Mutual Funds: స్థిరమైన రాబడి కోసం..

జెరోధా మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి రెండు ఈటీఎఫ్‌ పథకాలను ఆవిష్కరించింది. ఇందులో ఒకటి జెరోధా నిఫ్టీ 100 ఈటీఎఫ్, మరోటి జెరోధా నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఈటీఎఫ్‌.

Published : 31 May 2024 00:51 IST

జెరోధా మ్యూచువల్‌ ఫండ్‌ ఒకేసారి రెండు ఈటీఎఫ్‌ పథకాలను ఆవిష్కరించింది. ఇందులో ఒకటి జెరోధా నిఫ్టీ 100 ఈటీఎఫ్, మరోటి జెరోధా నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఈటీఎఫ్‌. ఇవి రెండూ ఓపెన్‌ ఎండెడ్‌ పథకాలే. ప్యాసివ్‌ మేనేజ్‌మెంట్‌ తరగతికి చెందినవి. అంటే ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ పరిమితంగా ఉంటుంది. ముందుగా నిర్దేశించిన నియమాల ప్రకారం ఫండ్లను నిర్వహిస్తారు. జెరోధా నిఫ్టీ 100 ఈటీఎఫ్‌ పథకం నిఫ్టీ టీఆర్‌ఐ సూచీని పోలి ఉంటుంది. అదే విధంగా జెరోధా నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 150 ఈటీఎఫ్‌ నిఫ్టీ 150 మిడ్‌ క్యాప్‌ టీఆర్‌ఐ సూచీకి దగ్గరగా ఉంటుంది. ఈ రెండు పథకాలకూ కేదార్‌నాథ్‌ మిరాజ్‌కర్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. 

ప్రధానంగా లార్జ్, మిడ్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీలే ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పోర్ట్‌ఫోలియోలో ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలంలో తక్కువ రిస్కుతో, స్థిరమైన ప్రతిఫలాన్ని ఆశించే మదుపరులకు అనుకూలమని చెప్పొచ్చు. ఈటీఎఫ్‌ పథకాలు కాబట్టి, నిర్వహణ వ్యయాలు (టీఈఆర్‌) తక్కువగా ఉంటాయి. ఈ రెండు పథకాల ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 7 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో ఒక్కో పథకంలో కనీసం రూ,1000 చొప్పున పెట్టుబడి పెట్టాలి.


చిన్న కంపెనీల్లో..

జేఎం మ్యూచువల్‌ ఫండ్‌ ఒక స్మాల్‌ క్యాప్‌ పథకాన్ని ప్రారంభించింది. జేఎం స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ అనే ఈ కొత్త పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 10 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈక్విటీ స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 250 టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. అసిత్‌ భండార్కర్, చైతన్య ఛోస్కి, గుర్విందర్‌ సింగ్‌ వాసన్‌ ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.

పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో ‘బాటమ్‌- అప్‌’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. అంటే దీర్ఘకాలంలో స్థిరంగా ఆదాయాలు, లాభాలు ఆర్జించే కంపెనీలపై పెట్టుబడి పెడుతుంది. దాదాపు 65 శాతం నిధులు స్మాల్‌క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీల షేర్లకు కేటాయిస్తారు. మిగిలిన నిధులను రుణ పత్రాలు, రీట్స్‌/ఇన్విట్‌లపై పెట్టుబడి పెట్టొచ్చు. స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో నష్టభయం ఎక్కువ. అందువల్ల దీర్ఘకాలం పాటు ఎదురుచూసే ఓపిక ఉండి, రిస్కు తీసుకోగల మదుపరులు స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో మదుపు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని