స్టాక్‌ మార్కెట్‌... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా

ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు..

Published : 17 May 2024 00:59 IST

ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా అనే సందేహం చాలామందికి వస్తోంది. సూచీలకు వస్తున్న నష్టాలు వారిని ఆందోళనలోనూ పడేస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మదుపరులు పాటించాల్సిన సూత్రాలేమిటో చూద్దాం..

కొంత కాలంగా స్టాక్‌ మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. జీవన కాల గరిష్ఠాలను తాకి వెనక్కి వచ్చాయి. రెండు మూడేళ్ల క్రితం నుంచి మదుపు చేస్తున్న వారి ఈక్విటీ పోర్ట్‌ఫోలియోల విలువ దాదాపు 25-30 శాతం వరకూ పెరిగిన సందర్భాలూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లలో కొంత అనిశ్చితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడులను సర్దుబాటు చేసుకునేందుకు ఇది సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. మంచి పనితీరున్న కంపెనీలు, ఫండ్లను ఎంచుకునేందుకు ఇప్పుడు మంచి అవకాశంగా పేర్కొంటున్నారు.


అనిశ్చితి ఉన్నా..

మార్కెట్‌ కొంత గందరగోళంగా ఉందన్న మాట వాస్తవం. కానీ, పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇదొక్కటే కారణం కాకూడదు. పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడే 10-20 శాతం దిద్దుబాటు కచ్చితంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. బలమైన కారణం ఉంటేనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి.


ఎంపికలో జాగ్రత్త..

కరోనా తర్వాత మార్కెట్‌ ఇస్తున్న లాభాలను చూసిన చాలామంది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లతోపాటు, నేరుగా షేర్లలోనూ మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడులను ఎంచుకునేటప్పుడు కాస్త వైవిధ్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఒకే పథకంలో మొత్తం మదుపు చేయడం మంచిది కాదు. మీ పెట్టుబడుల్లో కొంత నష్టభయం ఉన్న వాటికీ, మిగిలిన మొత్తం సురక్షిత పథకాలకూ కేటాయించండి. అప్పుడే అనిశ్చితిలోనూ మీ డబ్బుకు ఇబ్బంది ఉండదు. పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకునేటప్పుడు లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు, ఫండ్లు ఉండేలా చూసుకోవడం మంచిది.


మార్పులకు సరైన సమయం..

మీ ప్రస్తుత పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోండి. సూచీల్లో వృద్ధి కారణంగా మీ ఈక్విటీ పెట్టుబడుల మొత్తం పెరిగిపోవచ్చు. ఇందులో కొంత భాగాన్ని వెనక్కి తీసుకొని, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో ఉన్న పెట్టుబడులనూ ఒకసారి పరిశీలించండి. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌లలో అధికంగా ఉంటే.. వాటిని కొంత మేరకు విక్రయించి, లార్జ్‌ క్యాప్‌లోకి మార్చండి. మార్కెట్లో అన్ని కంపెనీల షేర్లూ ఒకే విధంగా పడిపోవు. మార్కెట్‌ పతనం అవుతున్నప్పుడూ కొన్ని రంగాలు, సంస్థల షేర్లు లాభాలు ఇస్తుంటాయి.  ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని మంచి కంపెనీల షేర్లూ తగ్గుతుంటాయి. వీటిలో దశల వారీగా మదుపు చేసేందుకు ప్రయత్నించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం.. మార్కెట్లో ఎప్పుడూ దీన్ని మర్చిపోవద్దు.


దీర్ఘకాలం కోసమే..

దీర్ఘకాలిక లక్ష్యం కోసం మదుపు చేస్తున్నప్పుడు  స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టకూడదు. కొంతమంది లాభాలు ఇస్తున్న షేర్లను విక్రయించి, నష్టాలు వచ్చిన వాటిని కొనసాగిస్తుంటారు. ఇది సరైన వ్యూహం కాదు. మార్కెట్లో దిద్దుబాటు అంటే దీర్ఘకాలిక మదుపరులకు ఒక అవకాశం. ఇప్పుడు మొత్తం పెట్టుబడి, లాభాలను వెనక్కి తీసుకొని, మార్కెట్‌ తగ్గినప్పుడు మదుపు చేయాలనేదీ సరైన వ్యూహం కాదు. మార్కెట్‌ నుంచి ఒకసారి బయటకు వస్తే.. తిరిగి ప్రవేశించడం అంత తేలిక కాదు. విలువలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు మళ్లీ పోర్ట్‌ఫోలియోను నిర్మించడం కష్టం అవుతుంది. కాబట్టి, క్రమానుగత పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. మీకు సంతృప్తి అనిపించినప్పుడు ఆ మేరకు లాభాలను స్వీకరించే ప్రయత్నం చేయొచ్చు.


వైవిధ్యంగా..

లక్ష్యం, పెట్టుబడి వ్యవధి ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. అప్పుడే నష్టభయమూ పరిమితంగా ఉంటుంది.   పెట్టుబడి పథకాలను వృద్ధి, నాణ్యత, విలువ ఆధారంగా చూడాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న పథకాల్లో మనకు ఏది సరిపోతుంది అనేది తెలుసుకుంటే చాలు. పెట్టుబడుల్లో 15-20 శాతం వరకూ అంతర్జాతీయ ఫండ్లకూ కేటాయించాలి. కనీసం 10-15 శాతం వరకూ డెట్‌ పథకాలకూ మళ్లించాలి. 10 శాతం వరకూ బంగారంలోనూ మదుపు చేయాలి. ఈక్విటీ మార్కెట్‌లో దిద్దుబాటు వచ్చినప్పుడు ఈ పెట్టుబడులు కొంత ఊరటనిస్తాయి. ఈటీఎఫ్‌లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌, ఇండెక్స్‌ ఫండ్ల ద్వారా పాసివ్‌ పెట్టుబడులు పెట్టేందుకూ ప్రయత్నించాలి.


మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి సానుకూలంగానూ, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్‌ స్పందిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అడుగులు వేయాలి. పెట్టుబడి మార్గాలను అర్థం చేసుకోవడం, వాటిని ఎంపిక చేసుకోవడంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు