ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా

 ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది.

Published : 19 Apr 2024 00:03 IST

 ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. మరోవైపు ఈ పాలసీల ప్రీమియం ఏటా 10-15 శాతం వరకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రీమియం భారం కాస్త తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలేమిటో తెలుసుకుందాం.

ఆరోగ్య బీమా పాలసీని చిన్న వయసులోనే తీసుకోవడం ఎప్పుడూ ముఖ్యం. అప్పుడు బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. పైగా యువతకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటం చాలా అరుదు. సాధారణంగా వైద్య పరీక్షల అవసరమూ లేకుండానే పాలసీ ఇస్తారు. ఆరోగ్య బీమా పాలసీ పునరుద్ధరణ సమయంలోనూ ప్రీమియం పెంపు స్వల్పంగా ఉంటుంది. ముందుగానే పాలసీ తీసుకుంటే.. చాలా ఏళ్ల వరకూ తక్కువ ప్రీమియానికే పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది.

  • చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్లడం అవసరంగా మారుతోంది. ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లినా.. రూ.5,000 వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడూ బీమా పరిహారం ఇచ్చేలా ఓపీడీలాంటి అనుబంధ పాలసీలను ఎంచుకోవాలి. స్వల్పంగా ప్రీమియం పెరిగినా, తర్వాత వచ్చే ప్రయోజనాలు అధికంగానే ఉంటాయి.
  • ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. సొంతంగా, కుటుంబానికి అంతటికీ తీసుకున్న పాలసీకి చెల్లించిన ప్రీమియానికి గరిష్ఠంగా రూ.25,000 వరకూ పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల కోసం (సీనియర్‌ సిటిజన్లు) పాలసీ తీసుకున్నప్పుడు రూ.50 వేల వరకూ క్లెయిం చేసుకోవచ్చు. ఇలా పన్ను ఆదా వల్ల మిగిలిన మొత్తాన్ని ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియాన్ని చెల్లించేందుకు వాడుకోవాలి.
  • మీ అవసరం, బడ్జెట్‌కు తగిన పాలసీని ఎంచుకోవాలి. రూ.5లక్షల పాలసీని ఎంచుకునేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటన్నింటినీ పరిశీలించాలి. మీ బడ్జెట్‌ అనుమతించిన మేరకు ప్రీమియం చెల్లించాలి. అధిక ప్రీమియం పాలసీలను తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. అదే సమయంలో చెల్లింపుల చరిత్ర చూసుకోవడమూ మర్చిపోవద్దు. అవసరం లేని అదనపు సౌకర్యాలను ఎంచుకోవద్దు. దీనివల్ల ప్రీమియం పెరుగుతుంది.
  • ఆరోగ్యకరమైన జీవన శైలి ఉన్నవారికి బీమా సంస్థలు ప్రీమియంలో రాయితీనిస్తున్నాయి. వెల్‌నెస్‌ ప్రోగ్రాంల పేరుతో ఈ ప్రయోజనాలను అందిస్తున్నాయి. వీటిని పరిశీలించవచ్చు. ఇందులో భాగంగా ఆరోగ్య పరీక్షల్లోనూ రాయితీలు లభిస్తాయి. పాలసీ పునరుద్ధరణ సమయంలోనూ కొంత తగ్గింపు వర్తిస్తుంది.
  • ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స ఖర్చులో కొంత మొత్తాన్ని భరించే విధంగానూ పాలసీని ఎంచుకోవచ్చు. సాధారణంగా ఇది 10-20 శాతం వరకూ ఉంటుంది. ఇలా ఎంచుకున్న పాలసీలకు ప్రీమియం తక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ వీటిని తీసుకోకపోవడమే మంచిది. తీసుకున్నా 10 శాతానికి మించి సహ చెల్లింపు ఉండకూడదు.
  • మార్కెట్లో ఉన్న అన్ని పాలసీలనూ ఒకసారి పోల్చి చూసుకోండి. అందులో నుంచి మీ అవసరాలకు తగిన పాలసీని ఎంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య వివరాలు, ఆహార అలవాట్ల గురించి ఎలాంటి దాపరికం లేకుండా తెలియజేయడం మర్చిపోవద్దు.
  • పునరుద్ధరణ సమయంలో ఇతర సంస్థలకు మారేందుకు ప్రయత్నించవచ్చు. కొన్ని బీమా సంస్థలు అదే పాలసీని తక్కువ ధరకు అందిస్తామని చెబుతుంటాయి. అన్ని షరతులూ మీకు అనుకూలంగా ఉంటే.. ప్రీమియం తక్కువగా వసూలు చేస్తున్న సంస్థకు మారొచ్చు. ఒకటికి రెండుసార్లు పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకోవాలి.
  • సూపర్‌ టాపప్‌ పాలసీలను ఎంచుకోవడం ద్వారా తక్కువ ప్రీమియానికే అధిక మొత్తంతో పాలసీని తీసుకునేందుకు వీలవుతుంది. మీ ప్రాథమిక పాలసీ రూ.5లక్షలు ఉంటే.. అక్కడి నుంచి సూపర్‌ టాపప్‌ పాలసీని తీసుకునే విషయాన్ని పరిశీలించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు