ఉన్నత చదువులకు భరోసానిద్దాం...

పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది.

Updated : 19 Apr 2024 00:42 IST

పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. ఈ ఆర్థిక సవాలును అధిగమించేందుకు ఏం చేయాలన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారతీయుల ఆర్థిక ప్రణాళికల్లో పిల్లల చదువులకే అధిక ప్రాధాన్యం. బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ ఎంత మొత్తం కావాలో ముందే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే దీర్ఘకాలిక దృష్టితో అధిక రాబడిని అందించే పథకాల్లో మదుపు చేయడం ప్రారంభించాలి. అప్పుడే ఎలాంటి చిక్కులూ లేకుండా పిల్లల ఆశలు తీర్చడంలో తల్లిదండ్రులు విజయం సాధిస్తారని చెప్పొచ్చు.

కాస్త పేరున్న పాఠశాలలో పిల్లలను చేర్చాలంటే ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఖర్చవుతోంది. దీనికి ఇతర ఖర్చులు అదనం. బడిలో చేరినప్పటి నుంచీ ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకూ ఎంత ఖర్చు అవుతుందన్నది ఒక అంచనా వేసుకోవాలి. దీనివల్ల ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది. మొత్తం ఒకేసారి అవసరం ఉండదు. దశల వారీగా, ఎప్పుడు ఎంత మొత్తం కావాలి అన్నది తెలుసుకుంటే.. అందుకు అనువైన పథకాల్లో మదుపు చేసేందుకు వీలవుతుంది. పిల్లల అవసరాలకు పెట్టుబడులు పెట్టేటప్పుడు దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే వాటిని ఎంచుకోవాలి.

పలు పథకాల్లో...

పిల్లల చదువులకు అవసరమైన మొత్తం కూడబెట్టేందుకు ఏదో ఒక పథకంపైనే ఆధారపడితే సరిపోదు. సురక్షితంగా ఉండే రికరింగ్‌ డిపాజిట్లు మొదలు.. అధిక నష్టభయం ఉండే షేర్ల వరకూ పెట్టుబడులు ఉండాలి. ఈక్విటీ ఫండ్లతోపాటు, డెట్‌ పథకాలనూ ఎంచుకోవాలి. అధిక నష్టభయం ఉండే ఈక్విటీ పథకాలకు ఎంత కేటాయించాలి, సురక్షిత పథకాలకు ఎంత మళ్లించాలి అనేదీ కీలకమే. 10-12 ఏళ్ల వ్యవధి ఉన్నప్పుడు ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను  ఎంచుకోవాలి. 4-5 ఏళ్లలోనే డబ్బు వెనక్కి రావాలనుకుంటే డెట్‌ పథకాలను పరిశీలించాలి.

ఫండ్లలోనూ మదుపు

పిల్లల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ప్రత్యేక పథకాలనూ తీసుకొస్తున్నాయి. చైల్డ్‌ కెరీర్‌ ప్లాన్‌, చైల్డ్‌ గిఫ్ట్‌ ప్లాన్‌ వంటి పేర్లతో ఇవి ఉంటాయి. సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకాలకు అయిదేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. లేదా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ.. ఈ రెండింటిలో ఏది ముందయితే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఇవి ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ పథకాలు. ప్రధానంగా ఈక్విటీ, డెట్‌లలో మదుపు చేస్తాయి. అధిక వడ్డీ కోసం కొంత మొత్తాన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు రుణం ఇచ్చేలా బాండ్లలోనూ కొంత పెట్టుబడి ఉంటుంది. మొత్తంగా వీలైనంత అధిక రాబడిని ఆర్జించేలా, అదే సమయంలో కొంత సురక్షితంగా ఉండేలా పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తారు. ఈక్విటీల్లో 65 శాతం వరకూ, డెట్‌ ఫండ్లలో 35 శాతం వరకూ మదుపు  చేస్తాయి. కొన్నిసార్లు ఈక్విటీలకు 75 శాతం వరకూ కేటాయించే అవకాశాలూ ఉంటాయి. కొంత నష్టభయం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇది పెద్దగా ప్రభావం చూపదు. పిల్లల ఫండ్ల లక్ష్యం ఒకటే.. వారి భవిష్యత్తుకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం. వారి ఉన్నత చదువులు, విదేశీ విద్యాభ్యాసం, వారి ఇతర కలలకు తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టాలి. వీలైనంత వరకూ లక్ష్యం సాధించే వరకూ ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోకూడదు.

పిల్లల పాలసీలతో...

చాలామంది తల్లిదండ్రుల మొదటి ప్రాధాన్యం తమ పిల్లల కోసం పొదుపు చేయడమే. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకునే వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. పిల్లలకు నిజంగా డబ్బు అవసరమైనప్పుడు, వారి అవసరాలను తీర్చేందుకు ఈ ఒక్క వ్యూహం సరిపోదు. పిల్లల అవసరాలకు అవసరమైన మొత్తం డబ్బు అందుబాటులో ఉంటుందని ఏ పథకమూ హామీ ఇవ్వదు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లు, బంగారం, స్థిరాస్తి ఎందులోనైనా సరే మనం పెట్టుబడి పెడుతూ వెళ్తేనే అవి దీర్ఘకాలంలో తగిన రాబడిని అందిస్తాయి.

ఉదాహరణకు ఏడాది వయసులో ఉన్న అబ్బాయి/అమ్మాయికి 21 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి రూ.20లక్షలు అవసరం అనుకుందాం. దీనికోసం తల్లిదండ్రులు 12 శాతం వార్షిక రాబడి వచ్చే పథకాల్లో ఏటా కనీసం రూ.25వేల వరకూ మదుపు చేయాలి. దీన్ని కూడబెట్టాలంటే.. వారికి ఎలాంటి అనుకోని పరిస్థితులూ ఎదురుకాకూడదు. ఒకవేళ ఏదైనా సంఘటనతో ఆర్జించే కుటుంబ పెద్ద దూరమైతే.. అప్పుడు పెట్టుబడులన్నీ ఆగిపోతాయి. పిల్లల ఆర్థిక అవసరాలు ప్రశ్నార్థకం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించేందుకే పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న బీమా పాలసీలను ఎంచుకోవాలి. పాలసీ తీసుకున్న తల్లిదండ్రులు అనుకోకుండా దూరమైనప్పుడు వెంటనే పాలసీ విలువను పరిహారంగా చెల్లిస్తుంది. పాలసీ గడువు తీరే వరకూ కొనసాగుతుంది. దీనికోసం ప్రీమియం వైవర్‌ రైడర్‌ తోడ్పడుతుంది. వ్యవధి ముగిసిన తర్వాత బీమా పాలసీ నుంచి అందాల్సిన డబ్బు చేతికి వస్తుంది. ఇలాంటి పాలసీలనూ పిల్లల చదువుల ప్రణాళికలో భాగం చేయాలి.

సురక్షితంగా..

తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక రక్షణ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పిల్లల బాధ్యతలను నెరవేర్చేలా ఉండాలి. అందుకే, సంపాదించే వ్యక్తి తన పేరుమీద.. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. కుటుంబానికి అంతటికీ వర్తించేలా కనీసం రూ.10లక్షల ఆరోగ్య బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని