పన్ను ప్రణాళికకు తరుణమిదే..

ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు

Published : 05 Apr 2024 00:40 IST

ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు.. పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు కాస్త ప్రణాళికతో వ్యవహరించాలి. ఎలాంటి పొరపాట్లకూ తావీయకుండా, మదుపు చేసినప్పుడే పన్ను ప్రయోజనంతోపాటు, దీర్ఘకాలంలో సంపద సృష్టికీ అవి తోడ్పడతాయి.

 పన్ను ఆదా పథకాలను ఎంచుకునేటప్పుడు ఆయా పథకాలు మనకు ఎంత మేరకు ఉపయోగపడతాయనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేసుకోవాలి. పన్ను ఆదాతోపాటు, పెట్టుబడి వృద్ధికీ అవి అవకాశం కల్పించాలి.  

  • పన్ను ఆదా కోసం ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మదుపు ప్రారంభించాలి. దీనివల్ల ఆర్థికంగా ఒత్తిడి ఉండదు.  
  • ఒకే పథకంలో మొత్తం డబ్బును పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు. ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే శక్తిని బట్టి, పలు పథకాలను ఎంచుకొని, వైవిధ్యంగా మదుపు చేయాలి. ఒకే పథకంలో పెట్టుబడి పెడితే పెద్దగా రాబడి రాకపోవచ్చు.
  •  పన్ను ఆదా కోసం చాలామంది బీమా పాలసీలను తీసుకుంటారు. అన్ని వివరాలూ పరిశీలించి, దీర్ఘకాలంపాటు ప్రీమియం చెల్లించగలం అని నమ్మినప్పుడే వీటిని ఎంచుకోవాలి. అధిక ప్రీమియం పాలసీలు తీసుకొని, తర్వాత ఏడాది ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది.  
  •  స్వల్పకాలంలో ఈక్విటీలు కాస్త అస్థిరంగా ఉంటాయి. దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి. ఈక్విటీల నుంచి దూరంగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో సంపదను సృష్టించే అవకాశాన్ని కోల్పోయినట్లు అవుతుంది. కాబట్టి, పన్ను ఆదా చేసుకునేటప్పుడు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించాల్సిన అవసరం ఉంది. క్రమానుగత పెట్టుబడి విధానంలో వీటిలో మదుపు చేయొచ్చు. కనీసం మూడేళ్లపాటు పెట్టుబడులను కొనసాగించాలని మర్చిపోవద్దు.
  • ప్రతి పెట్టుబడి పథకాన్నీ కచ్చితంగా కొన్నాళ్లపాటు కొనసాగించాలనే నిబంధన ఉంటుంది. పన్ను ఆదా పథకాల్లో మదుపు చేసినప్పుడు ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలి. మీ ఆర్థిక ప్రణాళికలు, లక్ష్యాలను బట్టి, వివిధ వ్యవధుల్లో ఉన్న పెట్టుబడులను ఎంచుకోవచ్చు.  
  •  పన్ను ఆదా పథకాల్లో మదుపు చేసేటప్పుడు చాలామంది సెక్షన్‌ 80సీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి అదనంగా సెక్షన్‌ 80డీ (ఆరోగ్య బీమా), సెక్షన్‌ 80సీసీడీ (జాతీయ పింఛను పథకం)లాంటి వాటినీ చూడాలి.  ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఉన్నాం. ఇప్పుడే పెట్టుబడులను ప్రారంభిస్తే.. మూలం వద్ద పన్ను కోతలను తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాన్నీ అందుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని