Stock Market: స్టాక్‌ మార్కెట్ పోర్ట్‌ఫోలియోను ఎలా నిర్మించాలి?

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు సరైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడం చాలా అవసరం. ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

Published : 05 Feb 2024 19:03 IST

దిల్లీ: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి. ఇందుకు గానూ సరైన పోర్ట్‌ఫోలియోను సృష్టించడం చాలా కీలకం. ఫోర్ట్‌ఫోలియోను విజయవంతంగా నిర్మించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం.

లక్ష్యాలు

స్టాక్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించడానికి మీ లక్ష్యాలను నిర్ణయించడం మొదటి దశ. మీరు పోర్ట్‌ఫోలియో సృష్టించుకోవడానికి ప్రయత్నించే ముందు మీ అంతిమ లక్ష్యం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల మీ పెట్టుబడులు లక్ష్యాలకు చేరువ చేసే దిశగా పనిచేస్తాయని నిర్ధరించుకోవచ్చు. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వ్యక్తి అనుకుందాం. రాబోయే 10-15 ఏళ్లలో ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే స్టాక్‌ పోర్ట్‌పోలియోను ఇప్పుడే సృష్టించుకోవడం సరైనదే. లక్ష్యానికి రెండు లేదా మూడేళ్ల ముందు నుంచే కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుంటూ ఉండడం మంచిది.

పెట్టుబడుల కేటాయింపు

మీ లక్ష్యాలు ఏంటో నిర్ణయించుకున్న తర్వాత తదనుగుణంగా పెట్టుబడులను విభజించడం తదుపరి దశ. ఈ దశలో మీ రిస్క్‌ ప్రొఫైల్‌ను అంచనా వేయాలి. ఇది మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల తర్వాత పదవీ విరమణ కోసం ప్లాన్‌ చేసుకున్నారనుకుందాం. అంటే మీరు మీడియం రిస్క్‌ గల షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చు. మిడ్ కాప్, స్మాల్ కాప్ షేర్లలో రిస్క్ ఎక్కువ. లార్జ్ కాప్ షేర్లలో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. పెట్టుబడులను మీ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు.

సొంత అనుభవం

ఒక వ్యక్తి స్టీల్‌, పవర్‌, నిర్మాణ రంగాల్లో పనిచేశారు. అందువల్ల అతడికి ఇతర పరిశ్రమలతో పోలిస్తే ఈ మూడు రంగాలపై పట్టు, ఆసక్తి, విశ్లేషణ శక్తి మెరుగ్గా ఉంటుంది. కాబట్టి, ఈ రంగాల్లో అతడి మార్కెట్‌ పెట్టుబడులు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే అతడు ఇతర రంగాలపై సర్కిల్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మరిన్ని మెరుగైన స్టాక్స్‌ను గుర్తించగలుగుతాడు. మెరుగైన స్టాక్స్‌ను గుర్తించడానికి ప్రతి ఇన్వెస్టరు తమ విశ్లేషణ పరిధిని పెంచుకోవాలి.

హోం వర్క్‌

ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా సరే.. ఆ రంగంపై సమగ్ర పరిశోధన అవసరం. ముఖ్యంగా వివిధ స్టాక్స్‌పై సమగ్ర పరిశోధన నిర్వహించడం అనేది విజయవంతమైన స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడికి కీలక అడుగు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏదైనా కంపెనీ షేర్ కొనుగోలు చేయడానికి ముందు ఆ కంపెనీకి సంబంధించిన ప్రాథమిక అంశాలను లోతుగా పరిశోధించడం అత్యవసరం. కంపెనీ ఆదాయం, ఖర్చులు, దాని ఆర్థిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. సంస్థ ఆర్థిక నివేదికలను పరిశీలించడం ద్వారా ఒక అంచనాకు రావచ్చు. కంపెనీ వృద్ధి సామర్థ్యంపై అంచనా వేయడానికి పరిశ్రమ పోకడలపై శ్రద్ధ వహించండి. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న సంస్థ.. అదే ఉత్పత్తులను అందించే ఇతర సంస్థలతో ఎలా పోటీ పడుతుందో అర్థం చేసుకోవడం చాలా కీలకం.

పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ

డైవర్సిఫికేషన్‌ అనేది పెట్టుబడిలో ఒక ప్రాథమిక రిస్క్‌ మేనేజ్‌మెంట్ వ్యూహాం. మీ పెట్టుబడినంతటినీ ఒకే రంగం/ స్టాక్‌లో పెట్టకుండా ఉండడం ద్వారా.. స్టాక్ అస్థిరతను, ఆ సెక్టార్‌లో ఉన్న సమస్యల ప్రభావాన్ని మీపై పడకుండా కాపాడుకోవచ్చు. మార్కెట్‌ హెచ్చుతగ్గుల సమయంలో డైవర్సిఫికేషన్‌.. ఆర్థికంగా దెబ్బతినకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎందుకంటే మీ పోర్ట్‌ఫోలియోలోని ఒక స్టాక్‌కు ఏర్పడిన నష్టాన్ని మరొకదాని లాభాలతో కవర్‌ చేసుకోవచ్చు. దీనివల్ల రిస్క్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవడానికి అవకాశముంటుంది. పోర్ట్‌ఫోలియో విభిన్నంగా ఉండకపోతే అది మంచి పెట్టుబడి పోర్ట్‌ఫోలియో కాదు.

పెట్టుబడి కాలవ్యవధి

స్టాక్‌ మార్కెట్లో స్వల్పకాల ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది మంచి ఎంపిక కాదు. దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల.. మార్కెట్లలో స్వల్పకాలంలో ఏర్పడే హెచ్చుతగ్గులకు ప్రభావం కాకుండా ఉండొచ్చు. ఎక్కువ కాలం పాటు ఓపికతో వ్యవహరించిన వారికి స్టాక్‌  మార్కెట్ మెరుగైన రాబడిని అందించిందని చరిత్ర చెబుతోంది. అందుచేత స్టాక్‌ మార్కెట్లో మెరుగైన ప్రయోజనాలను పొందేందుకు ఓపిక, సహనంతో సుదీర్ఘ కాలంపై దృష్టి కేంద్రీకరించడం కీలకం. కనీసం 5-10 ఏళ్లు వేచి ఉండే ధోరణి సరైనది. దీర్ఘకాలంలో సంపద సృష్టికి అవకాశముంటుంది.

భావోద్వేగాల నియంత్రణ

పెట్టుబడి నిర్ణయాలపై భావోద్వేగాలు అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల మీ పోర్ట్‌ఫోలియోకు హాని కలిగే అవకాశం ఎక్కువ. చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నప్పుడు ఎక్కువ కొనుగోళ్లు, మార్కెట్లు నిరాశపరిచినప్పుడు ఎక్కువ అమ్మకాలు చేసేస్తారు. ఫలితంగా నష్టాలు కూడా ఎక్కువే ఉంటాయి. దీన్ని ఎదుర్కోవడానికి.. నిర్మాణాత్మక పెట్టుబడి ప్రణాళికకు కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. మార్కెట్ల హెచ్చుతగ్గుల ప్రభావం మీపై పడినప్పుడు భావోద్వేగాల ప్రకారం కాకుండా ఆలోచించి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలి. మీ బ్రోకర్ అనుమతిస్తే కొన్ని షేర్లలో సిప్ కూడా చేయొచ్చు.

మార్పులు

స్టాక్‌ మార్కెట్‌ అస్థిరమైనది. ఒక సంవత్సరం క్రితం మంచి పనితీరు కనబరుస్తున్న కంపెనీ ఈ ఏడాది బాగా పని చేయకపోవచ్చు. స్టాక్‌ మార్కెట్‌ పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో నెలవారీ, త్రైమాసికం, సెమీ-వార్షిక, వార్షికం వంటి కాలవ్యవధిలో మీ పోర్ట్‌ఫోలియోను అంచనా వేయండి. కిందకు పడుతున్న స్టాక్‌ను.. మార్కెట్‌ ట్రెండ్‌ను, కాలవ్యవధిని బట్టి ఉంచాలా? తీసివేయాలా నిర్ణయించండి.

సలహాలు తీసుకోండి

షేర్‌ మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి అనుభవజ్ఞుల సలహాలను పొందడానికి ఎప్పడూ వెనుకాడొద్దు. మీ స్టాక్‌ ఎంపిక విషయంలో మెరుగ్గా ఉండడానికి మెంటార్‌/స్నేహితులను సంప్రదించడం మంచిదే. అనేక ఆర్థిక సంస్థలు వృత్తిపరమైన సలహాలు ఇస్తున్నాయి. వాటిని పరిశీలించొచ్చు. అనేక ఫైనాన్షియల్‌ కథనాలు అన్ని రకాల మీడియాల్లో వస్తుంటాయి. వీటిని గమనిస్తూ ఉండాలి. ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరొచ్చు. వర్క్‌షాప్‌లు/సెమినార్‌లకు హాజరు కావచ్చు. స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి అనేక పుస్తకాలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. పెట్టుబడి పెట్టడం గురించి మరింత తెలుసుకోవడానికి వీటిని చదవొచ్చు. మీ సొంత విచక్షణతో పాటు అనేక ఇతర వనరుల సహాయంతో ఆర్థిక భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి మార్కెట్లో అనేక అవకాశాలు ఇప్పుడున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని