International Girl Child Day: మీ చిన్నారి భ‌విత‌కు SSYతో భ‌రోసానివ్వండి!

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ పెట్టుబ‌డులతో ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఎంత మొత్తం కూడబెట్టచ్చో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Updated : 11 Oct 2022 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని 2015లో 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు తమ చిన్నారుల భవిష్యత్‌ (ఉన్నత చదువులు, వివాహం) కోసం పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో 9.20% వరకు కూడా వడ్డీ రేటును ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం వార్షికంగా 7.60% మాత్రమే వడ్డీ లభిస్తోంది. అయినప్పటికీ, రాబడి ద్రవ్యోల్బణాన్ని మించి ఉంది. అదే విధంగా పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు తమ చిన్నారుల భవితకు భరోసా కల్పించేందుకు ఈ పథకంలో మదుపు చేయవచ్చు.

పాప భవిష్యత్తు కోసం ఎంత వరకు కూడబెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం..

మీ పాప 2020లో పుట్టింది.. మీరు అదే సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఏడాదికి రూ.1 లక్ష పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. మెచ్యూరిటీ పూర్తయ్యే నాటికి మీరు పెట్టుబడి పెట్టే మొత్తం ఎంత? ఎంత రాబడి వస్తుంది? ఆ వివరాలను విపులంగా తెలుసుకుందాం.

  • మీ పాప పుట్టిన ఏడాదిలోనే పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి పాపకు 22 సంవత్సరాలు వచ్చేసరికి మెచ్యూరిటీ మొత్తం చేతికి అందుతుంది.

  • పెట్టుబడి మొత్తం.. వార్షికంగా రూ.1,00,000

  • పెట్టుబడులు పెట్టే కాలవ్యవధి..15 సంవత్సరాలు
  • 15 ఏళ్లలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం..రూ. 15,00,000 ( ఏడాదికి రూ.1 లక్ష చొప్పున)
  • ఎస్‌ఎస్‌వై ప్రస్తుత వడ్డీ రేటు..7.60% (వార్షికంగా)
  • లభించే వడ్డీ మొత్తం..రూ. 28,95,381
  • మెచ్యూరిటీ మొత్తం..రూ. 43,95,381

గమనిక: పై పట్టికలో ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60% చొప్పున మెచ్యూరిటీ మొత్తాన్ని లెక్కించాం. 

ఒక వేళ మీరు పథకంలో అందుబాటులో ఉన్న గరిష్ఠ పరిమితి వరకు పెట్టుబడి పెట్టగలిగితే ఎంత సమకూర్చుకోగలుగుతారంటే..?

  • పెట్టుబడి మొత్తం..వార్షికంగా రూ. 1,50,000
  • పెట్టుబడులు పెట్టే కాలవ్యవధి..15 సంవత్సరాలు
  • 15 ఏళ్లలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తం..రూ. 22,50,000 ( ఏడాదికి రూ.1,50,000 చొప్పున)
  • ఎస్‌ఎస్‌వై ప్రస్తుత వడ్డీ రేటు..7.60% (వార్షికంగా)
  • లభించే వడ్డీ మొత్తం..రూ. 43,43,068
  • మెచ్యూరిటీ మొత్తం..రూ. 65,93,071

చివరిగా: 10 ఏళ్ల లోపు ఆడపిల్లల తల్లిదండ్రులు తమ చిన్నారుల భవిష్యత్‌ కోసం ఇందులో పెట్టబడులు పెట్టవచ్చు. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఖాతా బ్యాలెన్సు నుంచి 50 శాతం వరకు తీసుకోవచ్చు. అలాగే, వివాహ సమయంలో (నిబంధనలకు లోబడి) గానీ, 21 ఏళ్ల మెచ్యూరిటీ పిరియడ్‌ తర్వాత గానీ పూర్తి మొత్తాన్ని ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వం అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అధిక రాబడి ఇస్తున్న పథకం ఇది. అలాగే, ఈ ఖాతాలో పెట్టుబడులపై ‘ఈఈఈ’ కేటగిరీలో పన్ను ప్రయోజనం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని