EDLI Scheme: ఈడీఎల్‌ఐ స్కీమ్ గురించి తెలుసా? పూర్తి వివరాలు ఇవిగో..

‘EPFO’ సభ్యులందరికీ, ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌(EDLI) పథకం వర్తిస్తుంది. ఈ స్కీం ద్వారా వర్తించే ఆర్థిక ప్రయోజనాలు, క్లెయిమ్స్‌ గురించి తెలుసుకోండి.

Updated : 16 Mar 2023 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా ప్రయోజనాలను ప్రైవేట్‌ రంగ ఉద్యోగులకు విస్తరించేందుకు, ప్రభుత్వం 1976లో ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (EDLI)ను ప్రవేశపెట్టింది. ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ ఏకమొత్తంలో బీమా మొత్తాన్ని అందుకుంటారు. ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం, 1952 కింద నమోదు అయిన అన్ని సంస్థలకు EDLI వర్తిస్తుంది. అటువంటి అన్ని సంస్థలు తప్పనిసరిగా ఈ పథకం సభ్యత్వం పొందాలి. ఈ పథకం EPF, EPSతో కలిపి పనిచేస్తుంది.

ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (EDLI)

రూ.15,000 లోపు మూల వేతనం ఉన్న ఉద్యోగులందరికీ EDLI వర్తిస్తుంది. 2021 నుంచి EPFO సభ్యుల గరిష్ఠ బీమా ప్రయోజన మొత్తాన్ని పెంచింది. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఏదైనా సంస్థ EPFO కోసం నమోదు చేసుకోవాలి. కాబట్టి, EPFO ఖాతాను కలిగి ఉన్న ఏ ఉద్యోగి అయినా ఆటోమేటిక్‌గా EDLI స్కీమ్‌కు అర్హులు అవుతారు. అయితే, యజమాని ఈ EDLI పథకాన్నే కాకుండా మరొక గ్రూప్‌ బీమా పథకాన్ని కూడా ఎంచుకోవచ్చు. కానీ, అందించే ప్రయోజనాలు తప్పనిసరిగా EDLI కింద అందించే వాటికంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

ఆర్థిక ప్రయోజనాలు

ఉద్యోగి మరణిస్తే.. అతడిపై ఆధారపడిన కుటుంబసభ్యులు EDLI ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. సర్వీసులో ఉన్న ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో అర్హతగల కుటుంబసభ్యులకు రూ.7 లక్షల గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాన్ని ఏక మొత్తంగా 'EPFO' అందిస్తుంది. మరణించిన సభ్యుడు మరణానికి ముందు 12 నెలల పాటు నిరంతర ఉద్యోగ సర్వీసులో ఉంటే.. కనీస హామీ ప్రయోజనం కింద అర్హతగల కుటుంబ సభ్యులకు రూ.2.50 లక్షలు అందుతుంది. బీమా ప్రయోజనం నేరుగా నామినీ లేదా చట్టపరమైన వారసుడి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఈపీఎఫ్‌వో చట్టం వర్తించే అన్ని ఫ్యాక్టరీలు, ఇతర సంస్థల ఉద్యోగులకు EDLI పథకం వర్తిస్తుంది.

EDLIకు చందా

ఈ బీమాకు ఉద్యోగి ఎటువంటి చందా చెల్లించనవసరం లేదు. ఉద్యోగులు ఈపీఎఫ్‌కు చందా సహకారం అందిస్తే సరిపోతుంది. EDLI నిబంధనల ప్రకారం యజమాని.. ఉద్యోగి బేసిక్‌, డీఏలో 0.50% లేదా గరిష్ఠంగా నెలకు రూ.75 చెల్లించాలి. యజమాని చందా  EPF కోసం 3.67%, ఈపీఎస్‌ కోసం 8.33% లేదా రూ.1,250/-, EDLI కోసం 0.50% లేదా గరిష్ఠంగా రూ.75/-. బీమా పరిధిలో ఉన్న వ్యక్తి మరణించిన సందర్భంలో నమోదు చేసుకున్న నామినీ ఏకమొత్తంలో బీమా మొత్తం అందుకుంటారు. నామినీ పేరు లబ్ధిదారుడుగా నమోదు కానట్లయితే.. ఆ మొత్తం చట్టబద్ధమైన వారసుడికి అందుతుంది.

EDLI కింద క్లెయిమ్‌ ప్రాసెస్‌ చేయడానికి ఏ పత్రాలు సమర్పించాలి?

  • ఫారం 5 IF పూర్తిచేయాలి.
  • EDLI కింద నమోదయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం
  • చట్టపరమైన వారసుడు క్లెయిమ్‌ ఫైల్‌ చేసిన సందర్భంలో వారసత్వ సర్టిఫికెట్‌
  • సహజ సంరక్షకుడు కాకుండా మరొక వ్యక్తి మైనర్‌ తరఫున దావా వేస్తే.. అతడి గార్డియన్‌షిప్‌ సర్టిఫికెట్‌
  • చెల్లింపును స్వీకరించే వ్యక్తి ఖాతాకు సంబంధించి రద్దు చేసిన చెక్‌ 

ప్రయోజనాలను ఎలా క్లెయిమ్‌ చేయాలి?

EDLI కింద బీమా మొత్తాన్ని స్వీకరించడానికి నామినీ నమోదు కానట్లయితే, కుటుంబ సభ్యులు లేదా చట్టపరమైన వారసులు దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరణించిన వ్యక్తి ఆ సమయంలో EPF స్కీమ్‌కు యాక్టివ్‌ కంట్రిబ్యూటర్‌గా ఉండాలి. EDLI ఫారం 51Fను హక్కుదారు పూర్తి చేసి సమర్పించాలి. క్లెయిమ్‌ ఫారంపై యజమాని సంతకం చేసి ధ్రువీకరించాలి. 

క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేయడానికి క్లెయిమ్‌దారుడు తప్పనిసరిగా పూర్తి చేసిన ఫారంతో పాటు అన్ని డాక్యుమెంట్‌లను ప్రాంతీయ EPF కమిషనర్‌ కార్యాలయంలో సమర్పించాలి. ఈపీఎఫ్‌ కమిషనర్‌ క్లెయిమ్‌ స్వీకరించిన 30 రోజులలోపు క్లెయిమ్‌ సొమ్మును అందజేయాలి. లేకపోతే  ఆలస్యమయిన కాలవ్యవధికి ఏడాదికి 12% వడ్డీతో పాటు హక్కుదారుకు క్లెయిమ్‌ సొమ్ము అందజేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని