Health Insurance: ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?

ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి..

Updated : 26 Apr 2024 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. భారత్‌లో సగటు ఆయుర్ధాయం పెరిగినప్పటికీ.. జీవనశైలిలో మార్పులు, పెరుగుతున్న వాయు, ఆహార కాలుష్యం కారణంగా దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. వృద్ధులనే కాకుండా మధ్యస్థ/యుక్త వయసువారిని కూడా ప్రభావితం చేసే వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వివిధ వయసుల వారు అత్యవసర పరిస్థితుల్లో భారీ వైద్య బిల్లులను నివారించడానికి ఆరోగ్య బీమా పాలసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ బీమా పాలసీని కొనుగోలు చేయడానికి సరైన వయసు ఏది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

వెయిటింగ్‌ పీరియడ్‌

ఆరోగ్య బీమా పాలసీలో కొన్ని వ్యాధులకు 30-90 రోజుల వరకు వేచి ఉండే వ్యవధి ఉంటుంది. దీన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో ఎలాంటి క్లెయిమ్స్‌ చేయలేరు. ఉదాహరణకు.. కంటి శుక్లం, మూత్రనాళంలో రాళ్లు, మోకాళ్ల మార్పిడి, కీళ్లనొప్పులు మొదలైన అనేక రుగ్మతలకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. చాలా బీమా ప్రొవైడర్లు కనీసం 10-15 జబ్బులకు వెయిటింగ్‌ పీరియడ్‌ను వర్తింపజేస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ అధికంగా ఉంటుంది. యవ్వనంలోనే ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు నిర్ణయం తీసుకుంటే.. మెడికల్‌ ఎమర్జెన్సీ గురించి చింతించకుండా వెయిటింగ్‌ పీరియడ్‌ను సులభంగా దాటేయొచ్చు.

తక్కువ ప్రీమియం

సాధారణంగా బీమా ప్రొవైడర్‌ వసూలు చేసే ప్రీమియం మొత్తం, పాలసీదారుడి ప్రస్తుత వయసుపై ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకునేవారు యుక్త వయసులోనే పాలసీని ఎంచుకుంటే, తక్కువ ప్రీమియంతోనే పొందొచ్చు. ఉదాహరణకు 25 ఏళ్ల యుక్త వయసుగల వ్యక్తి రూ.5 లక్షల విలువ గల ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే.. ప్రీమియం సుమారుగా రూ.5,500-6,000 వరకు ఉంటుంది. అదే 35 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకున్నప్పుడు బీమా ప్రీమియం సుమారుగా రూ.7,000-7,500 వరకు ఉంటుంది. 45 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారుగా రూ.8,500-9,000 వరకు ఉంటుంది. అదే 60 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ పాలసీ తీసుకుంటే రూ.15,000-21,000 వరకు అవుతుంది. అందుచేత ఒక యువకుడు యుక్త వయసులోనే ఆరోగ్య బీమాను తీసుకోవడం ఎంతో మేలు.

కాలవ్యవధి

చాలా ఆరోగ్య బీమా పాలసీలు గరిష్ఠ వయసుపై పరిమితితో వస్తాయని గమనించడం ముఖ్యం. వినియోగదారుడు యుక్తవయసులోనే ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తే, పాలసీదారుడు వయో పరిమితుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తద్వారా ఎక్కువ కాలం పాటు ఆరోగ్య బీమా ప్రయోజనాలను పొందొచ్చు. ఆరోగ్య బీమా పాలసీని పునరుద్ధరించడానికి గరిష్ఠ వయసు సాధారణంగా 65-70 సంవత్సరాలు. కానీ, మీరు యుక్త వయసులో పాలసీని కొనుగోలు చేస్తే జీవితకాల పునరుద్ధరణ ఎంపికను పొందొచ్చు.

మెడికల్‌ చెకప్‌లు, పాలసీ తిరస్కరణ

యుక్త వయసులో ఆరోగ్య బీమా పాలసీ దరఖాస్తు చేసుకున్నప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా వారి ప్రీమియాన్ని నిర్ణయిస్తారు. అంతేకాకుండా రిస్క్ పరిమితిని బట్టి బీమా సంస్థలు పాలసీని తిరస్కరించే అవకాశముంది. యుక్త వయసులో బీమా తీసుకునే వారికి ఈ పరిస్థితి ఉండదు. యవ్వనంలో ఆరోగ్య సమస్యలు తక్కువ కాబట్టి.. మీ బీమా పాలసీ తిరస్కరించే అవకాశం సాధారణంగా ఉండదు.

కవరేజ్‌

యుక్త వయసులో ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీని పొందొచ్చు. అవసరం ఏర్పడినప్పుడు ఆసుపత్రిలో చేరడమే కాకుండా డే-కేర్‌ విధానాలు, ప్రీ/పోస్ట్‌-హాస్పిటలైజేషన్‌, ఓపీడీ ఖర్చులు మొదలైనవి కూడా బీమా సంస్థ కవర్‌ చేస్తుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు సాధారణంగా బాధ్యతలు పరిమితంగా ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగత ఆరోగ్య బీమాను ఎంచుకుని ఆపై అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. రైడర్స్‌ను కూడా కొనుగోలు చేయొచ్చు. దీంతో మీ పాలసీ పరిధిని మరింత మెరుగుపర్చుకోవచ్చు. అంతేకాకుండా యుక్త వయసులో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం వల్ల తక్కువ ప్రీమియం నుంచి ప్రయోజనం పొందడమే కాకుండా సహ చెల్లింపు, క్యాపింగ్‌ మొదలైన పరిమితులు లేకుండా ఆరోగ్య రక్షణను పొందొచ్చు.

పన్ను ప్రయోజనం

యుక్త వయసులో ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం వల్ల పాలసీదారుడు ఎక్కువ కాలం పాటు పన్ను ప్రయోజనాలను పొందగలుగుతారు. తద్వారా చెల్లించే ప్రీమియంను ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 80D కింద పాలసీదారుడు మినహాయింపు పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల వరకు పన్ను మినహాయింపులను క్లెయిం చేయొచ్చు. దీర్ఘకాలం పాటు పన్నులను ఆదా చేసుకోవడానికి అవకాశముంటుంది.

నో క్లెయిం బోనస్‌

పాలసీ రెన్యువల్‌ చేసుకునేటప్పుడు.. గత సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్స్‌ లేనప్పుడు బీమా సంస్థలు ‘నో క్లెయిం బోనస్‌’ను అందిస్తుంటాయి. అంటే, క్లెయిమ్ లేని ప్రతి ఏడాదీ మీ బీమా హామీ మొత్తం పెరుగుతూ ఉంటుంది. యుక్తవయసులో పాలసీ తీసుకున్నవారికి క్లెయిమ్స్‌ ఉండే అవకాశం తక్కువ కాబట్టి, ఈ బోనస్‌ను వినియోగించుకోవచ్చు. ఈ బోనస్‌ వల్ల మీ కవరేజ్‌ మొత్తం పెరుగుతుంది. ఇది క్లెయిం చేసే సందర్భంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నో క్లెయిమ్‌ బోనస్‌ బీమా మొత్తంలో 5 నుంచి 100% వరకు కూడా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని