Health Insurance: ఆరోగ్య బీమా.. ఎంత ఉండాలి?

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు, బీమా తీసుకునే వ్యక్తి.. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని బీమా మొత్తాన్ని ఎంచుకోవడం చాలా అవసరం.

Published : 10 May 2024 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనిశ్చితమైన జీవన ప్రయాణంలో ఎవరైనా, ఎప్పుడైనా అనారోగ్యానికి గురికావొచ్చు. లేదా గాయపడొచ్చు. ఇటీవల కాలంలో ఆరోగ్య సంరక్షణ అనేది చాలా కుటుంబాలకు పెద్ద సవాలుగా మారింది. ప్రబలుతున్న వ్యాధులు, పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ప్రతి ఒక్కరూ తగిన ఆరోగ్య బీమా కవరేజీని పొందడం చాలా అవసరం. దేశంలో పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల ఆరోగ్య బీమా అనేది ఒక ఎంపికగా కాకుండా అవసరంగా మారింది. తగినంత ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం నేడు ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరం. మీ ఆరోగ్య పాలసీకి సరైన కవరేజ్‌ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు కింద పేర్కొన్న అంశాలను గుర్తుంచుకోవాలి.

బీమా కవరేజ్‌ ఎంతుండాలి?

ఆరోగ్య బీమా కవరేజీ మొత్తం వ్యక్తిగత/కుటుంబ పరిస్థితులు, అవసరాలను బట్టి మారుతుంది. 4 నుంచి 5 మంది ఉన్న కుటుంబానికి వైద్య బీమా కవరేజీ మొత్తం సంపాదించే వ్యక్తి వార్షిక ఆదాయంతో సమానంగా ఉండొచ్చు. లేదా రూ.10 లక్షల ఆరోగ్య బీమాను తీసుకుంటే మంచిది. దీనికన్నా తక్కువ బీమా కవరేజీ ఉంటే భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులుండే అవకాశం ఎక్కువ. అయితే, తక్కువ ఆదాయమున్నవారు సైతం ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ ఖర్చులను బట్టి రూ.5 లక్షల బీమా కవరేజీ గల పాలసీ తీసుకుంటే కొంతలో మేలని బీమా రంగ నిపుణులు భావిస్తున్నారు.

ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌

ఎవరైనా వారి కుటుంబానికి వైద్య బీమాను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఫ్యామిలి ఫ్లోటర్‌ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. విడిగా తీసుకునే బీమా పాలసీతో పోలిస్తే దీనిలో ప్రీమియం మొత్తం తగ్గించుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్స్‌ కింద బీమా పరిధిలో ఉండే కుటుంబ సభ్యులందరూ ఫ్లోటర్‌ ప్రాతిపదికన ఒకే బీమా మొత్తాన్ని పంచుకుంటారు. కుటుంబ సభ్యలందరికీ ఒకే సంవత్సరంలో క్లెయిమ్స్‌ వచ్చే అవసరం తక్కువ కాబట్టి కుటుంబంలో ఒకరిద్దరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు బీమా అవసరాలు పెరిగినా కూడా ఇబ్బందులు ఉండవు. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబం కోసం రూ.10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే, దాని ప్రీమియం అదే సభ్యులు విడి విడిగా తీసుకునే పాలసీల ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. 

వ్యక్తి వయసు-ప్రీమియం

బీమా కవరేజ్‌ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు బీమా కొనుగోలు చేసే వ్యక్తి వయసును పరిగణనలోకి తీసుకోవాలి. సీనియర్‌ సిటిజన్స్‌కు వారి వయసు రీత్యా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువే. నేటి వైద్య ద్రవ్యోల్బణం దృష్ట్యా, మెరుగైన ఆసుపత్రిలో బైపాస్‌ సర్జరీకి రూ.2-4 లక్షలు వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆసుపత్రులలో చిన్న స్థాయి శస్త్రచికిత్సలకు కూడా రూ.1-2 లక్షల వరకు ఖర్చవుతుంది. అందువల్ల సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నప్పుడు తగినంత బీమా హామీ గల పాలసీని తీసుకోవడం అవసరం. కానీ, బీమా మొత్తంతో పాటు ప్రీమియం కూడా పెరుగుతుంది. బీమా కంపెనీలు సాధారణంగా సీనియర్‌ సిటిజన్స్‌కు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి. రిస్క్‌ తక్కువగల 35 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియం సుమారుగా రూ.7,000-10,000 వరకు అవుతుంది. అదే 60 ఏళ్ల వయసు గల వ్యక్తి రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారుగా రూ.22,000-25,000 వరకు ఉంటుంది. 

వైద్య చరిత్ర, ఆసుపత్రి రకం

పాలసీ మొత్తాన్ని ఎంచుకునేటప్పుడు మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణించాలి. పాలసీ తీసుకునేవారు మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులతో బాధపడుతుంటే తప్పనిసరిగా అధిక బీమా మొత్తాన్ని ఎంచుకోవాలి. వీరు మిగతా వారితో పోలిస్తే తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. పాలసీ కవరేజీ మొత్తాన్ని ఎంచుకోవడానికి ముందు ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య చరిత్రను తనిఖీ చేయాలి. ఇప్పటికే ఉన్న వ్యాధులతో ఉన్న వ్యక్తి తరచూ క్లెయిమ్స్‌ చేసే అవకాశం ఎక్కువ. కాబట్టి, ఆ వ్యక్తి మెడికల్‌ హిస్టరీలో అనారోగ్యాలు ఉన్నట్లయితే సాధ్యమైనంత ఎక్కువ కవరేజీ తీసుకోవడం మంచిది. కొన్ని ముందస్తు వ్యాధుల విషయంలో మినహాయింపులు ఉంటాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాలసీ కవరేజీ మొత్తాన్ని నిర్ణయించే సమయంలో అనారోగ్యం కలిగినప్పుడు చికిత్స పొందాలనుకుంటున్న ఆసుపత్రి రకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చిన్న, మధ్యతరహా  ఆసుపత్రులలో కంటే పేరుగల పెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రులలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. కాబట్టి ప్రఖ్యాత ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులను ఇష్టపడే వ్యక్తులు ఎక్కువ బీమా మొత్తాన్ని తీసుకోవాలి.

ప్రీమియం

కవరేజ్‌ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీ ఆదాయం, ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఆదాయం పరిమితంగా ఉండి, అధిక ప్రీమియంలను చెల్లించలేకపోతే.. మీరు తక్కువ బీమా మొత్తాన్ని ఎంచుకోవడమే మేలు. ఇంకా మీరు పనిచేసే సంస్థలో గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంటే, అదనంగా కొనుగోలు చేసే బీమా పాలసీ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా టాప్ అప్ ఎంచుకోవచ్చు.

జీవనశైలి, నివసించే ప్రదేశం

బీమా మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మీరు అనుసరించే జీవనశైలిని కూడా పరిగణించాలి. మీరు వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్లయితే.. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం మొదలైన వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి సందర్భంలో అధిక బీమా మొత్తాన్ని ఎంచుకోవడమే మేలు. అంతేకాకుండా, మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి వైద్య ఖర్చులుంటాయి. ఉదాహరణకు మెట్రోపాలిటన్‌ నగరంలో నివసిస్తున్న వారికి కాలుష్యం వల్ల వ్యాధులు ఎక్కువ. దీంతో పాటు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా ఇక్కడ అధికంగా ఉంటాయి. కాబట్టి, బీమా పాలసీ మొత్తాన్ని పెంచుకోవడమే మేలు.

బీమా మొత్తం పెంపుదల

ఆరోగ్య బీమా పాలసీ పునరుద్ధరణ సమయంలో అదనపు ప్రీమియాన్ని చెల్లించి బీమా మొత్తాన్ని పెంచుకోవచ్చు. క్యుములేటివ్‌ బోనస్‌ ద్వారా కూడా మీ పాలసీకి సంబంధించిన బీమా మొత్తం పెరుగుతుంది. ఈ బోనస్‌ మీకు ప్రతి క్లెయిం రహిత సంవత్సరం తర్వాత మంజూరవుతుంది. ఇది  ప్రీమియం పెరగకుండానే బీమా మొత్తం పెంచుకునే మార్గం.

చివరిగా: ఆరోగ్య బీమా మొత్తాన్ని ఎంచుకునే ముందు మీ అవసరాలు, ఆరోగ్య చరిత్రను అంచనా వేయడం చాలా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు