ఆరోగ్య బీమా అందరికీ అందేలా...

అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.

Updated : 26 Apr 2024 00:35 IST

అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇప్పటి వరకూ ఈ పాలసీల్లో చేరేందుకు ఉన్న గరిష్ఠ వయసు పరిమితి 65 ఏళ్లను తొలగించింది. దీంతోపాటు కొన్ని ప్రత్యేక పాలసీలనూ అందించేందుకు బీమా సంస్థలకు అవకాశం కల్పించింది.

పెరుగుతున్న వైద్య చికిత్సా ఖర్చుల నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీ ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరం అయ్యింది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో కీలకమైన ఈ పాలసీలో నియంత్రణ సంస్థ ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులను, కొత్త నిబంధనలూ తీసుకొస్తూనే ఉంది. 2016లో ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన నిబంధనల్లో 65 ఏళ్ల వరకూ ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. తాజాగా ఏప్రిల్‌ 1న జారీ చేసిన నిబంధనల్లో ఈ వయో పరిమితిని పేర్కొనకుండా.. ‘అన్ని వయసుల వారికీ సరిపోయేలా పాలసీలు తీసుకురావాలి’ అని సూచించింది. దీంతో గరిష్ఠ వయోపరిమితి లేకుండా అందరూ బీమా పాలసీని తీసుకునే వీలు కలుగుతోంది.

నిబంధనల మాట ఎలా ఉన్నా.. ఇప్పటికే పలు బీమా సంస్థలు 65 ఏళ్లు దాటిన వారికీ ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్‌ పాలసీలను అందిస్తున్నాయి. కొన్ని బీమా పాలసీల ప్రవేశానికి కనిష్ఠ, గరిష్ఠ వయో పరిమితి 20, 60 ఏళ్లుగానూ పేర్కొనేవి. ఇవి బీమా సంస్థ నిబంధనలను బట్టి, ఆధారపడి ఉంటుంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీమా సంస్థ అందించే అన్ని పాలసీలూ 65 ఏళ్లు దాటిన వారికీ ఇస్తాయని చెప్పలేం.

తాజా నిబంధనల ప్రకారం వీరి కోసం ప్రత్యేకంగా ఒకటి రెండు పాలసీలను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరోగ్య బీమా తీసుకున్న వారు.. పాలసీని జీవితాంతం వరకూ పునరుద్ధరణ చేసుకోవచ్చనే సంగతి తెలిసిందే.

ప్రత్యేకంగా..

తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఐఆర్‌డీఏఐ సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లల కోసం ప్రత్యేక పాలసీలు రూపొందించుకునే అవకాశం బీమా సంస్థలకు ఇచ్చింది. ప్రసూతి ఖర్చులు, ఇతర అవసరాలకూ బీమా పాలసీలను నిబంధనలకు అనుగుణంగా ఆవిష్కరించే వెసులుబాటునూ కల్పించింది. దీనివల్ల ఆయా విభాగాల్లో కొత్త పాలసీలు తీసుకొచ్చేందుకు బీమా సంస్థలకు వెసులుబాటు లభించింది. ఇది ఆరోగ్య బీమా రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులు, పిల్లల కోసం మరింత ప్రయోజనకరమైన పాలసీలు రావచ్చు. వీటికి ప్రీమియం తక్కువగా ఉండే వీలుంది. దీంతో చాలామంది ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునేందుకు వీలవుతుంది.

వ్యాధుల ఆధారంగా..

ఆరోగ్య బీమా రంగంలో మరో కీలకమైన మార్పునకు కొత్త నిబంధనలు వెసులుబాటు కల్పించాయి. ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు అన్ని వ్యాధుల చికిత్సకూ పరిహారం ఇస్తుంది. ఇప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సకు కొన్ని మినహాయింపులకు లోబడి క్లెయిం చెల్లిస్తాయి. కానీ, ఇప్పుడు ముందస్తు జబ్బుల చికిత్స ఖర్చును చెల్లించేలా ప్రత్యేక పాలసీలు వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇప్పటికే గుండె జబ్బు ఉందనుకుందాం. ఈ వ్యాధి చికిత్స కోసం ప్రత్యేకంగా వచ్చిన పాలసీని తీసుకోవచ్చు. తీవ్ర వ్యాధులతో బాధ పడుతున్న వారికి ఇది ప్రయోజనకరం చేకూరుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు