Real Estate: స్థిరాస్తికి సంబంధించి ఈ విషయాలు మీకు తెలుసా?

స్థిరాస్తిలో చాలా మంది పెట్టుబడి పెట్టే ఉంటారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం అవసరం. అవేంటో ఇక్కడ చూడండి.

Published : 16 Feb 2024 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది తమ జీవితంలో ఏదో ఒకసారి ఇల్లు నిర్మాణం లేదా కొనుగోలు చేసి ఉంటారు. కనీసం కొనుగోలుకు ప్రయత్నించి ఉంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్థిరాస్తి పెట్టుబడి అనేది అధిక మొత్తంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాటిపై అవగాహన ముఖ్యం.

కార్పెట్‌ ఏరియా

ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ముందుగా వినిపించేది ఈ పదమే. ఇది ఆస్తికి సంబంధించిన వాస్తవ వినియోగ ప్రాంతాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఇది గోడల మందాన్ని మినహాయించి, ఇంటి లోపల ఉపయోగించే ఏరియా మొత్తాన్ని సూచిస్తుంది. ఆస్తి కొనుగోలుదారులు కార్పెట్‌ ఏరియాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఇంటిలో నివసించేవారి అవసరాలకు అందుబాటులో ఉన్న స్థలం. ఇది ఆస్తి విలువను నిర్ణయించడంలో కీలకమైన అంశం. దీని గురించి వినియోగదారులు బిల్డర్‌ను తప్పక అడిగి తెలుసుకోవాలి. ఇలా ముందే తెలుసుకోవడం వల్ల ఆ ఏరియా నివాసానికి సరిపోతుందో లేదో మీకు స్పష్టంగా తెలుస్తుంది. బాల్కనీ, టెర్రస్‌, యుటిలిటీ ఏరియా మొదలైన ఇతర ప్రాంతాలు కార్పెట్‌ ఏరియా కిందకు రావు.

బిల్ట్-అప్‌ ఏరియా

సాధాణంగా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు.. బిల్డర్లు మొత్తం ఏరియా (బిల్ట్-అప్‌ ఏరియా) గురించే చెబుతారు. కొనుగోలుదారుల వద్ద డబ్బులు వసూలు చేసేది కూడా ఈ బిల్ట్-అప్‌ ఏరియాకే. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ధర నిర్ణయంలో ఇదే కీలకపాత్ర వహిస్తుంది. ఆస్తికి సంబంధించిన బిల్ట్-అప్‌ ఏరియాలో ఇంటి కార్పెట్‌ ఏరియా, గోడల మందంతో తీసుకున్న ప్రాంతం, బాల్కనీలు, కామన్‌ ఏరియా ఉంటాయి. సాధారణంగా బిల్ట్-అప్‌ ఏరియా కార్పెట్‌ ఏరియా కంటే 15-25% ఎక్కువ ఉంటుంది.

సేల్‌ డీడ్‌

ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్న తర్వాత విక్రేత.. కొనుగోలుదారుడికి ఆస్తిని అమ్మినప్పుడు, ఇది విక్రయానికి సంబంధించిన చట్టపరమైన రికార్డు అని చెప్పవచ్చు. దీనిపై విక్రేత, కొనుగోలుదారుడు సంతకం చేస్తారు. సేల్‌ డీడ్‌ను అమలు చేయకుండా ఏ రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీ చెల్లుబాటు కాదు. ఇది ఆస్తి కొనుగోలుదారులకు చాలా ముఖ్యమైన చట్టపరమైన పత్రం.

స్టాంప్‌ డ్యూటీ

స్టాంప్‌ డ్యూటీ అనేది ఆస్తి అమ్మకం, కొనుగోలు/బదిలీపై విధించే పన్ను. ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు దాని విలువను బట్టి స్టాంప్‌ డ్యూటీ చెల్లించి ప్రభుత్వ సబ్‌-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించవలసి ఉంటుంది. స్టాంప్‌ డ్యూటీ, ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇది ప్రతి రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటుంది. ఆస్తి విలువలో 3-8% వరకు కూడా ఉండొచ్చు. పురుషుల కంటే స్త్రీలకు స్టాంప్‌ డ్యూటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల, మహిళా కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తిని నమోదు చేస్తే స్టాంప్‌ డ్యూటీలో కొద్ది మొత్తాన్ని ఆదా చేయొచ్చు.

ముగింపు రుసుములు

చాలా మంది కొనుగోలుదారులకు ముగింపు రుసుములు (Closing Cost) గురించి తెలియదు. స్థిరాస్తి కొనుగోలు పూర్తయిన అనంతరం వినియోగదారుడు అనేక ఛార్జీలను భరించవలసి ఉంటుంది. ఇందులో బ్యాంకులు, బీమా సంస్థలు, న్యాయవాదులు, స్థిరాస్తి ఏజెంట్లు, పన్ను విధించే వర్గాలు, ఇంటి యాజమానుల అసోసియేషన్‌లు అనేక స్థిరాస్తి సంబంధిత ఖర్చులను వసూలుచేస్తాయి. ఆస్తిని కొనుగోలు చేసినవారు అన్ని లావాదేవీలను ముగించేటప్పుడు ఈ ఛార్జీలను చెల్లిస్తారు. అందుచేత వీటిని Closing Costs అంటారు.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (OC)

ఆస్తిని స్వాధీనం చేసుకునేటప్పుడు ఇంటి యజమానులందరికి కావల్సిన ముఖ్యమైన పత్రం ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌. అధికారులు ఆమోదించిన ప్లాన్ ప్రకారం ఆస్తి నిర్మితమైందని ఇది ధ్రువీకరిస్తుంది. దీన్ని స్థానిక సంబంధిత అధికారులు జారీ చేస్తారు. ఆస్తికి విద్యుత్‌, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అన్ని అవసరాలు ఉన్నాయని, నివాసయోగ్యమేనని OC కొనుగోలుదారుడికి హామీనిస్తుంది.

హోమ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ (HOA)

అపార్ట్‌మెంట్‌ అనేది కొన్ని ఫ్లాట్స్ కలయిక. ఇక్కడ ప్రతిదీ సక్రమంగా జరగడానికి ఇంటి యజమానులందరి కోసం ఒక అసోసియేషన్‌ అవసరం. ఆస్తులను సరిగ్గా నిర్వహించడానికి, కమ్యూనిటీ నియమాలకు కట్టుబడి ఉండడానికి, కాలానుగుణ మరమ్మతులు తక్షణమే జరిపించడానికి ఈ అసోసియేషన్‌ ఎంతగానో తోడ్పడుతుంది. ఇంటి యజమానులు ఈ అసోసియేషన్‌కు ప్రతి నెలా క్రమం తప్పకుండా రుసుములు చెల్లించవలసి ఉంటుంది.

బిల్డింగ్‌ బైలాస్‌

పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా నిర్దేశించిన కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలు భవనానికి దాని రూపకల్పన, ఎత్తు, నిర్మాణ భద్రత మొదలైన అనేక అంశాలను నియంత్రిస్తాయి. వీటన్నింటిని సమష్టిగా బిల్డింగ్‌ బైలాస్‌ అంటారు.

RERA

RERA అంటే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ. దీన్ని 2016లో భారత పార్లమెంట్‌ ఆమోదించింది. RERA ముఖ్య లక్ష్యం ఇంటి కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడం.. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని ప్రోత్సహించడం. RERA ప్రకారం.. డెవలపర్లు తమ ప్రాజెక్టులను RERAలో నమోదు చేసుకుని ప్రాజెక్ట్‌ ప్లాన్స్‌, లే అవుట్‌, పూర్తి చేసే తేదీ వంటి సమాచారాన్ని కొనుగోలుదారులకు అందించాలి. ఇది డెవలపర్లు నిర్దిష్ట ప్రమాణాలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చూస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే డెవలపర్లకు జరిమానాలు విధిస్తుంది. ఆస్తి కొనుగోలుదారులకు RERA మెరుగైన పారదర్శకతను అందిస్తుంది. ఇంటి కొనుగోలుదారులు ఇప్పుడు RERA వెబ్‌సైట్‌లో నిర్మాణంలో ఉన్న ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని