CIBIL Score: క్రెడిట్‌ స్కోరు అంటే? ఎలా చెక్‌ చేయాలి?

క్రెడిట్‌ కార్డుల జారీకి, రుణ దరఖాస్తుల ఆమోదానికి మెరుగైన క్రెడిట్‌ స్కోరు చాలా కీలకం. క్రెడిట్‌ స్కోరును, నివేదికను పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Published : 02 Mar 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేయడానికి ముందు దాని గురించి తెలుసుకోవాలి. భారత్‌లో నాలుగు ప్రధాన క్రెడిట్‌ బ్యూరోలలో సిబిల్‌ ఒకటి. క్రెడిట్‌ స్కోరును సిబిల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. సిబిల్‌ స్కోరు అనేది మీ క్రెడిట్‌ యోగ్యతను నిర్ణయించే మూడంకెల సంఖ్య. ఈ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. CIBIL అంటే.. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఇండియా) లిమిటెడ్‌. ఇది ఆర్‌బీఐ నుంచి అధికారం పొందిన క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ. ఇది ఒక వ్యక్తి, కంపెనీ లేదా పబ్లిక్‌/ప్రైవేట్‌ సంస్థల క్రెడిట్‌ చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని నిర్వహిస్తుంది. క్రెడిట్‌ కార్డుల జారీతో పాటు రుణ దరఖాస్తు ప్రక్రియలో సిబిల్‌ స్కోర్‌ పాత్ర చాలా కీలకం. స్కోరు 750 అంతకంటే మెరుగ్గా ఉంటే వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణం, క్రెడిట్‌ కార్డుల ఆమోదానికి అర్హత ఎక్కువ ఉంటుంది. సిబిల్‌..  అనేక ప్రధాన బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో అనుబంధం కలిగి ఉంది. ఇంకా ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫాక్స్‌, సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్‌.. ప్రధాన బ్యూరోలుగా ఉన్నాయి. ఆర్‌బీఐ ఈ క్రెడిట్‌ ఏజన్సీలన్నిటికీ లైసెన్సులను మంజూరు చేసింది.

ప్రధాన బ్యూరోలు

CIBIL: భారత్‌లో అత్యంత ప్రసిద్ధ క్రెడిట్‌ ఏజెన్సీగా ‘సిబిల్‌’ పేరొందొంది. దీన్ని 2000లో స్థాపించారు. 60 కోట్లకు పైగా భారతీయులు, 3.2 కోట్ల కార్పొరేట్‌ సంస్థల క్రెడిట్‌ రిపోర్ట్‌లను నిర్వహిస్తోంది.
Experian: ఇది కూడా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) గుర్తింపు పొందింది. 2006లో దీన్ని స్థాపించారు. 2010 నుంచి భారత్‌లో పనిచేయడం ప్రారంభించింది.
CRIF High Mark: దీన్ని 2007లో స్థాపించారు. 2010లో నిర్వహణ లైసెన్స్‌ను పొందింది. ఇది అందించిన స్కోర్‌ల పరిధి 300 నుంచి 850 వరకు ఉంటుంది.
Equifax: ప్రపంచంలోని మూడు అతిపెద్ద క్రెడిట్‌ బ్యూరోలలో ఒకటైన ‘ఈక్విఫాక్స్‌’ 1899లో రిటైల్‌ క్రెడిట్‌ బిజినెస్‌గా ప్రారంభమైంది. ఇది 2010లో ఆపరేటింగ్‌ లైసెన్స్‌ను పొందింది. ఇది 1 నుంచి 999 వరకు అత్యధిక స్కోరును సూచిస్తుంది.

సిబిల్‌ నివేదిక

సిబిల్‌ స్కోరులు భారత్‌లో క్రెడిట్‌ యోగ్యతకు బెంచ్‌మార్క్‌గా మారాయి. సిబిల్‌ నివేదికను.. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (సీఐఆర్‌) అని కూడా పిలుస్తారు. ఇది మీ అన్ని రుణాలు, చెల్లింపు చరిత్రలను నిర్వహించే పత్రం. క్రెడిట్‌ రిపోర్ట్‌ అనేది మీ సిబిల్‌ స్కోరుతో పాటు క్రెడిట్‌కు సంబంధించిన మీ అన్ని ఆర్థిక లావాదేవీలపై ఇతర వివరాలను కలిగి ఉండే నివేదిక. ఈ నివేదికలో చెల్లింపు చరిత్ర, రుణాల సంఖ్య, రుణాలకు సంబంధించిన బకాయిలు, క్రెడిట్‌ పరిమితి మొత్తం, వివిధ రకాల రుణ సంస్థల నుంచి తీసుకున్న అన్ని రుణాల వివరాలు ఇక్కడ ఉంటాయి.  క్రెడిట్‌ రిపోర్ట్‌ మీ క్రెడిట్‌ కోసం రిపోర్ట్‌ కార్డ్‌ లాగా ఉంటుంది. సిబిల్‌ స్కోర్‌.. రుణ దరఖాస్తు ప్రక్రియలో అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీ క్రెడిట్‌ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అది మీకు అంత మంచిది. ఈ స్కోరును ఉచితంగా, చెల్లింపుల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

క్రెడిట్‌ స్కోరు చెక్ చేయడం..

2017 నుంచి ఆర్‌బీఐ లైసెన్స్‌ పొందిన నాలుగు క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు.. క్రెడిట్‌ స్కోరును ఆన్‌లైన్‌లో సంవత్సరానికొకసారి ఉచితంగా తనిఖీ చేసుకోవడానికి అనుమతినిస్తున్నాయి. ఉచితంగా క్రెడిట్‌ స్కోరును తెలుసుకోవడానికి దశల వారిగా ఎలాగో ఇక్కడ చూడండి.

  • స్టెప్‌ 1: సిబిల్‌ వెబ్‌సైట్‌కు వెళ్లండి
  • స్టెప్‌ 2: మీ పేరు, ఫోన్‌ నంబరు, ఇ-మెయిల్‌ చిరునామా వంటి సమాచారాన్ని అందించండి.
  • స్టెప్‌ 3: మీ పాన్‌ నంబరు సహా అక్కడ అడిగిన ఇతర వివరాలను తెలపాలి.
  • స్టెప్‌ 4: మీ రుణాలు, క్రెడిట్‌ కార్డుల గురించి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
  • స్టెప్‌ 5: ఈ దశలో స్క్రీన్‌పై వివిధ చెల్లింపు సభ్యత్వాలు ఉంటాయి. మీకు ఒకసారి ఉచిత క్రెడిట్‌ స్కోరు, రిపోర్ట్‌ మాత్రమే అవసరం కాబట్టి No Thanksపై క్లిక్‌ చేసి కిందికి వెళ్లండి.
  • ఇక్కడ మీ ఖాతా క్రియేట్‌ అయిన దశ, కింది పేజీలో ధ్రువీకరించిన మెసేజ్‌ డిస్‌ప్లే అవుతుంది.
  • స్టెప్‌ 6: మీ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, మీ ఖాతాకు లాగిన్‌ అవ్వాలి. ముందుకు కొనసాగడానికి ప్రమాణీకరించుకోవాలి (authenticate yourself). మీ నమోదిత ఇ-మెయిల్‌కు వచ్చిన వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌ను లింక్‌పై క్లిక్‌ చేసి నమోదు చేయాలి. తర్వాత మీ పాస్‌వర్డ్‌ను మార్చి మళ్లీ లాగిన్‌ చేయమని అడుగుతుంది.
  • స్టెప్‌ 7: మీరు లాగిన్‌ చేసిన తర్వాత, మీరు ఇంతకు ముందు నమోదు చేసిన వ్యక్తిగత వివరాలన్నీ డిఫాల్ట్‌గా స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయండి.
  • స్టెప్‌ 8: డ్యాష్‌బోర్డ్‌పై మీ సిబిల్‌ స్కోరు ప్రత్యక్షమవుతుంది. క్రెడిట్‌ నివేదికను కూడా డ్యాష్‌బోర్డ్‌లో పొందవచ్చు.

చెల్లింపుల ద్వారా

ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చెల్లించి కూడా క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకోవచ్చు. అధికారిక CIBIL వెబ్‌సైట్‌కు లాగిన్‌ చేసి, Know your Scoreపై క్లిక్‌ చేయండి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, గుర్తింపు వివరాలు, గత రుణ చరిత్ర, సంబంధిత ఇతర వివరాలను ఆన్‌లైన్‌ ఫారంలో పూర్తిచేయండి. ఆ తర్వాత పేమెంట్స్‌ పేజీలోకి వెళతారు. అక్కడ పేమెంట్‌ చేయడానికి ప్రీపెయిడ్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. ఇక్కడ క్రెడిట్‌ నివేదికను పొందడానికి CIBILకు రూ.550/- చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత ప్రమాణీకరణ (Authentication) పేజీకు వెళతారు. ఇక్కడ మీ క్రెడిట్‌ చరిత్రకు సంబంధించిన 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. వీటిలో CIBILతో మీ గుర్తింపును అథెంటికేట్‌ చేయడానికి కనీసం 3 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వాలి. అనంతరం మీ క్రెడిట్‌ నివేదిక 24 గంటల్లో మీ నమోదిత ఇ-మెయిల్‌కు పంపుతారు. ఒకవేళ ఈ ప్రక్రియలో విఫలమైతే, దరఖాస్తు హార్డ్‌ కాపీని పూర్తి చేసి మెయిల్‌ ద్వారా కూడా CIBILకు పంపవచ్చు. తదనంతరం ఇ-మెయిల్‌ ద్వారా నివేదికను అందుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని