ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఈ పత్రాలు ఇచ్చారా?

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్‌ సమర్పించేందుకు సమయం ఇదే.

Updated : 03 May 2024 04:06 IST

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్‌ సమర్పించేందుకు సమయం ఇదే.

 దాయపు పన్ను పరిధిలోకి రాని వారు, వడ్డీ ఆదాయంపై పన్ను విధించకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఈ పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌ 194ఏ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40వేల వరకూ ఉన్నప్పుడు ఎలాంటి టీడీఎస్‌ విధించరు. సీనియర్‌ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50,000. ఈ పరిమితులు దాటినప్పుడు బ్యాంకులు 20 శాతం చొప్పున టీడీఎస్‌ను విధిస్తాయి. ఆర్థిక సంవత్సరంలో వడ్డీ తప్ప ఇతర ఆదాయాలేమీ లేనప్పుడు ఈ పత్రాలను బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. వడ్డీ ఆదాయం నుంచి ఎలాంటి మినహాయింపులూ చేయొద్దని ఇచ్చే స్వీయ ధ్రువీకరణలివి.

ఈ పత్రాలను నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లి ఇవ్వొచ్చు. సంబంధిత బ్యాంకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారానూ సమర్పించవచ్చు. ఈ పత్రాలు ఒక ఆర్థిక సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కాబట్టి, ప్రతి ఆర్థిక సంవత్సరమూ వీటిని అందించాల్సిందే.

ఎవరు ఇవ్వాలంటే..

  •  60 ఏళ్ల లోపు భారతీయులు, హెచ్‌యూఎఫ్‌లు, ట్రస్టులు ఫారం 15జీ ఇవ్వడానికి అర్హులు. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పన్ను బాధ్యత లేనప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. కంపెనీలు, ప్రవాసులు ఈ పత్రాన్ని సమర్పించడం కుదరదు.
  •  60 ఏళ్లకు మించిన సీనియర్‌ సిటిజన్లు ఫారం 15 హెచ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా సరే ఈ పత్రాలను అందించేందుకు వీలుంది. కానీ,  ప్రారంభంలోనే ఈ పత్రాలను అందించడం వల్ల మూలం వద్ద పన్ను కోత పడకుండా చూసుకోవచ్చు. సమర్పించిన తేదీ నుంచే టీడీఎస్‌ను మినహాయించరు. ఉదాహరణకు అక్టోబరులో మీరు ఈ పత్రాన్ని ఇచ్చారనుకుందాం. అప్పటి నుంచి టీడీఎస్‌ ఉండదు. కానీ, ఏప్రిల్‌-సెప్టెంబరు వరకూ విధించిన టీడీఎస్‌ మొత్తాన్ని వెనక్కి ఇవ్వరు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, రిఫండుగా పొందాల్సి ఉంటుంది. కాబట్టి, వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ విధించకముందే ఈ పత్రాలను ఇవ్వడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని