వెండిలో పెట్టుబడి లాభమేనా?

బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు

Updated : 19 Apr 2024 00:40 IST

 బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. పెట్టుబడులుగానూ ఇప్పుడు వీటిని నమ్ముతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి, వైవిధ్యం కోసం చూస్తున్న వారు ఇప్పుడు వెండిని ఒక మదుపు సాధనంగా ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో మదుపు చేస్తే లాభమేనా? పెట్టుబడులు ఎలా పెట్టాలి? తెలుసుకుందాం.

 కిలో వెండి ధర రూ.లక్షకు చేరుకుంటుంది.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న వార్త ఇది. దేశంలో 2024లో వెండి ధరలు స్థిరమైన వృద్ధితో కొనసాగుతున్నాయి. 2023లో వెండి 7.19 శాతం రాబడినిచ్చింది. ఈ ఏడాది ఇది రూ.86,300 వద్ద కొత్త గరిష్ఠాన్ని తాకింది. కొన్ని బ్రోకరేజీ సంస్థలు కిలో వెండి ధర మధ్యస్థ కాలంలో రూ.1లక్ష నుంచి రూ.1.2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశాయి. 2017లో కిలో వెండి సగటు ధర రూ.37,825గా ఉంది. 2023లో ఇది రూ.78,600లకు చేరింది.

పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇతర ఆర్థిక కారణాల వల్ల ఇటీవలి కాలంలో పసిడి, వెండికి గిరాకీ పెరుగుతోంది. ఊహాజనిత కొనుగోళ్లు, పారిశ్రామిక అవసరాలు పెరుగుతుండటంతోనూ వెండిలో ర్యాలీ కనిపిస్తుండటం గమనించవచ్చు. ఇవే కాకుండా చారిత్రాత్మకంగానూ బంగారంతోపాటు వెండి ధరలు పెరగడం సహజమే. కాబట్టి, వెండిలో దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయడం మంచిదనే నిపుణుల అభిప్రాయం.

వెండిని పలు రూపాల్లో కొనుగోలు చేసేందుకు వీలుంది. నేరుగా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కడ్డీలు, నాణేల రూపంలో తీసుకోవచ్చు. వెండితో రూపొందించిన పలు వస్తువులూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఆభరణాలూ వస్తున్నాయి. వీటిలో ఏది మీకు అనుకూలమో నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కడ్డీలు, నాణేల రూపంలో తీసుకున్నప్పుడు ఖర్చులు తక్కువగా ఉంటాయి. వస్తువులు, ఆభరణాల రూపంలో తీసుకున్నప్పుడు తయారీ రుసుములు, తరుగులాంటివి ఉండొచ్చు.

ఇలా కాకుండా, డిజిటల్‌ రూపంలోనే వెండిలో మదుపు చేయాలనుకుంటే.. అందుబాటులో ఉన్న మార్గం సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు (ఈటీఎఫ్‌లు). డీమ్యాట్‌ రూపంలో వెండిని కొనుగోలు చేసేందుకు ఇవి తోడ్పడతాయి. ఇవి మార్కెట్లలో షేర్ల తీరుగానే పనిచేస్తాయి.

సిల్వర్‌ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారులు అనుకూలమైన, సురక్షిత మార్గంలో వెండిలో పెట్టుబడి పెట్టే మార్గాన్ని అందిస్తాయి. తక్కువ పెట్టుబడి ఖర్చులు, సులభంగా మదుపు చేసే వీలు వల్ల వెండి ఈటీఎఫ్‌లు ఆదరణ పొందుతున్నాయి.

మారుతున్న వెండి ధరల ఆధారంగా యూనిట్‌ ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. వెండి ధరను దగ్గరగా అనుసరించడానికి కొన్ని ఈటీఎఫ్‌లు నేరుగా ఈ లోహాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటాయి. కొన్ని ఈటీఎఫ్‌లు వెండి గనులను నిర్వహించే సంస్థల షేర్లలోనూ మదుపు చేస్తాయి.

వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగానే చూడాలి అని నిపుణులు పేర్కొంటున్నారు. స్వల్పకాలంలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడినప్పుడు వీటి ధరలపై ప్రభావం పడుతుంది. అదే సమయంలో గ్రీన్‌ ఎనర్జీ, విద్యుత్‌ వాహనాల్లో వెండి వినియోగం పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమని చెప్పొచ్చు.

పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే మదుపరులు వెండి చారిత్రక పనితీరు, అనుకూలతలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒక సురక్షితమైన పెట్టుబడిగా దీన్ని గుర్తించొచ్చు. స్వల్పకాలిక లాభాల కోసం ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ మదుపు చేయొద్దు. వెండి ధరలు స్వల్పకాలంలో చాలా అస్థిరంగా ఉంటాయి. బంగారంతో పోలిస్తే ఇందులో నష్టభయమూ కొంత ఉంటుంది. కాబట్టి, ఇతర పెట్టుబడుల విషయంలో తీసుకునే జాగ్రత్తలు దీనికీ వర్తిస్తాయి. వెండిలో పెట్టుబడి పెట్టే ముందు వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితిలాంటివి పరిగణనలోకి తీసుకోవాలి.

10 శాతం వరకూ..

బంగారం, వెండిలో పెట్టుబడులు మీ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వం, సమతుల్యతను అందించేందుకు దోహదం చేస్తాయని అర్థం చేసుకోవాలి. వీటిలో పెద్ద మొత్తంలో మదుపు చేయడం ఎప్పుడూ సరికాదు. మీరు పెట్టుబడులకు కేటాయించిన మొత్తంలో 10 శాతం వరకూ ఈ రెండు లోహాలకూ కేటాయించడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని