జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?

ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది.

Published : 12 Apr 2024 00:16 IST

ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. దీనికి తగ్గట్టుగా బీమా ఉండాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలను ఎంచుకోవడం ఇందుకు ఒక పరిష్కారం. దీనికి తోడుగా పలు అనుబంధ పాలసీలూ (రైడర్లు) తీసుకోవడమూ అవసరమే. అవేమిటో తెలుసుకుందామా...

ప్రాథమిక జీవిత బీమా పాలసీ విలువను పెంచేందుకు ఉపయోగపడేవే ఈ అనుబంధ పాలసీలు. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట రైడర్లను చేర్చుకోవచ్చు. జీవన శైలిని, భవిష్యత్‌ ప్రమాదాలను అంచనా వేసుకోవడం రైడర్ల ఎంపికలో కీలకం. ఈ అవగాహన ఉన్నప్పుడే సరైన అనుబంధ పాలసీలను తీసుకోగలం. చాలామంది ప్రాథమిక పాలసీకి అన్ని రైడర్లనూ కలిపి తీసుకోవాలని భావిస్తుంటారు. ఇది పాలసీ విలువను పెంచుతుంది. కానీ, కొన్ని అవసరం లేని వాటివల్ల ప్రీమియం భారం అవుతుంది. కాబట్టి, పాలసీలను ఎంచుకునేటప్పుడు కచ్చితంగా అవసరమైన వాటినే ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కొన్ని బీమా సంస్థలు టర్మ్‌ పాలసీలతోపాటు, ఎండోమెంట్‌, యూనిట్‌ ఆధారిత పాలసీలతోపాటూ వీటిని అందిస్తున్నాయి. ఇందులో కీలకమైన రైడర్లు, అవి ఎందుకు ముఖ్యమో పరిశీలిద్దాం.

విలువ పెరిగేలా

చిన్న వయసులో పాలసీ తీసుకున్నప్పుడు బాధ్యతలు ఎక్కువగా ఉండకపోవచ్చు. ఆదాయం తక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆర్థిక అవసరాలూ అధికం అవుతాయి. దీనికి తగ్గట్టుగా వివిధ దశల్లో బీమా విలువ పెరిగేలా అనుబంధ పాలసీని జోడించుకోవచ్చు. వయసు పెరిగినప్పుడు బీమా ప్రీమియం పెరుగుతుంది. కొన్నిసార్లు వైద్య పరీక్షలూ అవసరం అవుతాయి. ఇలాంటి వాటితో అవసరం లేకుండా సులభంగా పాలసీ విలువ పెరిగేందుకు ఈ రైడర్‌ తోడ్పడుతుంది. వీటిని ఒక్కో బీమా సంస్థ ఒక్కో పేరుతో అందిస్తుంది. మీరు పాలసీని ఎంచుకునేటప్పుడు బీమా సంస్థ ఈ తరహా రైడర్‌ను అందిస్తోందా లేదా అడిగి చూడండి.

తీవ్ర వ్యాధులు వస్తే..

క్యాన్సర్‌, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు.. ఇలా కొన్ని క్లిష్టమైన అనారోగ్యాలు వచ్చినప్పుడు వెంటనే పరిహారం చెల్లించేలా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను తీసుకోవచ్చు. దాదాపు అన్ని బీమా సంస్థలూ ఈ తరహా రైడర్‌ను అందిస్తున్నాయి. కుటుంబంలో తీవ్ర వ్యాధుల చరిత్ర ఉన్నవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ఈ రైడర్‌ను కొనుగోలు చేసేముందు ఏయే వ్యాధులకు పరిహారం ఇస్తుందన్న విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. బీమా సంస్థలను బట్టి, కవరేజీలు మారుతుంటాయని మర్చిపోవద్దు. తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు సంబంధిత ఖర్చులను తట్టుకునేందుకు ఈ రైడర్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

వైకల్యం సందర్భంలో

ప్రమాదాలు శాశ్వత లేదా పాక్షిక వైకల్యానికి దారితీయొచ్చు. వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలకు డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటప్పుడు పరిహారం ఇచ్చేలా యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవాలి. భవిష్యత్తులో ప్రీమియాలను చెల్లించడంతోపాటు, పాలసీదారులకు నిర్ణీత పరిహారాన్నీ అందిస్తుంది. దీన్ని కొనుగోలు చేసేముందు ఈ రైడర్‌ నిబంధనలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.  

ప్రీమియం వెనక్కి వచ్చేలా..

టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియం సాధారణంగా వెనక్కి రాదు. ఈ సంప్రదాయ టర్మ్‌ పాలసీలకు భిన్నంగా చెల్లించిన ప్రీమియంలో కొన్ని మినహాయింపులు పోను మిగతాది వెనక్కి వచ్చేలా రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం అనుబంధాన్నీ తీసుకోవచ్చు.

ఆదాయం ఆగిపోకుండా..

సంపాదించే వ్యక్తి దూరమైనా కుటుంబానికి నెలనెలా వచ్చే ఆదాయం ఆగిపోకుండా ఏర్పాటు చేయొచ్చు. దీనికోసం ఫ్యామిలీ ఇన్‌కం బెనిఫిట్‌ రైడర్‌ తోడ్పడతాయి. కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా నిర్ణీత కాలంపాటు స్థిరమైన ఆదాయాన్ని ఈ రైడర్‌ అందిస్తుంది.

బీమా సంస్థలు ప్రాథమిక పాలసీ పరిహారాన్ని ఎలా చెల్లించాలి అనే దానికీ రకరకాల ఎంపికలను అందిస్తున్నాయి. దీనితోపాటు ఈ అనుబంధ పాలసీ తోడైనప్పుడు పాలసీదారుడి కుటుంబానికి అదనపు హామీ మొత్తం లభిస్తుంది.  బీమా సంస్థలను బట్టి, ఈ అనుబంధ పాలసీలు (రైడర్లు) మారుతూ ఉంటాయి. కొన్ని సంస్థలు ఇలాంటివేమీ లేకుండానూ పాలసీలను అందిస్తాయి. మీ అవసరాన్ని బట్టి, వీటిని తీసుకోవాలి. రైడర్లను తీసుకునేప్పుడు వాటికి సంబంధించిన నిబంధనలు, షరతులు నిశితంగా పరిశీలించడం చాలా కీలకం.


ప్రమాదం బారిన పడితే..

పాలసీదారుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే అధిక పరిహారం అందించే ‘యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌ రైడర్‌’ను చాలా బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ రైడర్‌కు స్వల్ప ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే.. ప్రాథమిక పాలసీతోపాటు, ఈ రైడర్‌ ద్వారా అదనపు  పరిహారమూ నామినీకి అందుతుంది. ప్రమాదాలు కుటుంబంపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయి. ముఖ్యంగా మన దేశంలో రోడ్డు ప్రమాదాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, తరచూ ప్రయాణాలు చేసేవారు ఇది ముఖ్యమైన అనుబంధ పాలసీ అని మర్చిపోవద్దు.


ప్రీమియం చెల్లించకున్నా..

అనుకోని పరిస్థితుల్లో బీమా పాలసీ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించకపోతే ఆ పాలసీ రద్దవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనూ బీమా కొనసాగాలంటే.. వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడర్‌ ఉపయోగపడుతుంది. శాశ్వత వైకల్యం సంభవించి, కొన్నాళ్లు ఆదాయాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో చెల్లించాల్సిన ప్రీమియాలన్నీ చెల్లించే విధంగానూ ఈ రైడర్‌ తీసుకోవచ్చు. శాశ్వత వైకల్యమే కాకుండా, ఇతర పరిస్థితుల వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక ఇబ్బందుల సమయంలోనూ సహాయం చేసేలా ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని