Nano Banana AI saree trend: శారీ ట్రెండ్‌ ట్రైచేస్తే పుట్టుమచ్చలూ పట్టేసింది.. యువతికి చేదు అనుభవం!

Eenadu icon
By Business News Team Published : 16 Sep 2025 13:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Nano Banana AI saree trend | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు ఎక్కడ చూసినా గూగుల్‌కు చెందిన ‘నానో బనానా’ ఏఐ టూల్‌ గురించే చర్చ. క్షణాల వ్యవధిలో తమ ఫొటోను అందమైన 3డీ ఇమేజ్‌లా మార్చుకొనే వీలుండడంతో అందరూ ఈ కొత్త ఫీచర్‌ను ట్రై చేస్తున్నారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి వేదికలుగా వాటిని షేర్‌ చేస్తున్నారు. అందులోనూ మహిళలైతే ‘శారీ ట్రెండ్‌’ను అందిపుచ్చుకుంటూ వాటిని ఇన్‌స్టా వంటి వేదికలపై పంచుకుంటున్నారు. అయితే, ఈ ఫీచర్‌ ప్రయత్నించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది.

గూగుల్‌ జెమినీలోని ఫ్లాష్‌ 2.0 ఇమేజ్‌ మోడల్‌ సాయంతో శారీ ఇమేజ్‌ను ప్రయత్నించారు ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌. తన ఫొటోను అప్‌లోడ్‌ చేసి శారీలో తాను ఎలా ఉంటానో చూసుకుందామని ఆసక్తిగా ఎదురుచూసింది. తీరా ఫలితం చూశాక కంగుతింది. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ట్రెండ్‌ చూసి నేనూ శారీ ఇమేజ్‌ జనరేటర్‌ను ప్రయత్నించా. కానీ ఆ ఫొటోను కాస్త నిశితంగా పరిశీలించి చూశాక నాకు భయమేసింది. నా ఒంటిపై పుట్టుమచ్చ ఉన్న విషయం జెమినీకి ఎలా తెలుసు? నేను అప్‌లోడ్‌ చేసిన ఇమేజ్‌లో అది లేదు కదా. ఇదెలా జరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. కాబట్టి సోషల్‌మీడియా లేదా ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో ఫొటోలను అప్‌లోడ్‌ చేసేటేప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించండి’’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

సదరు యూజర్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘జెమినీ గూగుల్‌కు చెందిందన్న విషయం మరిచిపోవద్దు. మీ ఏఐ పిక్‌ను రూపొందించడానికి మీ ఫొటోలు, వీడియోలను అది వినియోగించుకుంటుంది’’ అంటూ ఓ యూజర్‌ రాసుకొచ్చారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ మరో యూజర్‌ చెప్పుకొచ్చారు. తన ఫొటోలో ఎక్కడా టాటూ లేకపోయినప్పటికీ.. ఏఐ పిక్‌లో టాటూ ఉండేలా జెమినీ రూపొందించిందని కామెంట్‌ చేశాడు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన అన్ని ఇమేజులను ఉపయోగించుకొని మీ డిజిటల్‌ ఫుట్‌ ప్రింట్‌ ఆధారం చేసుకొని ఏఐ త్రీడీ చిత్రాన్ని రూపొందిస్తుందని, ఏఐ చిత్రాన్ని రూపొందించడానికి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏఐ వాడుకుంటుందని మరికొందరు యూజర్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి నానో బనానా ట్రెండ్‌ ఓవైపు వినోదం పంచుతూనే, మరోవైపు వివాదాలకూ వేదికగా నిలుస్తోంది. మరి భద్రత గురించి గూగుల్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు