స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా

 పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి.

Published : 05 Apr 2024 00:53 IST

 పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ స్థిరాస్తి రంగం ఎప్పుడూ పెట్టుబడి దారులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం కావడం ఒక్కటే ఇక్కడ ప్రతికూలాంశం. ఈ ఇబ్బందిని అధిగమిస్తూ.. తక్కువ మొత్తంతోనూ వాణిజ్య స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించేవే రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు (రీట్స్‌). రూ.100తోనూ ఇందులో మదుపు చేయొచ్చు. వీటి గురించి తెలుసుకుందామా..

ఏదైనా వాణిజ్య భవనాన్ని చూసినప్పుడు ఇందులో మనకూ వాటా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. కానీ, అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దేశంలో స్థిరాస్తి అంటే నివాస గృహాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. వాణిజ్య స్థిరాస్తి రంగం దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. కార్యాలయాల స్థలాలు, ఐటీ సంస్థలు, గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు, హబ్‌లు, నాలెడ్జ్‌ పార్కుల వంటి వాటితో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పించేవే రీట్స్‌. మరోమాటలో చెప్పాలంటే.. ఆస్తులను ప్రత్యక్షంగా కొనాల్సిన అవసరం లేకుండా, రీట్స్‌లో మదుపు చేస్తే చాలు. అది నిర్వహించే వాణిజ్య ఆస్తుల్లో మనకు వాటా ఉంటుందన్నమాట.

రకాలున్నాయి...

రీట్స్‌లో కొన్ని రకాలూ ఉన్నాయి. ఈక్విటీ రీట్స్‌ స్థిరాస్తులలో నేరుగా మదుపు చేస్తాయి. వాటిలో వాటాలను కొనుగోలు చేస్తాయి. అద్దె ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తాయి. కొన్ని రీట్స్‌ స్థిరాస్తి డెవలపర్లకు డబ్బును అప్పుగా ఇస్తాయి. వీటికి వడ్డీ ఆదాయం లభిస్తుంది. మరికొన్ని హైబ్రిడ్‌ రీట్స్‌ వాణిజ్య స్థలాలను కొనడంతోపాటు, అప్పులూ ఇస్తుంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రీట్స్‌ అనుకూలంగా ఉన్నాయన్నది పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. 

రూ.100తోనూ..

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలోనే రీట్స్‌ ఉంటాయి. కాబట్టి, పారదర్శకత ఉంటుంది. కచ్చితమైన నిబంధనలూ పాటిస్తాయి. రీట్స్‌ను నేరుగా డీమ్యాట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఫండ్‌ ఆఫ్‌ ఫండ్లూ అందుబాటులో ఉన్నాయి. యూనిట్లను కొనుగోలు చేయడం ద్వారా వీటిలో మదుపు చేయొచ్చు. కనీసం రూ.100తోనూ వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్‌ చేయాలంటే కొన్ని ఫండ్లలో రూ.1,000 అవసరం. కావాలనుకున్నప్పుడు యూనిట్లను అమ్ముకునే వీలూ ఉంటుంది.

రాబడి ఎలా..

రీట్స్‌లను నిర్వహించే సంస్థలు 80 శాతం వరకూ ఆదాయాన్ని ఆర్జించే ఆస్తులలోనే పెట్టుబడులు పెట్టాలనేది నిబంధన. వచ్చిన ఆదాయంలో కనీసం 90 శాతం ప్రతి ఆరు నెలలకోసారి డివిడెండ్‌ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది అద్దె ఆదాయం అనుకోవచ్చు.  

పరిశోధించండి..

రీట్స్‌లో మదుపు చేసేందుకు ముందుగా వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అవి ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నాయో పోర్ట్‌ఫోలియోను గమనించాలి. వాటి పనితీరును అంచనా వేయాలి. ఆయా వాణిజ్య స్థలాలకు ఉన్న గిరాకీలాంటివి చూడాలి. అప్పుడే సరైన రీట్స్‌ను ఎంచుకోగలం.

వైవిధ్యం కోసం..

పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం రీట్స్‌ను ఎంచుకోవచ్చు. రిటెయిల్‌, ఆఫీసు స్థలాలు, నివాస గృహాలు ఇలా పలు విధాలుగా మదుపు చేసే రీట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల నష్టభయం తగ్గుతుంది.

ఆదాయంపై దృష్టి..

అద్దెల ద్వారా ఆదాయం సంపాదించడమే రీట్స్‌ ప్రధాన లక్ష్యం. మీరు ఎంచుకున్న రీట్స్‌ గత కొంతకాలంగా ఎంత డివిడెండ్‌ రాబడిని అందించిందో చూసుకోండి. అదే సమయంలో మార్కెట్‌ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పనితీరునూ అంచనా వేయాలి. అవసరాన్ని బట్టి, మార్పులు చేర్పులు చేసుకోవాలి. అప్పుడే రీట్స్‌ నుంచి మంచి లాభాలను ఆర్జించేందుకు వీలవుతుంది.

నష్టభయాలూ ఉంటాయి..

పెట్టుబడులు ఏమైనా నష్టభయం సహజం. రీట్స్‌లోనూ ఇది ఉంటుంది. పెట్టుబడి విలువలో హెచ్చుతగ్గులు, ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవడంవల్ల ఆదాయం రాకపోవడంలాంటివి ఉండొచ్చు. ఇలాంటప్పుడు మన పెట్టుబడిపై ఆదాయం రాకపోవచ్చు. విలువా తగ్గేందుకు అవకాశాలున్నాయి. వీటికి సిద్ధంగా ఉంటేనే రీట్స్‌ను ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని