత్యేకించాలి. ఏప్రిల్‌ 1 నుంచి పెట్టుబడులు ప్రారంభించండి.

 ఆర్థిక స్థితిని అంచనా వేయండి: మీ నికర విలువ ఎంత అనేది ఎప్పుడైనా లెక్కించుకున్నారా? మీకున్న ఆస్తులు, బాధ్యతల మధ్య వ్యత్యాసమే ఈ నికర విలువ. ఆదాయంలో నుంచి ఎంత ఖర్చు చేస్తున్నారు, మీ స్థాయిలోనే జీవిస్తున్నారా అనే అంశాలనూ ఇది తెలియజేస్తుంది. మీ పొదుపు, పెట్టుబడుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. నికర విలువ అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికారోగ్యంగా ఉన్నట్లు లెక్క.

లక్ష్యాలను తెలుసుకోండి: ఆర్థిక లక్ష్యాలు అనేక అవసరాలు, కోరికల రూపంలో ఉంటాయి. ఇవి వాస్తవ రూపంలోకి మారేందుకు డబ్బు అవసరం. సొంతిల్లు, కారు కొనడం, పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహం, విహార యాత్రలు, పదవీ విరమణ ప్రణాళికలు ఇవన్నీ సాధారణ ఆర్థిక లక్ష్యాలే. స్వల్పకాలిక (మూడేళ్ల కంటే తక్కువ), మధ్య-కాలిక (4-10 ఏళ్ల వ్యవధి), దీర్ఘకాలిక (10 ఏళ్లకు మించి వ్యవధి) లక్ష్యాలను వేరు చేసుకోవాలి. వీటిని సాధించేందుకు అనువైన పెట్టుబడులు ఏమిటన్నది గుర్తించి, వాటిలో మదుపు చేయాలి.

ఆలస్యం చేయకుండా: పెట్టుబడుల విషయంలో ఎప్పుడూ ఆలస్యం పనికిరాదు. ఎంత తొందరగా పెట్టుబడులు ప్రారంభిస్తే అంత వేగంగా చక్రవడ్డీ ప్రభావంతో ఆ మొత్తం వృద్ధి చెందుతుంది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లాంటి వాటిలో ఏప్రిల్‌ 5లోపు పెట్టుబడి పెట్టడం మంచిది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మొత్తం వడ్డీ అందుకునేందుకు వీలవుతుంది. కనీసం రూ.1,000తోనైనా పెట్టుబడిని ప్రారంభించడం మేలు. వచ్చే పదేళ్లపాటు భారత ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. కాబట్టి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.

ఒకే చోట కాకుండా..: డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకే చోట మొత్తం పెట్టడం ఎప్పుడూ సరికాదు. ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఒకసారి చూసుకోండి. నష్టభయం భరించే సామర్థ్యం, మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. మదుపు మొత్తాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు, రాబడి అధికంగా ఆర్జించేందుకు వీలైనంత వరకూ పెట్టుబడులు వైవిధ్యంగా ఉండేలా చూసుకోండి. ఈక్విటీలు, డెట్‌ పథకాలు, బంగారం, స్థిరాస్తి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇలా మీ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఇచ్చే పథకాలను ఎంచుకునే ప్రయత్నం చేయండి.

ఆర్థిక భరోసా: మీ సంపాదనపై ఆధారపడిన కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా కల్పించాలి. జీవితంలో ఊహించని లేదా దురదృష్టకర సమయాల్లో వారికి తోడుండేలా జీవిత బీమా పాలసీలు తీసుకోవాలి. ఏ సందర్భం ఎదురైనా ప్రస్తుతం కొనసాగుతున్న జీవన శైలికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలి. పిల్లల చదువుల ప్రణాళిక దెబ్బతినకూడదు. మీ పేరుతో సరైన బీమా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల పాలసీలనూ ఎంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇందులో ప్రీమియం వేవర్‌ను జోడించుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వైద్య చికిత్స ఖర్చులూ అధికంగా ఉంటున్నాయి. కాబట్టి, ఆరోగ్య బీమా తప్పనిసరిగా తీసుకోండి.

పన్ను ప్రణాళికలు: ఆర్థిక సంవత్సరం ప్రారంభంకాగానే కొత్తగా పన్నుల ప్రణాళికలు వేసుకోవాల్సిందే. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ వస్తుంది. అప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయన్నది తెలియదు. ఇప్పుడున్న పన్ను నిబంధనల మేరకు కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా? పాత పన్ను విధానంలోనే ఉండాలా అన్నది నిర్ణయించుకోవాలి. పాత పన్ను విధానం ఎంచుకుంటే.. ఏప్రిల్‌ నుంచే తగిన పెట్టుబడులు ప్రారంభించండి. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి పన్ను ఆదా పెట్టుబడులతో పనిలేదు. మరో సంగతి... రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచీ అందరికీ కొత్త పన్ను విధానమే ‘డిఫాల్ట్‌’గా ఉంటుంది. పాత పన్ను విధానంలో కొనసాగే ఆలోచన ఉంటే.. ప్రత్యేకంగా చెప్పాల్సిందే.

సమీక్షించుకోండి: ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే.. ఇప్పటికే ఉన్న మీ ఆర్థిక విషయాలన్నింటినీ ఒకసారి సమీక్షించుకోండి. పెరిగిన మీ ఆదాయానికి తగ్గట్లుగా పెట్టుబడులు ఉన్నాయా?ఏమైనా సర్దుబాట్లు అవసరమా? చూసుకోండి. అప్పుడే కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో అనుకున్నవన్నీ నెరవేరేందుకు
అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని