Home Loan: గృహ రుణ దరఖాస్తుదారులూ... ఈ విషయాలు తెలుసుకోండి..

చాలా మంది వ్యక్తులు హోమ్‌ లోన్‌ ద్వారా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రుణాన్ని తీసుకునే వారు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Published : 11 Jun 2024 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో తీసుకునే అతిపెద్ద ఆర్థిక నిర్ణయాలలో ఇల్లు కొనడం ఒకటి. సొంత ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారు ఇంటిపై రుణాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇంటిపై రుణం పొందడం చెప్పినంత సులువు కాదు. రుణ ఆమోదం పొందడానికి పూర్తి చేయాల్సిన అన్ని ఫార్మాలిటీల గురించి చాలామందికి తెలియదు. మొదటిసారి ఇంటి రుణం పొందాలనుకునేవారు.. రుణ వడ్డీ రేటు, క్రెడిట్‌ స్కోరు, రుణానికి సంబంధించిన రుసుములు, డాక్యుమెంటేషన్స్‌ మరెన్నో విషయాల గురించి తెలుసుకోవాలి. ఇల్లు తీసుకోవడం అనేది జీవితకాలంలో ఒకసారి తీసుకునే నిర్ణయం. దీనికి సరైన ఆఫర్లు ఇచ్చే బ్యాంకును ఎంచుకోవడం చాలా ముఖ్యం. రుణ ఆఫర్‌ను ఎంచుకునే ముందు మీరు రుణానికి సంబంధించిన ప్రాథమిక విషయాల గురించి తెలుసుకోవాలి. దరఖాస్తుదారులు రుణాన్ని పొందే ముందు పరిగణించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలే కాకుండా బ్యాంకులు ఇంటి రుణం ఇచ్చే ముందు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయో కూడా ఇక్కడ ఉన్నాయి.

క్రెడిట్‌ స్కోరు

క్రెడిట్‌ స్కోరు అనేది బ్యాంకులు తమ కస్టమర్లకు ఏదైనా రుణాన్ని అందించే ముందు పరిగణించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి. క్రెడిట్‌ స్కోర్‌ అనేది మీ రుణాన్ని ఎంత బాగా తిరిగి చెల్లించగలరో నిర్ణయించే సంఖ్యాపరమైన రేటింగ్‌. ఇది మీ ఆర్థిక ఆరోగ్యాగానికి సంబంధించిన స్కోరు. సరళంగా చెప్పాలంటే, మీ మునుపటి అప్పులు, క్రెడిట్‌ కార్డు చెల్లింపుల్లో మీరు ఎంత బాగా ఉన్నారో ఇది చూపిస్తుంది. క్లీన్‌ క్రెడిట్‌ హిస్టరీ ఉన్న వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు ఇష్టపడతాయి. కాబట్టి, ఇంటిపై రుణం పొందాలనుకునే ఏ వ్యక్తి అయినా మంచి క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగ్గా నిర్వహించాలి. ఎందుకంటే బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఏ రకమైన రుణానికైనా మెరుగైన క్రెడిట్‌ స్కోరు చాలా అవసరం. అందుచేత, తక్కువ వడ్డీ రేటుతో.. అధిక ఇంటి రుణ అర్హత కోసం సిబిల్‌ స్కోరు 750 కంటే ఎక్కువ కలిగి ఉండడం ముఖ్యం.

వడ్డీ రేటు

ఇంటి రుణం తీసుకునేటప్పుడు వడ్డీ రేటు కీలకమైంది. ఈ రుణం చాలా అధిక మొత్తంతో కూడుకున్నది. పైగా దీర్ఘకాలం పాటు ఈఎంఐలు చెల్లించాల్సినది. 0.50% వడ్డీ రేటు అధికంగా ఉన్నా సరే దీర్ఘకాలంలో ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి, ప్రతి రుణ దరఖాస్తుదారుడు అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఇంటి రుణ వడ్డీ రేట్లను తనిఖీ చేసి, పరిగణించాలి. ఎవరైనా ఇంటి రుణం పొందాలనుకునేవారు అందుబాటులో ఉన్న అతి తక్కువ వడ్డీ రేట్ల కోసం వివిధ బ్యాంకుల రేట్లను సరిపోల్చాలి. రెండు రకాల వడ్డీ రేట్లు ఉన్నాయి. అవి ఫిక్స్‌డ్‌ (స్థిర), ఫ్లోటింగ్‌ రేట్లు. స్థిర వడ్డీ రేట్ల కింద రుణ కాలవ్యవధిపై ఈఎంఐలు మారవు. కానీ, ఫ్లోటింగ్‌ రేటు కింద వడ్డీ రేటు ఎంసీఎల్‌ఆర్‌ ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆకర్షణీయమైన ఆఫర్‌తో స్థిర రేటు వచ్చినప్పటికీ, ఈ వడ్డీ రేట్లను ఎంచుకుంటే మీ నెలవారీ ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, ముందస్తు చెల్లింపులకు అదనపు రుసుములను కూడా బ్యాంకులు వసూలుజేస్తాయి. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు రెపొరేటును బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా రూ.30 లక్షల వరకు, ఇంతకంటే ఎక్కువ, 75 లక్షల వరకు, ఇంతకంటే ఎక్కువ రుణ మొత్తానికి వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది.

రుణ కాలవ్యవధి

ఇంటిపై రుణం పొందాలనుకునే ప్రతి వ్యక్తి రుణ కాలపరిమితిని నిర్ణయించుకోవాలి. ఈ రుణాలు సాధారణంగా దరఖాస్తుదారుడి అర్హతను బట్టి 30 ఏళ్ల వరకు సుదీర్ఘ రుణ కాలవ్యవధితో కూడా లభిస్తాయి. బ్యాంకులు తక్కువ రీపేమెంట్‌ వ్యవధితో ఇంటి రుణ దరఖాస్తుదారులను ఇష్టపడతాయి. రుణంపై ఈఎంఐ మొత్తం పెరిగినా, వడ్డీ భారం తగ్గుతుంది కాబట్టి, తక్కువ రీపేమెంట్‌ వ్యవధి కూడా రుణగ్రహీతకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇంటి రుణం దీర్ఘకాలిక నిబద్ధత ఉన్నది కాబట్టి, మీరు చాలా కాలం పాటు సౌకర్యవంతంగా తిరిగి చెల్లించగలిగే రుణ మొత్తాన్ని ఎంచుకోవడం మంచిది.

ప్రాసెసింగ్‌ ఫీజు

ఇంటి రుణ దరఖాస్తును ఆమోదించిన తర్వాత రుణగ్రహీత.. బ్యాంకుకు చెల్లించాల్సిన ఛార్జీయే ప్రాసెసింగ్‌ రుసుం. సాధారణంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. పంపిణీ చేసే ఇంటి రుణ మొత్తంలో 0.50% నుంచి 1% వరకు లోన్‌ ప్రాసెసింగ్‌ రుసుములను వసూలుజేస్తాయి. కొన్ని బ్యాంకులు రుణ మొత్తంతో సంబంధం లేకుడా ఫ్లాట్‌ ప్రాసెసింగ్‌ రుసుమును వసూలుచేస్తాయి. ఇంటి రుణాలు పెద్ద మొత్తంలోనే ఉంటాయి కాబట్టి, ఈ రుసుములలో చిన్న వ్యత్యాసం కూడా దరఖాస్తుదారుడికి అదనపు ఖర్చుగానే భావించొచ్చు. మీరు తక్కువ ప్రాసెసింగ్‌ రుసుములను వసూలు చేసే బ్యాంకును సంప్రదించడం మంచిది. రుణాన్ని పొందేటప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్‌పై సంతకం చేసే ముందు బ్యాంకుకు సంబంధించిన నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవాలి. మీ ఇంటి రుణ డాక్యుమెంట్స్‌లో పేర్కొన్న విభిన్న ఛార్జీలు, ఫీజులు, పెనాల్టీల గురించి తప్పక తెలుసుకోవాలి.

డౌన్‌ పేమెంట్‌

సాధారణంగా మీరు ఇంటిపై రుణాన్ని పొందినప్పుడు రుణ మొత్తంలో 10% నుంచి 15% వరకు డౌన్‌ పేమెంట్‌గా చెల్లించాలి. మిగిలిన ఇంటి రుణం మొత్తం నెలనెలా చెల్లించే ఈఎంఐగా మారుతుంది. ఈఎంఐ భారం లేకుండా ఉండడానికి వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చేయాలి. ఎందుకంటే ఇది రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. రుణం మొత్తం ఎంత తక్కువ ఉంటే మీరు చెల్లించే వడ్డీ అంత తక్కువ ఉంటుంది. కొన్ని బ్యాంకులు దరఖాస్తుదారుడి అర్హత ఆధారంగా ఆస్తి విలువలో 100% రుణ మొత్తాన్ని అందించేవి ఉన్నాయి. మీకు మిగులు నగదు అందుబాటులో ఉన్నట్లయితే, డౌన్‌ పేమెంట్‌ను పెంచుకోవడమే మేలు దీనివల్ల భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీపై ఆదా చేయడానికి మీకు సహాయపడుతుంది.

ఈఎంఐ

ఈక్వేటెడ్‌ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అంటే రుణగ్రహీత ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించడానికి ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం. ఇది మీరు తీసుకున్న రుణం, ఎంచుకున్న రీపేమెంట్‌ కాలవ్యవధిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ ఇంటి ఈఎంఐ మొత్తం మీ మొత్తం ఆదాయంలో ఎల్లప్పుడూ 45% మించకుండా చూసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. హోమ్‌ లోన్‌ ఈఎంఐ కాలిక్యులేటర్‌ ద్వారా ఈఎంఐని లెక్కించవచ్చు. మీరు రుణం ద్వారా తీసుకున్న ప్రాపర్టీ నిర్మాణంలో ఉన్నట్లయితే షెడ్యూల్‌ ఆధారంగా రుణాన్ని దశలవారీగా మంజూరుచేస్తారు. ఇటువంటి సందర్భంలో, మీరు ప్రీ-ఈఎంఐ వడ్డీ అని పిలిచే వడ్డీ మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. కానీ, మీరు ప్రిన్సిపల్‌ను తిరిగి చెల్లించడం ప్రారంభించాలనుకుటే ప్రీ-ఈఎంఐలను చెల్లించడం ప్రారంభించవచ్చు.

ముందస్తు చెల్లింపు

చాలా బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు నిర్దిష్ట వ్యవధి తర్వాత లేదా కొంత శాతం రుణ బకాయి తీరిన తర్వాత ప్రీ-పేమెంట్‌, ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలను వసూలుజేయవు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థ ముందస్తు చెల్లింపు పెనాల్టీని వసూలు చేయకూడదు. రుణాన్ని పొందిన తర్వాత మీకు మిగులు నగదు ఉన్నప్పుడు ఏదైనా పాక్షిక చెల్లింపును ఉచితంగా చేయొచ్చు. రుణాన్ని ఎంత త్వరగా తిరిగి చెల్లిస్తే అంత తక్కువ వడ్డీని బ్యాంకుకు చెల్లిస్తారు. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుతో హోమ్‌ లోన్‌ను తీసుకుంటే, బ్యాంకు ఎలాంటి పెనాల్టీని వసూలు చేయదు.

డాక్యుమెంటేషన్‌

బ్యాంకులు..ప్రీ అప్రూవ్డ్‌, సాధారణ గృహ రుణాల కోసం నిర్దిష్ట డాక్యుమెంట్స్‌ అడుగుతాయి. ఈ పత్రాలను కేవైసీ పత్రాలు, ఆదాయ పత్రాలు, ఆస్తి పత్రాలుగా వర్గీకరించవచ్చు. అయితే, బ్యాంకు ముందుగా తనిఖీ చేసేది దరఖాస్తుదారుడి క్రెడిట్‌ స్కోరునే. ఇది రుణాన్ని వేగంగా ఆమోదించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కేవైసీ పత్రాలు అడుగుతుంది. మీ పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ మొదలైనవి. ఇవి మీ గుర్తింపు, చిరునామా రుజువులుగా బ్యాంకు పరిగణిస్తుంది. ఆదాయ పత్రాలు అడుగుతుంది. జీతం పొందే వ్యక్తులు, వ్యాపార వ్యక్తుల కోసం ఆదాయ పత్రాలు మారుతూ ఉంటాయి. వృత్తి ఆధారంగా దరఖాస్తుదారుడి 3 నెలల జీతం స్లిప్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, గత మూడు సంవత్సరాల ఆదాయ అసెస్‌మెంట్‌ మొదలైనవాటిని బ్యాంకులు అడగుతాయి.

గృహ బీమా

హోమ్‌ లోన్‌ ఇన్సూరెన్స్‌/లోన్‌ కవర్‌ టర్మ్‌ అస్యూరెన్స్‌ అనేది దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో పాలసీదారుడి కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించే ఒక రకమైన బీమా ప్లాన్‌. దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు బీమా కవర్‌ కొనుగోలు చేసిన వ్యక్తి బకాయి ఉన్న రుణ మొత్తాన్ని బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. దీనివల్ల బకాయి భారం లేకుండా ఇల్లు కుటుంబసభ్యులకు చెందుతుంది. అనేక బ్యాంకులు/హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు దురదృష్టకర సంఘటనల విషయంలో ఎటువంటి డిఫాల్ట్స్‌ లేకుండా ఉండడానికి లోన్‌ కవర్‌ టర్మ్‌ అస్యూరెన్స్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని రుణం తీసుకునేవారిని అడుగుతున్నాయి.

రుణ డిఫాల్ట్‌

ఇంటిపై రుణాన్ని తీసుకున్న తర్వాత ఈఎంఐలను సక్రమంగా తిరిగి చెల్లించలేకపోతే లేదా లోన్‌ డిఫాల్ట్‌ అయితే మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి, రుణంతో ఇంటిని కోనేవారు భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి. వాయిదాలను తరచూ చెల్లించలేకపోతే బ్యాంకు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. బకాయిలను రికవరీ చేయడానికి మీ ఆస్తిని విక్రయించవచ్చు. నగదు కొరతతో ఇబ్బంది పడుతుంటే బ్యాంకుతో మాట్లాడి, రుణ నిబంధనలపై చర్చలు జరపడం మంచిది. రుణగ్రహీత మంచి క్రెడిట్‌ చరిత్ర కలిగినవారైతే బ్యాంకు మీ అభ్యర్థనను పరిగణించొచ్చు.

పన్ను ప్రయోజనాలు

భారత ప్రభుత్వం..రుణగ్రహీతలు సెక్షన్‌ 24 కింద రూ.2 లక్షల వరకు పన్ను రాయితీని క్లెయిం చేయడానికి అనుమతిస్తుంది. ఈ రాయితీ లోన్‌ వడ్డీ భాగానికి వర్తిస్తుంది. పన్ను రాయితీ సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు