Life Insurance: సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?

ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి.

Published : 18 Apr 2024 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మీ ఆదాయంపై ఆధారపడిన వ్యక్తులు ఉంటే ముఖ్యంగా ఆర్థిక బాధ్యతలు ఉన్నప్పుడు.. మీకు జీవిత బీమా రక్షణ అవసరం. జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత మీపై ఆధారపడిన వారికి ఎంత బీమా రక్షణ అవసరమో తెలుసుకోవడానికి ఆ కుటుంబం స్థిరపడేదాకా అయ్యే ఖర్చులు, పిల్లల ఫీజులు, భాగస్వామి పదవీ విరమణ అనంతరం వ్యయాలు లెక్కపెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా జీవిత బీమా పాలసీ (టర్మ్‌ ప్లాన్‌) కొనుగోలు చేసే సమయంలో మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక అవసరాలను కచ్చితంగా అంచనా వేయడం చాలా అవసరం.

ఖర్చులు

బీమా పాలసీ కవరేజ్‌ ఎంత ఉండాలో కనుక్కోవడానికి ఒక వ్యక్తి కుటుంబ స్వరూపం, వారి ప్రస్తుత/భవిష్యత్‌ ఖర్చులు, వారి అప్పులు, ఆస్తులు.. ఇలాంటి వాటినన్నింటినీ లెక్క కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకు రవి అనే వ్యక్తి 35 ఏళ్ల సాధారణ వర్కింగ్‌ ప్రొఫెషనల్‌. ఆయనతో పాటు తల్లిదండ్రులు, భార్య, 7, 3 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకవేళ అతడికి జరగరానిది జరిగితే.. కుటుంబానికి పూర్తిగా అతడే ఆధారం. ఆ కుటుంబానికి నెలవారీ ఖర్చులు దాదాపు రూ.60 వేలు. ఇంటి రుణం కూడా తీసుకున్నారు. దానికి రూ.30 వేలు ఈఎంఐ చెల్లిస్తున్నారు. బకాయి ఇంకా రూ.70 లక్షలు దాకా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రవి లాంటి వ్యక్తులకు ఎంత బీమా కవరేజ్‌ అవసరమో ఇక్కడ తెలుసుకుందాం.

వార్షిక ఖర్చులు

రవి కుటుంబ ఖర్చు సంవత్సరానికి రూ.7.20 లక్షలు. సాధారణంగా వార్షిక ఖర్చులకు 10-12 రెట్లు పాలసీ కవరేజ్‌ను తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ, అధిక ద్రవ్యోల్బణం, పిల్లల పెరుగుతున్న విద్యా ఖర్చులు, తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు బాగానే అవుతాయి. వీటినన్నింటికీ సరిపోవాలంటే, వార్షిక ఖర్చులకు 15 రెట్లు బీమా కవరేజీ ఉండాలి. అంటే భవిష్యత్‌ ఇంటి ఖర్చులకు బీమా హామీ సుమారుగా రూ.1.10 కోట్లు ఉండాలి.

ఇల్లు

రవి తను ఉద్యోగంలో ఉండగానే రుణంపై ఇల్లు కొనుగోలు చేశారు. అతడు అకస్మికంగా దూరమవ్వడంతో రూ.70 లక్షల వరకు బకాయి ఉంది. నెలవారీ ఖర్చులను భర్తీ చేయడంతో పాటు అలాంటి కుటుంబాలకు సొంత ఇల్లు కూడా చాలా అవసరం. సంపాదించే వ్యక్తి లేనప్పుడు సొంత ఇల్లు చాలా భరోసానిస్తుంది. కాబట్టి రూ.70 లక్షల రుణం కూడా బీమా పరిధిలో ఉండాలి.

పిల్లల ఖర్చులు

రవికి ఇద్దరు చిన్న పిల్లలు. వీరికి విద్య, వివాహం వంటి అనేక బాధ్యతలు ఉన్నాయి. తన పిల్లల భవిష్యత్‌ ఉత్తమంగా ఉండాలని ప్రతి తండ్రీ లాగే రవి కూడా ఆశించి వారి ఉన్నత చదవుల కోసం రాబోయే 15 ఏళ్లలో రూ.40 లక్షల నిధిని సమకూర్చడానికి ఇప్పటికే రూ.8,000 నెలవారీ సిప్‌ను ఏర్పాటు చేశాడు. అతడు దూరం కావడంతో ఈ లక్ష్యాన్ని ప్రమాదంలో పడేసింది. కాబట్టి, ఈ (రూ.40 లక్షల) మొత్తాన్ని రవి టర్మ్‌ జీవిత బీమా కవరేజ్‌ అవసరాలకు జోడించడం తెలివైన పని.

భాగస్వామి వృద్ధాప్య నిధి

రవి, తన కుటుంబం/భాగస్వామికి మరో 25 ఏళ్ల వరకు పైన తెలిపిన ఖర్చులకి సరిపడా టర్మ్ బీమా హామీ మొత్తాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా తన భాగస్వామికి ఖర్చుల కొరకు కొంత మొత్తం అవసరం పడతాయి. ఆమె 60 ఏళ్ల తర్వాత.. 25 ఏళ్లు అదనంగా జీవించే అవకాశం ఉండొచ్చు. దీనికి ప్రతి నెలా అప్పటి ద్రవ్యోల్బణాన్ని బట్టి సుమారు రూ.60 వేల వరకు పొందడానికి రూ.80 లక్షల వరకు అవసరం. దీన్ని కూడా టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో జోడించవచ్చు.

ఆస్తులు

ప్రతి వ్యక్తికి రుణాలు, బాధ్యతలతో పాటు కొన్ని ఆస్తులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి దాకా టర్మ్‌ బీమా కవరేజీని లెక్కించేటప్పుడు.. ఇంటి రుణం, ఇతర బాధ్యతల గురించి ప్రస్తావించాం. అయితే రవి వ్యక్తిగత బ్యాలెన్స్‌ షీట్‌కు సంబంధించిన మరొక వైపు కొన్ని సంవత్సరాలుగా చేసిన పెట్టుబడులు (పీఎఫ్‌, ఎఫ్‌డీలు, మ్యూచువల్‌ ఫండ్లు) ఉండొచ్చు. అవి రూ.30 లక్షల వరకు సమకూరాయి అనుకుందాం. ఇవి డబ్బు రూపంలో అతడు దూరమయ్యాక ఆ కుటుంబానికి తక్షణమే అందుబాటులో ఉంటాయి. అంటే అతడు తన జీవిత బీమా కవరేజ్‌ నుంచి ఆ మొత్తాన్ని తీసివేయొచ్చు.

కవరేజ్‌ ఎంతుండాలి?

ఈ పై అంశాలను బట్టి రవిని పోలి ఉండే వ్యక్తులకు బీమా కవరేజీ ఎంత ఉండాలి అనేది దాదాపుగా ఒక లెక్క అంచనా ఇక్కడ వచ్చింది. భవిష్యత్‌ కుటుంబ వార్షిక ఖర్చులకు రూ.1.08 కోట్లు, ఇంటి రుణ బకాయి రూ.70 లక్షలు, పిల్లల విద్యా ఖర్చులు రూ.40 లక్షలు, భాగస్వామి కోసం రూ.80 లక్షలు కలిపితే రూ.2.98 కోట్లు అవుతుంది. ఇందులో రవి సమకూర్చుకున్న పొదుపు రూ.30 లక్షలు తీసివేస్తే, అతడి బీమా కవరేజ్‌ సుమారుగా రూ.2.68 కోట్లు ఉండాలి. 35 ఏళ్ల వయసులో రవి ఇంత మొత్తానికి టర్మ్‌ బీమా తీసుకుంటే వార్షిక ప్రీమియం సగటున రూ.28 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

గమనిక: ఖర్చులు, ప్రతి కుటుంబంలో ఒకేలా ఉండకపోవచ్చు. వారి వ్యక్తిగత అవసరాలను బట్టి స్వల్ప/భారీ మార్పులుండొచ్చు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ ఖర్చులు, బీమా విషయంలో ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు