తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా

అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి.

Updated : 03 May 2024 11:50 IST

అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. తీవ్ర వ్యాధి బారిన పడినప్పుడు ఒకేసారి పరిహారం ఇచ్చే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీల అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో వీటి గురించిన వివరాలను తెలుసుకుందాం.

ప్రాణాంతక వ్యాధి సోకినప్పుడు దీర్ఘకాలిక చికిత్స అవసరం. దీని ఖరీదూ ఎక్కువే. గుండె జబ్బు, క్యాన్సర్‌, పక్షవాతం, అవయవ మార్పిడి, మూత్రపిండాల వైఫల్యం, మెదడులో సమస్యలాంటివి తీవ్రమైన వ్యాధులుగా చెప్పొచ్చు. ఈ తరహా క్లిష్టమైన అనారోగ్యాలు వ్యక్తి, అతని కుటుంబానికి శారీరక, మానసిక, ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయి. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా, చికిత్సకు అవసరమైన డబ్బును అందించడంలో క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు తోడ్పడతాయని చెప్పొచ్చు.

ఏమిటివి?

ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చులను అందించే పాలసీని క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీగా చెప్పొచ్చు. ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకున్నప్పుడు ఆరోగ్య బీమా పాలసీ ఆ ఖర్చులను చెల్లిస్తుంది. ఇందుకు భిన్నంగా తీవ్ర వ్యాధి వచ్చినప్పుడు ఒకేసారి పరిహారం అందిస్తుంది. అందుకే వీటిని ‘ఫిక్స్‌డ్‌ బెనిఫిట్‌’ పాలసీలుగా పిలుస్తారు. బీమా తీసుకున్న వ్యక్తికి పాలసీలో పేర్కొన్న జాబితాలోని వ్యాధుల్లో ఏది నిర్ధారణ అయినా బీమా సంస్థ ఏకమొత్తాన్ని చెల్లిస్తుంది. దీనివల్ల పాలసీదారుడికి, కుటుంబానికి ఆర్థిక చిక్కులు రాకుండా చూస్తుంది.

విడిగానే మేలు..

ఈ పాలసీని విడిగా తీసుకునే అవకాశం ఉంది. లేదా ఆరోగ్య, జీవిత బీమా పాలసీలతో పాటు కలిసి రైడర్‌గానూ ఎంచుకోవచ్చు. కుటుంబంలో ఎవరికైనా తీవ్ర వ్యాధుల చరిత్ర ఉన్నప్పుడు కచ్చితంగా ఈ పాలసీని తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకూ ప్రత్యేక పాలసీగానే దీన్ని తీసుకోవాలి. రైడర్‌గా ఎంచుకున్నప్పుడు ప్రాథమిక పాలసీ విలువలో 30 శాతానికి మించి ఉండకపోవచ్చు. ప్రాథమిక పాలసీకి ప్రీమియం చెల్లించడం ఆపేస్తే.. ఇదీ రద్దవుతుంది. విడిగా తీసుకున్నప్పుడు తక్కువ ప్రీమియంతోనే అధిక మొత్తానికి రక్షణ లభిస్తుంది.

జాబితా చూడాలి..

తీవ్ర వ్యాధుల జాబితా బీమా సంస్థను బట్టి మారుతుంది. కొన్ని సంస్థలు 36 వరకూ వ్యాధులకు రక్షణ అందిస్తామని చెబుతున్నాయి. కొన్ని 20, మరికొన్ని 12 రకాల తీవ్ర వ్యాధులకు పరిహారం ఇస్తున్నాయి. ప్రీమియం రేట్లూ అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. కేవలం ప్రీమియం ఒక్కటే పాలసీ తీసుకునే విషయంలో నిర్ణయాత్మక అంశం కాకూడదు. కుటుంబంలో గతంలో ఎవరికైనా తీవ్ర వ్యాధులున్నాయా? మీరు ఎంచుకున్న పాలసీలో వాటికి స్థానం ఉందా చూసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆస్తమా ఉందనుకుందాం. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ జాబితాలో ఊపిరితిత్తులకు సంబంధించిన కవరేజీ ఉండాలి. కొన్ని పాలసీలు బహుళ వ్యాధులకూ వర్తిస్తాయి. మరికొన్ని ఒక వ్యాధిని గుర్తించినప్పుడు పరిహారం ఇస్తాయి. తర్వాత పాలసీ రద్దవుతుంది.

వేచి ఉండే వ్యవధి..

ఈ పాలసీకి వేచి ఉండే వ్యవధి ఉంటుందని మర్చిపోవద్దు. పాలసీ తీసుకున్న నాటి నుంచి కనీసం 30-90 రోజుల పాటు జీవించి ఉండాలనేది ప్రధాన నిబంధన. పాలసీ తీసుకున్న తర్వాత 6 నెలల నుంచి ఏడాది తర్వాత వ్యాధిని గుర్తిస్తేనే పరిహారం అందుతుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు తక్కువ వేచి ఉండే వ్యవధి ఉన్న వాటిని తీసుకోవాలి.

క్లెయిం చేసుకోవాలంటే..

జాబితాలో ఉన్న వ్యాధి బారిన పడినప్పుడు బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. తగిన ఆధారాలతో దరఖాస్తు చేయాలి. బీమా కంపెనీ మీ క్లెయింను పరిశీలించి, పరిష్కరిస్తుంది. హామీ ఇచ్చిన మొత్తాన్ని అందిస్తుంది. పాలసీ తీసుకునేటప్పుడు మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థను ఎంచుకోవాలన్న సంగతిని గుర్తుంచుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని