ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త

ఒక్క క్లిక్‌తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి

Updated : 05 Apr 2024 07:55 IST

 ఒక్క క్లిక్‌తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, సైబర్‌ మోసగాళ్లు మనల్ని మోసం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. బ్యాంకులు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, కొరియర్‌ సంస్థల పేర్లు చెప్పి.. ఓటీపీలను చెప్పాలని అడుగుతూ మన ఖాతాలను ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఫోన్‌ కాల్‌ లేదా సందేశం వచ్చి, ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి ఆలోచించాలి. బ్యాంకులు, బీమా సంస్థలు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఇతర ఆర్థిక సంస్థలు ఏవైనా సరే.. మీ ఓటీపీని ఎప్పుడూ అడగవు. కొరియర్‌లో వచ్చిన వస్తువులను మనకు ఇచ్చేటప్పుడు వచ్చిన వ్యక్తి ఓటీపీని పంపించాం, చెప్పండి అని అడుగుతారు. అంతేకానీ, ఫోన్‌లోనే ఓటీపీలను అడగరు అని గుర్తుంచుకోండి. ఇటీవలి కాలంలో కొరియర్‌ డెలివరీల పేరు చెప్పి, మోసం చేస్తున్న సంఘటనలు పెరిగాయి.

 ఏదైనా ఓటీపీ వచ్చిన వెంటనే మీకు రావాల్సిన సందేహాలేమిటంటే..

  •  స్వయంగా మీరే ఓటీపీ లావాదేవీని నిర్వహించారా? ఓటీపీ విశ్వసనీయ సంస్థ నుంచే వచ్చిందా? సందేశంలో ఏదైనా ఒత్తిడి, అత్యవసరం అని కనిపిస్తోందా? చూసుకోండి.
  •  ఆయా ఫోన్‌ కాల్‌ లేదా సందేశంలో వాడిన భాషను నిశితంగా పరిశీలించండి. మీరు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండానే ఓటీపీ వచ్చిందంటే.. అది కచ్చితంగా మోసపూరితమేనని గుర్తుంచుకోండి. ఓటీపీని ఎవరికీ చెప్పొద్దు అని బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు చెబుతూనే ఉంటాయి. ఈ సూచనలు పాటించాలి.
  • బ్యాంకు, బీమా సంస్థల నుంచి ఫోన్‌ చేసి ఇ-కేవైసీ కోసం మీ వ్యక్తిగత వివరాలు కావాలి అంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి. మీ కుటుంబ సభ్యులకూ ఈ విషయంలో జాగ్రత్తలు తెలియజేయండి.
  • అధికారిక వెబ్‌సైట్లు, వినియోగదారుల సేవా కేంద్రాలను సంప్రదించి అవసరమైన సేవలను పొందాలి.
  • అధిక రాబడులు ఇస్తామంటూ వచ్చే సందేశాలు, బ్యాంకు నుంచి పంపించే హెచ్చరికలు.. తక్కువ వడ్డీకే రుణం అంటూ ప్రకటనలు ఇలా పలు సందేశాలు వస్తుంటాయి. వీటిలో వెబ్‌సైట్‌ లింకులూ ఉంటాయి. వీటిని క్లిక్‌ చేసామంటే అంతే సంగతులు. తెలియని లింకులపై క్లిక్‌ చేస్తే.. మాల్వేర్‌, ఫిషింగ్‌ దాడుల రూపంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  
  • మీ బ్యాంకు ఖాతా విషయంలో  అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు స్టేట్‌మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుండాలి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే దాని గురించి బ్యాంకుకు ఫిర్యాదు చేయండి.
  • ఓటీపీ స్కాముల విషయంలో అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మంత్రం. సందేహాస్పదంగా అనిపించినప్పుడు కాస్త ఆగి, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే లావాదేవీలను కొనసాగించడం ఉత్తమం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని