ITR: ఏఐఎస్‌ సరి చూసుకున్నారా?

పన్ను రిటర్నులను మరింత సులభతరం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు కొత్త వెసులుబాట్లను తీసుకొస్తూనే ఉంది. ఇందులో కీలకమైనది వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌).

Updated : 24 May 2024 11:35 IST

పన్ను రిటర్నులను మరింత సులభతరం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు కొత్త వెసులుబాట్లను తీసుకొస్తూనే ఉంది. ఇందులో కీలకమైనది వార్షిక సమాచార నివేదిక (AIS). పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలూ ఇందులో ఉంటాయి. రిటర్నుల (ITR) దాఖలులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయాలనే లక్ష్యంతో ఆదాయపు పన్ను శాఖ దీన్ని తీసుకొచ్చింది.

తంలో రిటర్నులు (Income Tax Returns) దాఖలు చేసేందుకు ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను పరిశీలించాల్సి ఉండేది. దీంతోపాటు ఇప్పుడు పరిశీలించాల్సిన మరో నివేదిక ఏఐఎస్‌. ఇందులో వేతనం ద్వారా వచ్చిన ఆదాయం, ఇతర ప్రయోజనాలతోపాటు, టీడీఎస్, ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయ వివరాలన్నీ సులభంగా తెలుసుకోవచ్చు..

ప్రధానంగా ఏఐఎస్‌లో ఉండే వివరాలను పరిశీలిస్తే..

 • మీకు లభించిన డివిడెండ్లు
 • పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, ఇతర పథకాలపై వచ్చిన వడ్డీ ఆదాయం
 • ఆదాయపు పన్ను రిఫండు పొందినప్పుడు, దానిపై అందిన వడ్డీ
 • లాటరీల్లో గెలుచుకున్న మొత్తం వివరాలు
 • ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లపై వచ్చిన వడ్డీ, దీర్ఘకాలిక మూలధన లాభాలు, బీమా కమీషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెట్‌ ఫండ్ల నుంచి వచ్చిన రాబడి
 • జాతీయ పొదుపు పథకాల్లో జమ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు
 • వాహనాలను విక్రయించినప్పుడు వచ్చిన ఆదాయం
 • మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వచ్చిన ఆదాయం
 • షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను విక్రయించిన వివరాలు
 • కరెంట్‌ ఖాతా మినహా ఇతర ఖాతాల్లో చేసిన నగదు జమలు
 • విదేశాల నుంచి వచ్చిన మొత్తం, లేదా విదేశాలకు పంపిన డబ్బు వివరాలు
 • స్థిరాస్తి విక్రయాలపై వచ్చిన ఆదాయం లాంటివన్నీ ఏఐఎస్‌లో కనిపిస్తాయి.

ఎక్కడ ఉంటుందంటే..

ఏఐఎస్‌ను పన్ను చెల్లింపుదారులు చాలా సులభంగా చూడొచ్చు. ముందుగా ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌కి లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత ‘సర్వీసెస్‌’ ట్యాబ్‌లో ‘యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ (ఏఐఎస్‌)’ లింక్‌ను క్లిక్‌ చేసి, దీన్ని పొందవచ్చు.

 ఏఐఎస్‌ కోసం ఆదాయపు పన్ను విభాగం ప్రత్యేక మొబైల్‌ యాప్‌నూ తీసుకొచ్చింది.

సందేహాలుంటే..

ఏఐఎస్‌లో పేర్కొన్న ఆదాయం లేదా టీడీఎస్‌పై అనుమానాలుంటే అక్కడే దానికి సంబంధించిన అభిప్రాయాలను సమర్పించేందుకు వీలుగా కొత్త సౌలభ్యాన్ని ఆదాయపు పన్ను శాఖ తీసుకొచ్చింది.

లావాదేవీలను ఒకసారి పరిశీలించి, అందులో అనుమానాలుంటే అక్కడే తెలియజేయాలి. అప్పుడు దాన్ని సంబంధిత వర్గాలకు వివరణ కోరుతూ ఆ సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి దాన్ని సరిచేయడం లేదా ధ్రువీకరించిన తర్వాత మళ్లీ పన్ను చెల్లింపుదారుల దగ్గరకు వస్తుంది. అందులో మీ సందేహానికి జవాబు ఉంటుంది. ఒకవేళ సరిదిద్దితే ఆ వివరాలూ తెలియజేస్తుంది.

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఇంకా గడువు ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఏఐఎస్‌ను ఒకసారి సమీక్షించుకొని, సరి చూసుకోవడం మంచిది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని