మ్యూచువల్‌ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?

ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్‌ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.

Published : 26 Apr 2024 00:30 IST

ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్‌ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. నెలనెలా వీటిల్లో పెరుగుతున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్‌లో ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారూ, కొత్తగా మదుపు చేయబోతున్నవారూ ముఖ్యమైన ఒక పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలు పాటించడం. మీ గుర్తింపు వివరాలను ధ్రువీకరించడంతోపాటు, మీ పెట్టుబడులకు చట్టబద్ధతను నిర్ణయించడంలోనూ ఇది కీలకం అవుతుంది.

పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించడంలో కేవైసీ చాలా ముఖ్యమైన అంశం. దొంగతనంలాంటి మోసపూరిత కార్యకలాపాలను నిరోధించేందుకు ఇది సహాయపడుతుంది. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే వ్యక్తే, ఆ పెట్టుబడులకు అసలైన యజమాని అని కేవైసీ నిర్ధారిస్తుంది.

  •  మనీలాండరింగ్‌ వంటి మోసాల ద్వారా పెట్టుబడులు ఫండ్లలోకి రాకుండా ఇది నిరోధిస్తుంది. వ్యక్తిగత పెట్టుబడిదారులు సురక్షితంగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు అవసరమైన స్వేచ్ఛను అందిస్తుంది.
  •  స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం కేవైసీ ఒక తప్పనిసరి ప్రక్రియ. పారదర్శక వాతావరణంలో మదుపరులు తమ పెట్టుబడులను నిర్వహించేందుకు వీలు కల్పించడమే దీని లక్ష్యం. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.

ఎలా తెలుసుకోవాలి?

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల దగ్గర మీ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం మంచిది. దీనికోసం ఏం చేయాలంటే..

  •  ఫండ్‌ సంస్థల వెబ్‌సైట్లలో మీ కేవైసీ స్థితిని తనిఖీ చేసుకునేందుకు ఏర్పాటు ఉంటుంది. మీ పెట్టుబడి, పాన్‌ వివరాల ఆధారంగా లాగిన్‌ అయి, మీ కేవైసీ వివరాలను పరిశీలించండి.
  •  కేవైసీ రిజిస్ట్రేషన్‌ ఏజెన్సీ(కేఆర్‌ఏ)ల ద్వారా కేవైసీ పరిస్థితిని తెలుసుకునేందుకు వీలుంది. మీ పాన్‌, ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా ఈ వివరాలు తెలుస్తాయి.
  • మీ కేవైసీని ధ్రువీకరించిన కేఆర్‌ఏని సంప్రదిస్తే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుంది.

తాత్కాలికంగా నిలిపివేస్తే..

మీ కేవైసీని కొన్నిసార్లు తాత్కాలికంగా నిలిపివేసే (ఆన్‌ హోల్డ్‌) ఆస్కారమూ ఉంది. దీనికి ప్రధాన కారణం మీరు సమర్పించిన పత్రాల్లో వ్యత్యాసాలుండటమే.

  •  కేఆర్‌ఏ లేదా మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలో సంప్రదించి, మీ కేవైసీని ఎందుకు నిలిపివేశారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. చిరునామా ధ్రువీకరణలు, పాన్‌ వివరాలు, ఇతర పత్రాలు ఒకే విధంగా లేనప్పుడు సాధారణంగా ఇలా జరుగుతుంది.
  •  సమస్యను గుర్తించిన తర్వాత కేవైసీ నిబంధనలకు అనుగుణంగా మీ పత్రాలను తిరిగి సమర్పించండి. వీటిని పరిశీలించిన తర్వాత కేఆర్‌ఏలు, ఫండ్‌ సంస్థలు మీ కేవైసీని ఆమోదిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని