ఇంటి రుణం తొందరగా తీర్చేద్దాం

సొంతిల్లు.. ఎంతో మంది కల. అత్యంత ఖరీదైన పెట్టుబడుల్లో ఒకటి. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం చాలామందికి తప్పనిసరి. కొంత కాలంగా రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు గృహరుణ వడ్డీ రేటును సవరిస్తూ ఉన్నాయి.

Published : 07 Jun 2024 00:33 IST

సొంతిల్లు.. ఎంతో మంది కల. అత్యంత ఖరీదైన పెట్టుబడుల్లో ఒకటి. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం చాలామందికి తప్పనిసరి. కొంత కాలంగా రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు గృహరుణ వడ్డీ రేటును సవరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వడ్డీ రేటు పెంచేందుకు సిద్ధం అవుతున్నాయి. నేడు ఆర్‌బీఐ విధాన పరపతి సమీక్ష వివరాల ప్రకటన సందర్భంగా వడ్డీ రేట్ల గమనంపైనే అందరి దృష్టీ ఉంది. ఈ నేపథ్యంలో గృహరుణ భారాన్ని తొందరగా దించుకునేందుకు ఉన్న మార్గాలేమిటి? తెలుసుకుందాం.

దాదాపు 15-20 ఏళ్ల వ్యవధికి తీసుకున్న గృహరుణాన్ని వీలైనంత వేగంగా తీర్చేయడానికి ప్రయత్నించినప్పుడే, ఆర్థికంగా మిగతా విషయాలపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. కొంతమంది నెలవారీ వాయిదాల మొత్తం తక్కువగా ఉండేలా చూసుకొని, వ్యవధిని పెంచుకుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ భారం అధికంగా ఉంటుంది. 
ఇంటి రుణం తీసుకునేటప్పుడే మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు.. ఎంత మేరకు ఈఎంఐ చెల్లించగలను? దీని ప్రభావం నా ఆర్థిక పరిస్థితిపై ఎలా ఉంటుంది? అని. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల వ్యవధికి 8.5 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహరుణాన్ని తీసుకున్నారనుకుందాం. మీ నెలవారీ ఈఎంఐ దాదాపు రూ.43,237 వరకూ ఉంటుంది. దీనికి మీరు చెల్లించే మొత్తం వడ్డీ దాదాపు రూ.54.13 లక్షల మేరకు ఉంటుంది. అంటే.. 20 ఏళ్లలో అసలు, వడ్డీ కలిపి రూ.1.04 కోట్ల వరకూ చెల్లిస్తారన్నమాట. 

ఒకవేళ ఈ రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయాలనుకున్నారనుకోండి.. ఏం చేయాలి? వాయిదా మొత్తాన్ని కాస్త పెంచుకోవాలి. అంటే.. రూ.43,237 బదులు రూ.49,237 చేశారనుకుందాం. అప్పుడు వడ్డీ మొత్తం రూ.36.62 లక్షలే అవుతుంది. మొత్తం మీరు చెల్లించేది రూ.86.62 లక్షలుగా మారుతుంది.
సుమారు రూ.6,000 అధికంగా చెల్లించడం వల్ల గృహరుణం వేగంగా తీరడమే కాకుండా, రూ.15.38 లక్షల వరకూ మిగులూ కనిపిస్తుంది. మీరు అధికంగా చెల్లించే ప్రతి రూపాయీ గృహరుణం అసలుకు జమ అవుతుంది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుందన్నమాట. ఇదంతా లెక్కల్లో చూడటానికి బాగానే ఉంటుంది. కానీ, ఆచరణలో ఇది ఎంత వరకూ సాధ్యం అనే ప్రశ్న వస్తుంది. ఇప్పటికే ఉన్న ఆర్థిక బాధ్యతలు అధిక ఈఎంఐ చెల్లించేందుకు సహకరించకపోవచ్చు. కాకపోతే, కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా దీన్ని సాధ్యం చేసుకోవచ్చు.

అధికంగా చెల్లిస్తే..

ఇల్లు కొనాలనుకున్నప్పుడు వీలైనంత మొత్తాన్ని మీ చేతి నుంచే చెల్లించేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల రుణం అధికంగా తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. మీకు అవసరమైన మేరకే రుణాన్ని తీసుకోండి. ఒకవైపు 8.5-9 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తూ.. మీ దగ్గరున్న మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులు పెట్టడం వల్ల కలిసొచ్చేదేమీ ఉండదు. రుణం తక్కువగా తీసుకున్నప్పుడు ఈఎంఐలూ అందుబాటులో ఉంటాయి. వడ్డీ మొత్తం ఆదా అవుతుంది. ఇలా మిగిలిన డబ్బును పెట్టుబడులకు మళ్లించే ప్రయత్నం చేయొచ్చు. లేదా ఈఎంఐ అధికంగా చెల్లిస్తూ తొందరగా రుణాన్ని వదిలించుకోవచ్చు. 

వాయిదా మొత్తాన్ని పెంచుకుంటూ..

ఏటా వేతనంలో ఎంతో కొంత పెంపు ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందిన ప్రతిసారీ వాయిదా మొత్తాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏటా కనీసం 5 శాతం చొప్పున అధికంగా ఈఎంఐ చెల్లించే దిశగా ప్రణాళిక వేసుకోవాలి. దీనివల్ల 3-4 ఏళ్ల ముందుగానే రుణం తీరిపోతుంది. వడ్డీ రేట్లు పెరిగినా పెద్దగా ఇబ్బంది అనిపించదు.

అసలులో కొంత..

రుణం తీసుకున్న తర్వాత ఏటా రుణ అసలులో 5-10 శాతం మేరకు చెల్లించండి. చాలా బ్యాంకులు కనీసం రూ.25వేల నుంచి చెల్లించేందుకూ అనుమతిస్తున్నాయి. వీలైనప్పుడల్లా అసలు మొత్తంలో కొంత తీర్చాలని నిర్ణయించుకోండి. ఒకవేళ ఇతర బ్యాంకులేమైనా తక్కువ వడ్డీకి రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తే.. దానికి మారిపోవడమూ మంచిదే. కనీసం 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకూ తగ్గితేనే వేరే బ్యాంకుకు మారాలి.

అదనంగా వచ్చిన డబ్బుతో..

పెట్టుబడులపై రాబడి, బోనస్‌లు, పాలసీల నుంచి వచ్చిన డబ్బు.. ఇలా అనుకోకుండా వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు ఉపయోగించకుండా, ఇంటి రుణం తీర్చేందుకే వినియోగించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు