Small Saving Schemes: పోస్టాఫీస్‌ పొదుపు పథకాల డెత్‌ క్లెయిమ్‌ ఎలా?

PPF, సుకన్య సమృద్ధి యోజన, NSC వంటి పోస్టాఫీసు పథకాల డెత్‌ క్లెయిమ్ నిబంధనలు ఇక్కడ చూడండి.

Published : 24 Mar 2023 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోస్టాఫీస్‌ మంత్లీ ఇనకమ్‌ స్కీమ్‌(PO-MIS), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC) లాంటి పోస్టాఫీసు పొదుపు పథకాలు మనకందరికీ సుపరిచితమే. చాలామంది పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలలో మదుపు చేస్తుంటారు. ఈ పథకాలన్నింటికీ నామినీ సౌకర్యం కూడా ఉంది. అయితే, డిపాజిటర్లు కొన్ని దురదృష్టకరమైన కారణాల వల్ల మరణించొచ్చు. ఇలాంటి సందర్భాల్లో క్లెయిం దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం.

క్లెయిం ఎలా?

డిపాజిట్‌దారుడు మరణించాక క్లెయిం మొత్తాన్ని నామినీ/చట్టపరమైన వారసులకు అందజేస్తారు. కానీ, క్లెయిం మొత్తం రూ.5 లక్షలు దాటితే (చట్టపరమైన ఆధారాలు లేని సందర్భంలో) క్లెయిమ్‌దారుడు తప్పనిసరిగా కోర్టు నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొంది, ఆ పత్రాన్ని సంబంధిత కార్యాలయానికి సమర్పించాలి.

నామినీ చనిపోతే?

నామినీ మరణించిన సందర్భంలో చట్టపరమైన వారసుడికి కాకుండా, మరణించిన నామినీకి సంబంధించిన చట్టపరమైన వారసునికి అనుకూలంగా ఖాతా క్లెయిమ్‌ దక్కుతుంది.

చట్టపరమైన ఆధారాలు లేకపోతే?

నామినీ పేర్కొనని సందర్భంలో(లేదా) క్లెయిమ్‌దారుని వద్ద ఎటువంటి చట్టపరమైన సాక్ష్యాలు లేనప్పుడు.. డిపాజిటర్‌ మరణించిన ఆరు నెలల తర్వాత క్లెయిమ్‌ దాఖలు చేయొచ్చు. అయితే,  తుది క్లెయిమ్‌ మొత్తం రూ.5 లక్షలకు మించకూడదు. హక్కుదారుడు తప్పనిసరిగా మరణ ధ్రువీకరణ పత్రం, పాస్‌ పుస్తకం (లేదా) డిపాజిట్‌ రసీదులు, అఫిడవిట్‌, డిస్‌క్లైమర్‌ లెటర్‌, ఇండెంనిటీ బాండ్‌ (నష్టపరిహారానికి సంబంధించినది)లాంటి పత్రాలను సంబంధిత పోస్టల్‌ అథారిటీకి సమర్పించాలి.

(మరణించిన వ్యక్తి) ఖాతాలో మొత్తం రూ.5 లక్షలు మించితే క్లెయిమ్‌ ఫారం, మరణ ధ్రువీకరణ పత్రం, పాస్‌ పుస్తకం (లేదా) డిపాజిట్‌ రసీదులు లాంటి పత్రాలతో పాటు కోర్టు జారీ చేసిన ‘సక్సేషన్‌ సర్టిఫికేట్‌’ను కూడా సమర్పించాలి. ఇవన్నీ సమర్పించిన తర్వాత క్లెయిమ్‌దారుడు గడువులోపు పరిహారాన్ని పొందొచ్చు.

చివరిగా: క్లెయిం కోసం కేవైసీ పత్రాల జిరాక్స్‌ కాపీలు సమర్పించినా కూడా, ఒరిజినల్‌ కేవైసీ పత్రాలతో వాటిని ధ్రువీకరిస్తారు. కాబట్టి, అన్ని ఒరిజనల్స్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. కేవైసీ పత్రాల కాపీలపై సాక్షుల సంతకాలు అవసరం. బ్యాంకు, పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా వివరాలను తప్పనిసరిగా అందించాలి. క్లెయిమ్‌ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని