వేతనంలోఎంత పొదుపు చేయాలంటే

వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్‌ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Published : 03 May 2024 00:42 IST

వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్‌ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేతనం రాగానే ఖర్చుల కోసం కేటాయించకుండా, కొంత పొదుపు చేయడం ఒక అలవాటుగా మారాలి.

ర్థిక ప్రణాళిక ఒక్క రోజుతో సాధ్యం కాదు. లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగాలి. వేతనంలో ఎంత శాతం పొదుపు చేయాలనే విషయంలో ఒక కచ్చితమైన అభిప్రాయానికి రాలేం. బాధ్యతలు, ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యం ఇలా అనేక అంశాలు పొదుపును నిర్ణయిస్తాయి.

ఆర్థిక లక్ష్యాలేమిటి?

వేతనంలో ఎంత శాతాన్ని పెట్టుబడులకు కేటాయించాలని నిర్ణయించుకునే ముందు.. మీ ఆర్థిక లక్ష్యాలను విశ్లేషించడం చాలా కీలకం. పదవీ విరమణ ప్రణాళికలు, సొంత ఇల్లు, పిల్లల చదువులు ఇలా కొన్ని స్వల్పకాలిక, మరికొన్ని దీర్ఘకాలిక అవసరాలు ఉంటాయి. వీటికి అనుగుణంగా పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. ఏ అవసరానికి ఎంత పెట్టుబడి అవసరం, వేటిని వాయిదా వేయొచ్చు.. ఇలా ఒక కచ్చితమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. అప్పుడే ఎంత మేరకు పొదుపు చేయాలన్నది స్పష్టత వస్తుంది.

50:30:20 సూత్రంతో..

పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రామాణిక సూత్రాన్ని పాటించవచ్చు. అదే 50:30:20 నియమం. మీకు వచ్చిన ఆదాయంలో 50 శాతం వరకూ అవసరాల కోసం కేటాయించాలి. 30 శాతం విచక్షణా ఖర్చులకు వినియోగించాలి. మిగతా 20 శాతాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లించాలి. కొంతమందికి 15 శాతం వరకే అనుకూలంగా ఉండొచ్చు.  నిత్యావసరాలు, బిల్లులు, పిల్లల ఫీజులు, రుణ వాయిదాల చెల్లింపుల్లాంటివన్నీ అవసరాలు. విచక్షణ ఖర్చుల్లో విందులు, వినోదాలు, విహార యాత్రల్లాంటివి ఉంటాయి. పెట్టుబడులకు తగిన మొత్తం అందుబాటులో లేదు అనుకున్నప్పుడు విచక్షణ ఖర్చులను నియంత్రించడం అలవాటు చేసుకోవాలి. ఆదాయంలో ఎంత మేరకు మదుపు చేయాలనేది నిర్ణయించుకునే ముందు.. మీ నష్టభయ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. పెట్టుబడుల్లో నష్టభయం దాగి ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. అధిక నష్టభయం ఉన్న పథకాల్లో మంచి రాబడి వస్తుంది. సురక్షితమైన పథకాల్లో పొదుపు చేస్తే, ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని అందుకోలేం.

వైవిధ్యంగా ఉండేలా..

పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదో ఒక పథకంలోనే మదుపు చేయడం మంచిది కాదు. వీలైనంత వరకూ వైవిద్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలు, బాండ్లు, స్థిరాస్తులు, మ్యూచువల్‌ ఫండ్లు, బంగారం ఇలా అన్ని రకాల పథకాలనూ ఎంచుకోవాలి. దీనివల్ల పోర్ట్‌ఫోలియోలో నష్టభయం పరిమితం అవుతుంది.

సమీక్షిస్తూ ఉండాలి..

ఎంచుకున్న పథకం పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షంచుకోవడం మర్చిపోవద్దు. వేతనం పెరిగినప్పుడు దీంతోపాటు పెట్టుబడులనూ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. బాధ్యతలు, లక్ష్యాల్లో మార్పులు రావచ్చు. వాటికి అనువైన పథకాలను ఎంచుకోవాలి. మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మీ ఆర్థిక ప్రణాళికనూ సమీక్షించుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని