లక్ష్య సాధనకు సిప్‌ మార్గం

స్టాక్‌ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్‌ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి.

Published : 12 Apr 2024 00:16 IST

స్టాక్‌ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్‌ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. జీవితంలోని వివిధ దశల్లో ఆర్థిక అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని సాధించేందుకు పెట్టుబడులు తప్పనిసరి. ఈ నేపథ్యంలో నెలకు ఎంత మదుపు చేయాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ర్థిక అవసరాలు వచ్చినప్పుడే డబ్బు కావాలంటే కష్టం. దీనికి ముందునుంచే తగిన విధంగా ప్రణాళికలు ఉండాలి. ఆదాయం ఆర్జించడం ప్రారంభించిన రోజు నుంచే క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘకాలం కొనసాగించాలి. అప్పుడే అవసరానికి కావాల్సిన డబ్బు చేతిలో సిద్ధంగా ఉంటుంది. ఇందుకోసం మదుపరులు క్రమానుగత పెట్టుబడి విధానం (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌- సిప్‌)ను ఎంచుకోవాలి.

నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా మీ ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత ఉండాలి. ఇల్లు కొనడం, పిల్లల చదువుకు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చడం, పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవడం ఇలా ప్రతి లక్ష్యానికీ ప్రత్యేక సిప్‌ ప్రారంభించాలి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యవధులకు విభజించి, వాటికి అవసరమైన మేరకు పెట్టుబడులు కేటాయించాలి.

  • సిప్‌ను నిర్ణయించుకునే ముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి. మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు, ఇప్పటికే ఉన్న పెట్టుబడులు, ఇతర బాధ్యతలను లెక్కించండి. ఆర్థిక భారం లేకుండా సౌకర్యవంతంగా ఎంత మొత్తం సిప్‌ చేసేందుకు కేటాయించాలో ఒక ఆలోచన వస్తుంది. దాన్ని ఆచరణలో పెడితే చాలు.
  • పెట్టుబడుల విషయానికి వస్తే సమయం చాలా ముఖ్యమైన అంశం. మీరు మీ సిప్‌ను ఎంత త్వరగా ప్రారంభిస్తే, పెట్టుబడులు చక్రవడ్డీ ప్రయోజనంతో పెరుగుతాయి. మీరు చిన్న మొత్తంలో సిప్‌ను ప్రారంభించినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది మంచి నిధిని సృష్టిస్తుంది.
  • ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తిని నాశనం చేస్తుంది. మీ సిప్‌ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీ ఆర్థిక లక్ష్యాలపై ద్రవ్యోల్బణ ప్రభావాన్నీ లెక్కలోకి తీసుకోండి. పెరుగుతున్న ఖర్చుల కారణంగా మీ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన మొత్తం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి, మీ పెట్టుబడిని తదనుగుణంగా సర్దుబాటు చేయండి.
  • ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పుడు ఎంత అవసరం? భవిష్యత్‌లో ఎంత ఉండాలి అని తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ కాలిక్యులేటర్లను ఉపయోగించండి. వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి, తగిన ప్రణాళికల గురించి సలహా తీసుకోండి. విభిన్న లక్ష్యాలు, వేర్వేరు సమయాలు ఉంటాయి. వీటిని లెక్కలోకి తీసుకోవాలి.
  • మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల ఎంపిక మీ సిప్‌ మొత్తాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫండ్ల రకాలను బట్టి, నష్టభయం ఆధారపడి ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా ఉండే పథకాలను ఎంచుకోవాలి. నష్టాన్ని భరించే సామర్థ్యం, పెట్టుబడి వ్యవధిని బట్టి, ఏ విభాగంలోని ఫండ్లలో మదుపు చేయాలన్నది ఆధారపడి ఉంటుంది.
  • గతంలో ఒక పథకం ఇచ్చిన రాబడి, దాని ఎంపికలో ప్రధానమే. సిప్‌ ప్రారంభిస్తున్నప్పుడు మీరు ఎంత రాబడిని ఆశిస్తున్నారో చూసుకోండి. ఆ స్థాయిలో ఉన్న ఫండ్లను ఎంచుకోండి. మార్కెట్‌ హెచ్చుతగ్గుల కారణంగా లక్ష్యం చేరడంలో ఆలస్యం కాకుండా ఇది చూసుకుంటుంది.
  • ఈక్విటీ, హైబ్రిడ్‌, డైవర్సిఫైడ్‌, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌లు ఇలా పలు రకాల ఫండ్లు ఉంటాయి. ఇందులో మీ పెట్టుబడి వ్యవధి ఆధారంగా అనువైన ఫండ్లను ఎంచుకోవాలి. కనీసం ఏడేళ్లకు మించి వ్యవధి ఉన్నప్పుడే ఈక్విటీ ఫండ్లను పరిశీలించాలి. కనీసం 12 శాతం రాబడి సాధించేలా పెట్టుబడులను కొనసాగించాలి.
  • కాలానుగుణంగా ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు మారుతూ ఉంటాయి. మీ పెట్టుబడులను అందుకు అనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి. ఆదాయం పెరిగినప్పుడు చాలామంది అధికంగా ఖర్చు చేసేస్తారు. నిజానికి ఇక్కడ పెరగాల్సింది పెట్టుబడులు. దీనివల్ల మీ లక్ష్య సాధన త్వరగా సాధ్యమవుతుంది.
  • మీ ఆర్థిక అవసరాల కోసం సరైన సిప్‌ మొత్తాన్ని నిర్ణయించడంలో కొంత ఆలోచనాత్మక విశ్లేషణ, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం రెండూ అవసరం. వ్యక్తులను బట్టి, ఆర్థిక అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి, మీ అవసరాలన్నింటినీ ఒక చోట రాసి పెట్టండి. వీటి కోసం ఎంత నిధి అవసరం అవుతుందో చూసుకోండి. దాన్ని సాధించేందుకు నేడే సరైన మొత్తంతో సిప్‌ మార్గంలో ప్రయాణం ప్రారంభించండి.

పింఛను రూపంలోనూ..

పదవీ విరమణ ప్రణాళిక కోసం సిప్‌ చేయడం ప్రారంభించారనుకోండి.. విశ్రాంత జీవితంలో నెలనెలా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. ఇప్పుడు రూ.10వేలు మదుపు చేశారనుకుందాం. కనీసం 12 శాతం రాబడితో 25 ఏళ్ల తర్వాత ఈ మొత్తం రూ.1,70,000 అయ్యేందుకు అవకాశం ఉంది. 23 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.10వేల చొప్పున 35 ఏళ్లపాటు మదుపు చేస్తూ వెళ్లాడనుకుందాం. కనీసం 12 శాతం వార్షిక సగటు రాబడితో.. ఈ మొత్తం దాదాపు రూ.6.50 కోట్ల వరకూ అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని అప్పుడు వెనక్కి తీసుకొని, అప్పుడున్న పరిస్థితుల మేరకు మదుపు చేసి, పింఛను వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా నెలకు అవసరమైన మొత్తాన్ని క్రమానుగతంగా వెనక్కి తీసుకొని, పింఛను వచ్చే ఏర్పాటూ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని