₹500 నోటు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రూ. 500 నోటులో ఉండే ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం.

Updated : 25 Mar 2023 22:05 IST

మనలో చాలా మంది రోజువారీ లావాదేవీల కోసం రూ.500 నోటు వాడుతూనే ఉంటారు. 2016 లో ప్రభుత్వం ఈ నోటులో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నోటులోని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

సెక్యూరిటీ థ్రెడ్‌

సెక్యూరిటీ థ్రెడ్‌ అనేది కరెన్సీ నోట్‌లో పొందుపరిచిన నిలువు గీత. ఇది కరెన్సీకి సంబంధించి ముఖ్యమైన భద్రతా ఫీచర్‌లలో కీలకమైంది. గ్రీన్‌ (ఆకుపచ్చ) రంగులో ఉండే ఈ గీత.. నోటును వంచి చూసినప్పుడు థిక్‌ బ్లూ (ముదురు నీలం) రంగులోకి మారుతుంది. గీత రంగు మారకపోతే అది అసలైన కరెన్సీ కాకపోవచ్చు.

వాటర్‌ మార్క్‌

కరెన్సీ నోటు కుడి, ఎడమన ఒకవైపు ఖాళీ ప్రదేశంలో కాస్త వెలుతురులో నోటును చూసినప్పుడు మహాత్మా గాంధీ చిత్రం, అంకెలలో నోటు విలువ సంఖ్య వాటర్‌మార్క్‌ కనిపిస్తుంది. వాటర్‌ మార్క్‌తో పాటు నోట్‌ విలువ సంఖ్య తప్పనిసరి.

చిన్న అక్షరాలు

కరెన్సీ నోటుపై చిన్న పరిమాణంలో కూడా ఇంగ్లీషు, హిందీ భాషలో అక్షరాలు లిఖించి ఉంటాయి. అక్షరాస్యత, కంటిచూపు కలిగినవారు ఎవరైనా ఈ అక్షరాలను స్పష్టంగా చదవగలిగేలా ఉంటాయి.

ముద్రణ

కరెన్సీ నోటు ముద్రణలో చాలా గీతలతో కూడిన డిజైన్స్‌, కొన్ని ఇమేజెస్‌ ఉంటాయి. వీటి నాణ్యత స్పష్టంగా, షార్ప్‌గా ఉంటాయి. రంగులు ప్రకాశవంతంగా ఉంటాయి. నోటు కొద్ది సేపు తడిసినా, చెమటకు గురయినా.. రంగులు, ముద్రణ నాణ్యతలో తేడాలుండవు. 

పేపర్‌ నాణ్యత

కరెన్సీ నోటును ముద్రించే కాగితం సాధారణ పేపర్‌ లాంటిది కాదు. ఇది 75% పత్తి, 25% నార మిశ్రమంతో కూడిన కాటన్‌ పేపర్‌. ఈ కారణం చేత నోటు కొద్ది సేపు తడిచినా కూడా మామూలు పేపర్‌లా చిరగదు.

ఇంటాగ్లియో ప్రింటింగ్‌

కరెన్సీ నోటుపై మహాత్మ గాంధీ చిత్రం ఉండే నోటు వైపు ఎడమ, కుడి చివర్లలో క్రాస్‌గా ఐదు చిన్న గీతలు ఉంటాయి. వీటిని వేళ్లతో తడిమినప్పుడు ఉబ్బెత్తుగా అనిపిస్తాయి. ఇది నోటుపై ఉబ్బెత్తు ప్రభావాన్ని కలుగజేసే సాంకేతిక ప్రింటింగ్‌ ప్రక్రియ. ఈ గీతలను వేళ్లతో తడిమినప్పుడు స్పర్శ తెలుస్తుంది.

చివరిగా: ఈపై విషయాలన్ని మీరు తెలుసుకున్నట్లయితే రూ.500 నోటు అసలైనదా, కాదా అనేది వేగంగా తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని