Real Estate: స్థిరాస్తి పెట్టుబడుల వైవిధ్యీకరణ ఎలా?

స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వివిధ వినియోగ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు.

Published : 27 Feb 2024 18:20 IST

భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టడం అనేది మీ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడంలో కీలక అంశం. దేశంలో వివిధ కాలవ్యవధులలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, స్థిరాస్తి రంగం దశాబ్దాలుగా ప్రముఖ పెట్టుబడి రూపంగా ఉంది. దేశ స్థిరాస్తి మార్కెట్‌ వృద్ధి చెందడంతో, పెట్టుబడిదారులు తమ రాబడిని పెంచుకోవడానికి ఈ రంగంలో అనేక మార్గాల్లో  పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. మీ స్థిరాస్తి ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌పోలియోను వైవిధ్యపరచడం అనేది రిస్క్‌ను తగ్గించడానికి, రాబడిని పెంచుకోవడానికి ఒక గొప్ప మార్గం. స్థిరాస్తి రంగంలో వైవిధ్యీకరణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూద్దాం..

అనేక ప్రాంతాల్లో పెట్టుబడులు

పెట్టుబడిదారుడు తన వద్ద ఉన్న పెట్టుబడి మొత్తాన్ని ఒకే ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల్లో విభజించాలి. దీనివల్ల స్థానిక ఆర్థిక పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, ఆస్తి విలువలను ప్రభావితం చేసే ఇతర కారకాలతో సంబంధం ఉన్న నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు ఒకే నగరంలో అనేక ఆస్తులను కలిగి ఉంటే, ఏవైనా పరిస్థితుల కారణంగా ఆ నగరంలో ఇబ్బందులు ఏర్పడితే.. అది అతడి పోర్ట్‌ఫోలియోపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నగరానికి పోటీగా ఉన్న ప్రాంతాలు సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ముందుచూపుతో ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుబడి పెడితే, ఒకచోట వచ్చిన నష్టాన్ని వేరేచోట కవర్‌ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి  స్థిరాస్తి పోర్ట్‌ఫోలియో మెరుగ్గా ఉంటుంది.

వివిధ రకాల ఆస్తులు

పెట్టుబడిదారుడు ఒకే రకమైన స్థిరాస్తి రకంలో కాకుండా.. వాణిజ్య, నివాస, పారిశ్రామిక, మిశ్రమ వినియోగ ప్రాపర్టీలు వంటి వివిధ రకాల వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. వివిధ రకాల ఆస్తులను కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడిదారులు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు పెట్టుబడిదారుడి వాణిజ్యపరమైన ఆస్తులను మాత్రమే కలిగి ఉంటే, వాణిజ్యపరమైన మార్కెట్లో తిరోగమనం ఏర్పడినప్పుడు పోర్ట్‌ఫోలియోపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి సందర్భంలో పెట్టుబడిదారుడు.. నివాస/పారిశ్రామిక ఆస్తులను కూడా కలిగి ఉంటే, అతడి ఆస్తులు అదే స్థాయిలో ప్రభావితం కాకపోవచ్చు.

అద్దె ఆదాయం

వాణిజ్య ఆస్తులు మెరుగైన అద్దె ఆదాయాన్ని అందిస్తాయి. నివాసయోగ్య ఆస్తులు సాధారణంగా 3-4 శాతం వార్షిక అద్దె ఆదాయాన్ని అందిస్తే వాణిజ్య ఆస్తులు 7-8% ఆదాయాన్ని అందించగలవు. కాబట్టి, మీ పోర్ట్‌ఫోలియోలో ఇలాంటి వాటిని కూడా పరిశీలించవచ్చు. 

REITs

మీ స్థిరాస్తి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి ఒక ప్రత్యేకమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే REITsలో పెట్టుబడి పెట్టవచ్చు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులకు REITs వైవిధ్య, అనుకూలమైన మార్గాన్ని అందిస్తాయి. భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (REIT) అనేది కార్యాలయం భవనాలు, నివాస అపార్ట్‌మెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, గిడ్డంగులు వంటి ఆస్తులను కలిగి ఉండే సంస్థ. చాలా మంది పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను సేకరించి రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించిన విభిన్న ఆస్తులను కొనుగోలు చేసి వాటి ద్వారా REITs ఆదాయాన్ని సంపాదిస్తాయి. ఈ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిదారులకు డివిడెండ్ల రూపంలో పంపిణీ చేస్తాయి. దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడిదారులకు పారదర్శకమైన, నియంత్రణలతో కూడిన పెట్టుబడిని అందించడానికి 2014లో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) ద్వారా REITsను ప్రవేశపెట్టారు. మార్కెట్‌లో అనేక REITs ఉన్నాయి, వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

ఈక్విటీ REITs: ఈ REITs ప్రధానంగా అపార్ట్‌మెంట్స్, ఆఫీసులు, షాపింగ్‌ సెంటర్స్‌, హోటల్స్ వంటి ఆదాయం వచ్చే ఆస్తులలో పెట్టుబడి పెడతాయి. ఈక్విటీ REITs అద్దె ఆదాయం నుంచి ఆదాయాన్ని పొందుతాయి. అంతేకాకుండా కాలక్రమేణా వీటి ఆస్తుల విలువ కూడా పెరుగుతుంది.

హైబ్రిడ్‌ REITs: ఇది ఈక్విటీ, డెట్‌ సాధనాల కలయికను కలిగి ఉంటుంది. ఆదాయం వచ్చే ఆస్తులను, తనఖా ఆధారిత సెక్యూరిటీలు రెండింటిని కలిగి ఉండొచ్చు.

రిటైల్‌ REITs: ఇది షాపింగ్‌ మాల్స్‌, రిటైల్‌ ప్రాపర్టీలను కలిగి ఉంటుంది. వీటికి ఆదాయం అద్దెల ద్వారా లభిస్తుంది, అంతేకాకుండా ఆస్తుల విక్రయం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు.

రెసిడెన్షియల్‌ REITs: ఈ REITs నివాస అపార్ట్‌మెంట్‌ భవనాలు, ఇళ్ల ప్రాపర్టీలను నిర్వహిస్తాయి. వీటి ద్వారా అద్దె ఆదాయాన్ని పొందుతాయి.

ఆఫీస్‌ REITs: ఈ REITs కార్యాలయాలపై పెట్టుబడి పెడతాయి. అద్దెల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తాయి. ఉదాహరణకు భారత్‌లో బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా REIT.. ముంబయి, గురుగ్రామ్‌, నోయిడా, కోల్‌కతాలో వాణిజ్యపరమైన ఆస్తులతో కూడిన కార్యాలయాలలో పెట్టుబడులను కలిగి ఉంది.

ఇండస్ట్రియల్‌ REITs: ఈ రకం REITs.. గిడ్డంగులు, పంపిణీ కేంద్రాలు వంటి పారిశ్రామిక ఆస్తులను కలిగి ఉండి, వాటిని నిర్వహిస్తుంది. ఇవి అద్దె ద్వారా ఆదాయం పొందుతాయి. లీజు ఒప్పందాలు, ఆస్తుల విక్రయం నుంచి లాభాలను ఆర్జించవచ్చు.

పెట్టుబడిదారులు తమ స్టాక్‌ బ్రోకర్ల ద్వారా REIT యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. విక్రయించొచ్చు. కొన్ని మ్యూచువల్‌ ఫండ్లు REITsలో పెట్టుబడి పెడతాయి. వీటిలో పెట్టుబడికి గాను మ్యూచువల్‌ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్లకు కొన్ని స్కీంలను ఆఫర్‌ చేస్తాయి. REIT తన యూనిట్లను అమ్మకానికి అందజేసినప్పుడు ప్రైమరీ మార్కెట్‌ ద్వారా పెట్టుబడిదారులు నేరుగా REITsలో పెట్టుబడి పెట్టొచ్చు.

స్టాక్స్‌, బాండ్లు వంటి ఇతర ఆస్తులతో పోలిస్తే REITs ఆకర్షణీయమైన రాబడిని అందిస్తున్నాయి. వీటిపై రాబడి నిర్వహణతో సహా అనేక అంశాల ఆధారంగా మారవచ్చు. REITs ఇప్పటివరకు ఆకర్షణీయమైన రాబడిని అందించినప్పటికీ ఇవి మార్కెట్‌ రిస్క్‌కు లోబడి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని