విహార యాత్రలో ధీమాగా

వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.

Published : 12 Apr 2024 00:16 IST

వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.

దేశీయ లేదా అంతర్జాతీయ పర్యటనలో ఎదురయ్యే వివిధ ఆకస్మిక పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ కల్పించేది ప్రయాణ బీమా(ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌). ఈ పాలసీ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్య ఖర్చులు చెల్లిస్తుంది. అదే సమయంలో ప్రయాణంలో వివిధ అంశాలకూ కవరేజీని అందిస్తుంది. సాధారణంగా చెక్‌-ఇన్‌ లగేజీ ఆలస్యం కావడం, నష్టం వాటిల్లడం, విమానం రద్దు, ఆలస్యం, పాస్‌పోర్ట్‌ పోగొట్టుకోవడం తదితర నష్టాలకూ ఇది పరిహారం అందిస్తుంది.

ఇక ఆరోగ్య బీమా విషయానికి వస్తే.. ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చులను ఇది భరిస్తుంది. అంబులెన్స్‌ ఛార్జీలు, ఆసుపత్రికి వెళ్లక ముందు, ఇంటికి వచ్చాక కొన్ని రోజుల పాటు అయిన వైద్య ఖర్చుల్లాంటివి చెల్లిస్తుంది. ఈ రెండు పాలసీలూ వైద్య ఖర్చులకు పరిహారం ఇచ్చినప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం భిన్నంగా పనిచేస్తాయి.

అదే సమయంలో అంతర్జాతీయ ఆరోగ్య బీమా పాలసీలూ ఉండటం మేలు. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో సొంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. వీటితోపాటు వ్యక్తిగత ప్రమాద బీమానూ ఎంచుకోవాలి. ప్రమాదవశాత్తూ గాయాలు, ప్రమాదంలో మరణం, పాక్షిక/శాశ్వత వైకల్యం ఏర్పడినప్పుడు పరిహారం ఇస్తుంది. నామమాత్రపు ఖర్చుతో దీన్ని తీసుకోవచ్చు. ఈ రెండు పాలసీలూ భిన్నమైన పరిస్థితుల్లో వర్తిస్తాయి. మీరు ప్రయాణం మొదలు పెట్టేముందు ఈ రెండింటి గురించీ పూర్తి అవగాహన పెంచుకోండి. మీ ప్రయాణం, ఆరోగ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని, అవసరమైన పాలసీని ఎంచుకోండి.

కొన్ని సందర్భాల్లో ప్రయాణ బీమా పాలసీ వర్తించకపోయే ఆస్కారం ఉంది. కాబట్టి, క్లెయిం ఎలా చేసుకోవాలనే విషయాల గురించీ స్పష్టంగా తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్లారనే విషయాన్ని నిరూపించేందుకు బీమా సంస్థలు ఆధారాలను అడుగుతాయి. కాబట్టి, అక్కడ చేసే కొనుగోళ్లు, హోటల్‌ బిల్లులవంటివి జాగ్రత్త చేసుకోవడం మర్చిపోవద్దు.


  • ప్రయాణ బీమా సాధారణంగా నిర్ణీత కాలపరిమితితో ఉంటుంది. నిర్ణీత పర్యటనలకే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా సాధారణంగా ఏడాది వ్యవధితో ఉంటుంది. ఏటా పునరుద్ధరించుకుంటూ వెళ్లాలి. పాలసీ అమల్లో ఉన్నంత కాలం వైద్య ఖర్చులను చెల్లిస్తుంది. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పర్యటన ముగిసిన వెంటనే రద్దవుతుంది. ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు 1-3 ఏళ్ల కాలానికీ తీసుకోవచ్చు. ప్రయాణ బీమా పాలసీలు కొన్ని రోజులు, నెలల వరకే ఉంటాయి. వార్షిక ప్రయాణ బీమా పాలసీలు ఉన్నప్పటికీ.. అవి తరచూ ప్రయాణాలు చేసే వారికే సరిపోతాయి.
  • పర్యటనల్లో ఉన్నప్పుడు ప్రయాణ బీమా అవసరం అవుతుంది. దేశంలో ఉన్నప్పుడు ఆరోగ్య బీమా తోడుంటుంది. అంతర్జాతీయ, గ్లోబల్‌ హెల్త్‌ పాలసీలు ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా చికిత్స పొందేందుకు వీలవుతుంది. అయితే, ఇది మీ ప్రయాణంలో వచ్చే ఇబ్బందులకు ఆర్థిక రక్షణ కల్పించదని గుర్తుంచుకోండి.
  • ప్రయాణ, ఆరోగ్య బీమా పాలసీల్లో ఏది ఎంచుకోవాలన్నది మీ అవసరాలను బట్టి, ఆధారపడి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా ప్రయాణ బీమా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఇది తప్పనిసరి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని